నేల రాలిన మరో ప్రైవేటు టీచర్
సూర్యాపేట,పెన్ పవర్
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి వారిని భావిభారత పౌరులుగా మార్చే శక్తిసామర్థ్యాలు గల టీచర్ల భవిష్యత్తు నేడు అగమ్యగోచరంగా మారింది అనడానికి మరొక ఉదాహరణ. అనాజిపురం మోడల్ స్కూల్ లో గత 4 సంవత్సరాలుగా PGT (తెలుగు పండిట్) గా సేవలందిస్తూ వస్తున్న సూర్యాపేట పట్టణంలోని సీతారాంపురం ప్రాంతానికి చెందిన జానపాడు సైదులు (43) అనే ప్రైవేట్ టీచర్ ఆర్థిక ఇబ్బందులతో గుండెపోటుకు గురై మరణించడం జరిగింది.
కరోనా కారణంగా లాక్ డౌన్ విధించినప్పటినుండి గత 11 నెలలుగా జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ, రోజు కూలీ పనికి వెళ్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్న జానపాటి సైదులు గారు, పాఠశాలలు పునః ప్రారంభం అయినప్పటికీ హెచ్ బీ టీ లను ప్రభుత్వం ఇంకా విధుల లోనికి తీసుకోకపోవడం వలన మనస్థాపానికి గురై గుండెపోటుతో అకాల మరణం చెందారు. సైదులు గారి మరణ వార్త తెలుసుకున్న టి పి టి ఎఫ్ నాయకులు వారి మృతదేహాన్ని సందర్శించి వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ ఇప్పటికైనా ప్రభుత్వం ఆదుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న టి పి టి ఎఫ్ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మహమూద్ అలీ గారు మాట్లాడుతూ ప్రైవేట్ టీచర్ల ను ఆదుకోవాలని గత కొన్ని నెలలుగా అనేక పోరాటాలు చేసినప్పటికీ ప్రభుత్వం గానీ, ఏ రాజకీయ పార్టీ కానీ, యాజమాన్యాలు కానీ ఎవరూ కూడా తమ బాధలను పట్టించుకోవడంలేదని తమ ఆవేదన వెలిబుచ్చారు. ప్రస్తుతం పట్టభద్ర ఎన్నికలు ఉన్నాయి కావున ప్రైవేట్ టీచర్లను కేవలం తమ ఓటు బ్యాంకు రాజకీయాల కొరకు వాడుకోవడం కొరకు మాత్రమే 6,7, 8 తరగతులను ప్రారంభించారు తప్ప ప్రైవేట్ టీచర్ల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఎటువంటి చిత్తశుద్ధి లేదని వారు తెలిపారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి ప్రభుత్వం ప్రైవేట్ టీచర్లను ఆదుకోవాలని ఒక ప్రకటనలో తెలిపారు.