Followers

మెట్ట ప్రాంతంలో కరోనా విజృంభణ







మెట్ట ప్రాంతంలో కరోనా విజృంభణ

 

నిర్లక్ష్యానికి గ్రామీణ ప్రజలు బలి

 

రొయ్యల ఫ్యాక్టరీలను పట్టించుకోని అధికారులు

 

జగ్గంపేట,( పెన్ పవర్ ప్రతినిధి):

 

రోజురోజుకు మెట్ట ప్రాంతంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అధిక శాతం గ్రామాల్లో రొయ్యల ఫ్యాక్టరీ ల నిర్లక్ష్యమే కారణంగా  ఆరోపిస్తున్నారు. పలుమార్లు  స్థానికులు ఆరోపిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు ఎక్కువవుతున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా కట్టడికి  ఎన్నో ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. అయినా మెట్ట ప్రాంతంలోని రొయ్యల ఫ్యాక్టరీ లకు లాక్ డౌన్ వర్తించని పరిస్థితి నెలకొంది. షిఫ్ట్ ల వారీగా  24గంటలు పని చేస్తూనే ఉన్నాయి. వివిధ వాహనాలపై మెట్ట ప్రాంతంలోని అన్ని గ్రామాల నుండి కూలీలను తరలిస్తూ నే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రభుత్వాన్ని వణికిస్తున్న కరోనాపై ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం అలాగే ఉంది.మెట్ట ప్రాంతంలో జగ్గంపేట శివారులో దేవి ఫిషరీస్, ఏలేశ్వరం మండలం ఎర్రవరం లో అవంతి , పెద్దాపురం మండలం లో నెక్కంటి మూడు కంపెనీలు రొయ్యల  ఎగుమతి చేస్తున్నాయి. వీటిలో పనిచేయడానికి సుమారు  ఆరు మండలాల నుండి ప్రతి కంపెనీకి రోజుకు వెయ్యి మందికి పైగా కూలీలు పని చేస్తున్నారు. తయారీ విధానంలో అత్యంత శీతల ప్రదేశంలో పని చేయాలి. దానివల్ల కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉంది.  విపత్కర పరిస్థితుల్లో నామమాత్రంగా పనుల ఆపి, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని యధాతధంగా పని చేయడం పై  అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల పలు గ్రామాలలో వచ్చిన  పాజిటివ్ కేసులలో రొయ్యల ఫ్యాక్టరీ కార్మికులే నని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరి మూలంగా ప్రశాంతంగా ఉండే పలు గ్రామాలు కరోనా రక్కసి బారినపడి అల్లాడుతున్నారు. ఇటీవల కొద్దిరోజులుగా జగ్గంపేట లోని దేవి ఫిషరీష్ లో కరోనా కేసులు రావడంతో తాత్కాలికంగా పనులు ఆపడం జరిగింది. మిగతా రెండు కంపెనీలు గ్రామీణ ప్రజల బలహీనతను ఆసరాగా తీసుకుని మరో వంద రూపాయలు అదనంగా ఇస్తామని ఆశ పెట్టి పనులు చేయించుకుంటున్నారు. ఇదివరకు రాకపోకలకు తమ వాహనాలను ఉపయోగించే యాజమాన్యం వాటిని ఆపారు. ఇతర గ్రామాల నుండి వచ్చే వారికి ఛార్జీలు నిమిత్తం అదనపు సొమ్ము చెల్లిస్తామని ప్రకటిస్తున్నారు. రెక్కడితెనే కాని డొక్కాడని పేద ప్రజలు తప్పని సరి పనులు కి వెళ్తున్నారు. వారికి ఎటువంటి ప్రమాదం జరిగిన యాజమాన్యం పట్టించుకో దని తెలియటం లేదు.దీనిపై పలు గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భయంకరమైన వ్యాధి ని గ్రామాల్లో వెదజల్లే రొయ్యల ఫ్యాక్టరీ లను తక్షణమే నిలిపివేయాలని కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే కరోనా విజృంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారో లేదో వేచి చూడవల సిందే.


 

 




 

 



 



 



ఎంపీ తో కలిసి పరామర్శిoచిన ఆధీప్ రాజ్



లుకేమియా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఉద్ధేష్ కుటుంబాన్ని ఎంపీ తో కలిసి పరామర్శిoచిన ఆధీప్ రాజ్

అన్ని విధాల సహాయం చేస్తామని హామీ

బాలుడు వైద్యానికి వ్యక్తిగతంగా రు"50 వేలు ఆర్థిక సహాయం. 

           

 పరవాడ పెన్ పవర్

 

పరవాడ : పెందుర్తి ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీప్ రాజు మాట ఇచ్చారు అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పరని మరొక సారి రుజువు చేశారు.మండలం లోని భరినికం గ్రామంలో లుకేమియా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న జర్నలిస్ట్ బొండా నాని నాలుగేళ్ల కుమారుడు ఉద్దేశ్ కుటుంబాన్ని ఆదుకుంటానని ఇచ్చిన మాట ప్రకారం మంగళవారం ఉదయం అనకాపల్లి ఎంపీ డా"బి. సత్యవతమ్మ తో కలిసి పరామర్శించారు.బాలుడు ఆరోగ్య పరిస్థితి గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. బాలుడు వైద్యానికి అవసరమైన సహాయం తప్పకుండా అందిస్తామని హామీ ఇచ్చి వారికి ధైర్యం చెప్పారు. ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి సహాయనిధి నుండి ఏది అవకాశం ఉంటే ఆ నిధి నుండి బాలుడు వైద్యానికి అవసరమైన నిధులు సమకూరుస్తామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. అంతేకాకుండా వ్యక్తిగతంగా రూ" 50వేలు నగదును ఉద్దేశ్ కుటుంబ సభ్యులకు అందజేసి మనసున్న ఎమ్మెల్యే అనిపించుకున్నారు.జర్నలిస్ట్ కుటుంబంపై పెందుర్తి ఎమ్మెల్యే చూపించిన శ్రద్ద, జర్నలిస్టులపై ఎమ్మెల్యే కు ఉన్న అభిమానానికి నిదర్శనమని  స్థానిక జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ భర్త వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డా"విష్ణుమూర్తి, స్థానిక వైసీపీ నేత మండల వైసిపి యూత్ అధ్యక్షులు పెద శెట్టి శేఖర్, వైసిపి సెంట్రల్ కమిటీ సభ్యులు పయిల శ్రీనివాసరావు, వైసీపీ జడ్పిటిసి అభ్యర్థి పయిల సన్యాసి రాజు, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్కా రామునాయుడు,మండల వైసిపి పార్టీ అధ్యక్షుడు సిరిపురపు అప్పలనాయుడు,స్థానిక వైసీపీ నాయకులు తదితర నాయకులు ఉద్దేశ్ కుటుంబాన్ని పరామర్శించిన వారిలో ఉన్నారు.

పలు అభివృద్ధి కార్యక్రమాల కు శంకుస్థాపన





పలు అభివృద్ధి కార్యక్రమాల కు శంకుస్థాపన చేసిన
ఎంపీ సత్యవతి ఎమ్మెల్యే ఆధీప్ రాజ్

           

పరవాడ పెన్ పవర్

 

పరవాడ:మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు భిసెట్టి సత్యవతి,పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆధీప్ రాజ్.పెదముషిడి వాడ పంచాయతీ లో 21.80 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న రైతు భరోసా కేంద్రానికి,17.50 లక్షల రూపాయలతో నిర్మించ నున్న వెల్నెస్ కేoద్రానికి ఎంపీ భిసెట్టి సత్యవతి,ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆధీప్ రాజ్ శంకుస్థాపన చేశారు.తధనంతరం లంకెలపాలెం లో రైల్వే అడర్ పాస్ బ్రిడ్జి నిర్మాణానికి స్థల పరీక్ష చేశారు.అనంతరం తాణాo గ్రామంలో నూతన రైతు భరోసా కేంద్రానికి శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీఈసీ సభ్యులు పయిల శ్రీనివాసరావు, వైసీపీ జెడ్పిటిసి అభ్యర్థి పయిల సన్యాసి రాజు,వైసీపీ జిల్లా కార్యదర్శి చుక్క రాము నాయుడు,మండల వైసీపీ అధ్యక్షుడు సిరిపురపు అప్పలనాయుడు,మండల వైసీపీ యూత్ అధ్యక్షుడు పెడిసెట్టి శేఖర్,స్థానిక నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.


 

 




మన్యంలో అప్రమత్తం రంగంలోకి ప్రత్యేక బలగాలు


 


    మన్యంలో అప్రమత్తం రంగంలోకి ప్రత్యేక బలగాలు
 ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు (ఏఓబి) ప్రాంతంలో అలజడి   వాతావరణం
 అడవులను జల్లెడ పడుతున్న కూంబింగ్ దళాలు

చింతపల్లి , పెన్ పవర్

చిటపట చినుకులు పడుతున్న సమయంలోనే మళ్లీ తుపాకులు గర్జించడానికి తహతహలాడు తున్నాయి... నివురుగప్పె చలికి వేడి పుట్టించేందుకు అర్రులు చాస్తున్నాయి... ఏజెన్సీతో పాటు ఏ ఓ బి లోని మావోల శేషాన్ని పూర్తిగా ఏరివేయడానికి అలుపెరగని పోరాటం చేస్తున్న పోలీసులు మళ్లీ అడవులను జల్లెడ పడుతున్నారు. ఈ నెలలోనే ఒడిస్సాలో పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు  మృతి చెందారు. నిఘా వర్గాల సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు ఏ ఓ బి లో ఉదృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. జీవనది లాంటి మావోయిస్టు ఉద్యమాన్ని నిర్వీర్యం చేయాలన్నా! ఎక్కడో ఒకచోట మేమున్నామనే సంకేతాలు పంపుతూ మావోలు బయటకు వస్తూనే ఉన్నారు. ఒడిస్సాలో ఎదురుకాల్పులు సంఘటన జరిగి 15 రోజులు గడవకముందే ఇటీవల పాడేరు డివిజన్, పెదబయలు మండలం, గిన్నెలకోట పంచాయతీ,లండులు మెట్టగూడ అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ఇరువర్గాలకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ! ఈ సంఘటనలో మావోయిస్టులు తీవ్రంగా గాయపడి ఉంటారని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.అయితే సంఘటనా స్థలంలో తుపాకులు, కిట్ బ్యాగులు లభ్యమవ్వడమే ఇందుకు కారణం. ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇరు వర్గాలు మళ్ళీ అడవి సమరంలో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధపడుతున్నారు. అడవులను అణువణువునా గాలించడానికి వందలాది మంది ప్రత్యేక పోలీసు బలగాలను రంగంలోకి దింపు తున్నారు.మరో వారంరోజులలో సిపిఐ మావోయిస్టుల సంస్మరణ వారోత్సవాలు జరగనున్నాయి.దానిని దృష్టిలో ఉంచుకుని పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈనెల 28 నుంచి ఆగస్టు 3 వరకు ఈ వారోత్సవాలు మావోయిస్టులు ప్రతిష్టాత్మకంగా ప్రతియేటా నిర్వహిస్తుంటారు. ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు      (ఏ ఓ బి) లో ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు చోటుచేసుకున్నాయి. గత పది రోజులుగా యుద్ధవాతావరణం నెలకొంది. ఏ ఓ బి లో ఇరువర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఏవోబీ అటవీ ప్రాంతంలో గతంలో మావోయిస్టులు నిర్మించిన మావోయిస్టు అమరవీరుల స్థూపాలకు వారోత్సవాల నేపథ్యంలో ఎరుపు రంగులు  వేసి ఘనంగా నివాళులు అర్పిస్తారు. మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలను ఎలాగైనా అడ్డుకోవాలని ఇటు పోలీసులు... తీవ్రమైన నిర్బంధం మధ్య మావోయిస్టులు వారోత్సవాలను నిర్వహించి        ఏ వో బి లో తమ పట్టును కోల్పోలేదని నిరూపించుకోవాలని అటు మావోయిస్టులు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో పట్టు కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తూ తమ కార్యకలాపాలను చాపకింద నీరులా కొనసాగిస్తుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుం దోనన్న భయాందోళన మన్యం వాసుల్లో నెలకొంది.


జర్నలిస్టులకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసిన జన సైనికులు





జర్నలిస్టులకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసిన జన సైనికులు

           

 పరవాడ పెన్ పవర్

 

పరవాడ : కరోనా వైరస్ లాక్ డవున్ మొదలు దగ్గరనుంచి నేటికి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరవాడ మండలం లోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు మంగళవారం ఉదయం స్థానిక పైడిమాంబ ఆలయ ప్రాంగణంలో జనసేన పార్టీ నాయకులు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. సుమారు 50 మంది జర్నలిస్టులకు ఐదు కేజీలు నాణ్యమైన బియ్యం, ఆరు రకాల పప్పు దినుసులు, తొమ్మిది రకాల కూరగాయలు తదితర సరుకులతో పాటు శానిటైజర్లను పంపిణీ చేశారు.జనసేన పార్టీ పెందుర్తి నియోజకవర్గం సీనియర్ నాయకులు మోటూరు సన్యాసి నాయుడు సొంత నిధులతో సమకూర్చిన సరుకులను ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని జర్నలిస్టులకు పంపిణీ చేశారు.మండలంలో జనసైనికులు కరోనా లాక్ డవున్ మొదలు అయిన దగ్గరనుంచి నిరంతరాయంగా అన్ని రంగాల్లో ని వారికి నిత్యావసరాలు,పలు సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు చుక్క నాగు, మోటూరు హరి, కరెడ్ల అభిరాం, రెడ్డి ప్రశాంత్ (పండు), గుదె సంజీవ్, ఒడిసెల రాము సన్నాఫ్ బంగారు బాబు, ఒడిసెల రాజు, గణేష్, సిద్ధనాతి కౌశిక్ మరియు తదితర జనసైనికులు పాల్గొన్నారు.


 

 




మా గ్రామనికి రహదారి సౌకర్యం కల్పించరు



మా గ్రామనికి రహదారి సౌకర్యం కల్పించరు


 

జి.మాడుగుల, పెన్ పవర్

 

జి.మాడుగుల మండలం నుర్మతి పంచాయతీ గదేగుంట గ్రామానికి రవాణా సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు ఎన్నో ఏళ్ల నుంచి అధికారులను మరియు ప్రజా ప్రతినిధులను వేడుకుంటున్నారు. గత ఏడాది ఆ ఊరి గ్రామస్తులు అంతాకలిసి 2 లక్షలు రూపాయలు వరకు వసూలు చేసుకొని సొంతంగా శ్రమ దానంతో మట్టి రోడ్డు నిర్మించుకున్నారు. ఈ మధ్య కురిసిన వర్షాలకు నిర్మించుకున్న రహదారి మొత్తం కొట్టుకుపోవడంతో మరలా గ్రామస్తులు అంత కలిసి రహదారి బాగుచేస్తున్నారు. ఉన్న ఈ రహదారి కూడా సరిగ్గా లేకపోవడం తో అత్యవసర సమయాల్లో ప్రాణపాయలు సంభవిస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా స్ధానిక శాసనసభ్యురాలు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి, అరకు ఎంపీ గొట్టేటి మాధవి, వారి మనవి ఆలకించి మా గ్రామానికి రోడ్డు నిర్మిస్తారని వేడుకుంటున్నారు.


కౌలు రైతు కార్డ్ పై రైతులకు అవగాహనా సదస్సు 


కౌలు రైతు కార్డ్ పై రైతులకు అవగాహనా సదస్సు 


 మునగపాక పెన్ పవర్

 

మునగపాక:కౌలు రైతులకు కౌలు రైతు కార్డ్ వినియోగం మీద అవగాహన అనంతరం రైతులకు కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మండల తహసీల్దార్ మురళీ కృష్ణ,వ్యవసాయ అధికారిణి చల్లా నాగసాయి పావని.మండల కేద్రంలోని రైతు భరోసా కేద్రంలో వ్యవసాయ అధికారులు ఆధ్వర్యంలో జరిగిన కౌలు రైతుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెట్టిన కౌలు రైతు కార్డ్ పధకం పై కార్డులను రైతులు ఎలా వినియోగించు కోవాలో అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ అవగాహనా సదస్సులో తహశీల్దార్ మురళి కృష్ణ మాట్లాడుతూ రైతులకు కౌలు రైతు కార్డ్ పై బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం ఉంది అని తెలియ చేశారు కష్టమ్ హెయిరింగ్ సెంటర్(సి.హెచ్.సి)గురించి అవగాహన కల్పించారు.అనంతరం వ్యవసాయ అధికారిణి నాగసాయి పావని మాట్లాడుతూ రైతు భరోసా కేద్రంలో ఉన్న కియోస్కీ యంత్రం ద్వారా రైతులు ఎరువులను,విత్తనాలను బుక్ చేసుకోవడం ఎలాగో అవగాహన కల్పించారు.అదేకాకుండా పట్టాదారు రైతులు, కౌలు రైతులు తప్పనిసరిగా ఈ పంట నమోదు చేయించుకోవాలి అని తెలిపారు.ఈ కార్యక్రమంలో మునగపాక డిప్యూటీ తహసీల్దార్ సి.రేఖ,స్టేట్ బ్యాంక్ మేనేజర్ టి.వి.చిదంబరం,కోవాపరేట్ బ్యాంక్ సి.ఈ.ఓ వై. నాగేశ్వరరావు,ఆడారి సత్యాన్నారాయణ,రైతు సంఘం సభ్యులు,రైతులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...