చిలకగెడ్డలో 6 లక్షలు విలువైన గంధపు చెక్కలు పట్టివేత
ఏజెన్సీ నుంచి బెంగళూరుకు రవాణా
పెన్ పవర్, బ్యూరో (విశాఖపట్నం)
విశాఖ ఏజెన్సీ నుంచి బెంగళూరుకు అక్రమంగా రవాణా అవుతున్న గంధపు చెక్కలను అటవీశాఖ అధికారులు వారం పట్టుకున్నారు. బెంగళూరుకు చెందిన వ్యక్తితో పాటు విశాఖపట్నంకు చెందిన మరో వ్యక్తిని అరెస్టు చేశారు. జిల్లాలోని అనంతగిరి రేంజ్ అటవీశాఖ అధికారి దుర్గాప్రసాద్ అందించిన సమాచారం మేరకు చిలకల గడ్డ చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా గూడ్స్ వ్యానులో 36 బస్తాలు కనిపించాయి. వాటిని సోదా చేయగా గంధపు చెక్కలుగా గుర్తించారు.వాటిని స్వాధీనం చేసుకుని తూకం వేయగా 840 కిలోలు బరువు వచ్చింది. ఈ గంధపు చెక్కలు మార్కెట్ విలువ ఆరు లక్షలకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. పాడేరు పరిసర ప్రాంతాల నుంచి సేకరించిన గంధపు చెక్కలను బెంగళూరుకి రవాణా చేస్తున్నట్లు పట్టుబడ్డ వాహనం డ్రైవర్ అబ్దుల్ సలీం అంగీకరించాడు. ఏజెన్సీలో గంధపుచెక్కల సేకరించడానికి సహకరించిన విశాఖపట్నం లోని గోపాలపట్నం కు చెందిన మహంతి గోపాలరావును డ్రైవర్ అబ్దుల్ సలీంని అరెస్టు చేసి కోర్టుకు తరలించామని ఫారెస్ట్ రేంజ్ అధికారి దుర్గాప్రసాద్ తెలిపారు. అటవీ సంపద అక్రమ రవాణా నేరమని అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.