స్టీల్ ప్లాంట్ ను రక్షించాలని విశాఖ లో న్యాయవాదులు ఆందోళన..
పెన్ పవర్,విశాఖపట్నం
విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించాలని కోరుతూ విశాఖలో న్యాయవాదులు ఆందోళన నిర్వహించారు. విశాఖ ఉక్కు ఐక్య పోరాట సమితి పిలుపుమేరకు శుక్రవారం చేపట్టిన రాష్ట్ర బంద్ కు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ విశాఖ యూనిట్ మద్దతు ప్రకటించింది. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు మెయిన్ గేటు ఎదుట ధర్నా చేపట్టిన న్యాయవాదులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నగర ప్రధాన కార్యదర్శి జహారా మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ కు క్యాపిటల్ మైన్స్ కేటాయించాలని , స్టీల్ ప్లాంట్ అప్పులను పూర్తిగా రద్దు చేయాలని, స్టీల్ ప్లాంట్ కి చెందిన 32 వేల ఎకరాల భూములను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ప్లాంట్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు, స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు , ఆర్ కార్డు హోల్డర్లకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె ఎస్ సురేష్ కుమార్ మాట్లాడుతూ 32 మంది ప్రాణ త్యాగాల తో నిర్మితమైన స్టీల్ ప్లాంట్ ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించ లనుకోవడం దుర్మార్గమని విమర్శించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవడానికి ప్రాణ త్యాగాలకు కూడా వెనుకాడేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎన్ని త్యాగాలు అయినా చేసి స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి జె ఆర్ అజయ్ కుమార్, ట్రెజరర్ హేమమాలిని, న్యాయవాదులు జి సుబ్బారావు, జి సుశీల, పెద్ద సంఖ్యలో న్యాయవాదులు, విద్యార్థులు పాల్గొన్నారు.