కరోనా వైరస్ కట్టడికి కఠిన నిర్ణయాలు
చింతపల్లి , పెన్ పవర్
విశాఖ ఏజెన్సీలో కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో మన్యం వాసులు భీతిల్లుతున్నారు. అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావద్దని, అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లవలసి వస్తే నోరు,ముక్కుకు మాస్కు ధరించి భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వం కొన్ని షరతులతో స్వీయ నిర్బంధం సడలించింది. దాన్ని అలుసుగా తీసుకున్న మన్యం వాసులు వారి ఇష్టారీతిన ప్రవర్తించారు, ప్రవర్తిస్తున్నారు. ప్రస్తుతం ఏజెన్సీలో క్రమేణ కరోనా కేసులు పెరుగుతుండడంతో వారికి ప్రాణాల మీద తీపి ఏర్పడింది. ప్రభుత్వం, అధికారులు నెత్తి నోరు కొట్టుకుని ఎంత చెప్పినా వినని వారు స్వచ్ఛందంగా స్వీయ నిర్బంధం, ముక్కు, నోటికి మాస్కు, భౌతిక దూరం పాటించడానికి సిద్ధపడుతున్నారు. చింతపల్లి ఏజెన్సీలో కరోనా వైరస్ విస్తరించకుండా స్థానిక వర్తక సంఘం నాయకులు కొన్ని నిబంధనలతో కూడిన నిత్యావసర సరుకుల విక్రయాలు జరపడానికి నిర్ణయించుకున్నారు. ప్రతి దుకాణం వద్ద శానిటైజర్ తప్పనిసరిగా వినియోగించాలి. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపార లావాదేవీలు జరుపుకోవాలి. వినియోగదారులు తప్పనిసరిగా మాస్కు ధరించి భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకోవాలి. మాస్క్ ధరించని వారికి నిత్యావసర సరుకులు విక్రయించరాదు. ఇచ్చిన సమయం కంటే మించి విక్రయాలు జరిపితే వర్తక సంఘం అటువంటి వారికి అపరాధ రుసుం విధిస్తుంది.వర్తక సంఘం మాట వినని వారిపై పోలీసులు శాఖాపరమైన చర్యలు తీసుకునే విధంగా స్థానిక ఏస్ ఐ మహమ్మద్ షరీఫ్ ఆలీ, వర్తక సంఘం కార్యదర్శి పెదిరెడ్ల బేతాళుడు, అధ్యక్షులు బొడ్డేట జోగేశ్వరరావు, ఉపాధ్యక్షులు తాటిపాకల రమేష్, సహాయ కార్యదర్శి ఉప్పల బంగారయ్య శెట్టి( రమేష్ )నిర్ణయం తీసుకున్నారు. మన్యంలో జరిగే వారపు సంతలకు కాకినాడ,పిఠాపురం,తుని,అనకాపల్లి, నర్సీపట్నం తదితర మైదాన ప్రాంతాల నుంచి వచ్చే వారి సంఖ్య అధికంగా ఉంది. వారి వలన కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున అటువంటి వ్యాపారస్తులను చింతపల్లి ఏజెన్సీలోనికి అడుగు పెట్టకుండా అడ్డుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే మండలంలో జరిగే ఆదివారం కోరుకొండ, సోమవారం అన్నవరం, మంగళవారం లోతుగెడ్డ జంక్షన్, బుధవారం చింతపల్లి, గురువారం లంబసింగి వారపు సంతలను ఆయా గ్రామాల వర్తక సంఘాల వారు రద్దు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు.