రాజమహేంద్రవరం జిల్లాతోనే ప్రయోజనం.
........మరోసారి గోకవరం మండలాన్ని అన్యాయం చేయొద్దు
........ప్రభుత్వానికి అఖిలపక్షం వినతి
గోకవరం మండలం యుటిఎఫ్ అధ్యక్షుడు ఎస్.అనిల్ కుమార్.
గోకవరం పెన్ పవర్.
గోకవరం మండలాన్ని కొత్తగా ఏర్పాటు చేయబోయే రాజమహేంద్రవరం జిల్లాలోని ఉంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకునేలా జిల్లా ఉన్నతాధికారులు సహకరించాలని గోకవరం మండలం అఖిల పక్షానికి చెందిన ప్రజానీకం విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక్కొక్క జిల్లాగా ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉండటంతో గోకవరం మండలంలో ఈ విషయమై చర్చనీయాంశం మొదలయింది. మెట్ట ప్రాంతం, ఏజెన్సీకి ముఖద్వారమైన గోకవరం మండలం నైసర్గికంగా రాజమహేంద్రవరానికి 30 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. ఈ మండలంలో 14 గ్రామపంచాయతీలు ఉండగా వాటిలో గుమ్మళ్లదొడ్డి, అచ్యుతాపురం, వెదురుపాక, ఇటికాయలపల్లి, తిరుమలాయపాలెం, రంపఎర్రంపాలెం, తంటికొండ, గాదెలపాలెం గ్రామ పంచాయతీలు ఇటు రాజమండ్రి వైపు దగ్గరిగా ఉన్నాయి. గోకవరం మండలం పూర్వము రాజమండ్రి తాలూకా లో ఉండేది. అనంతరం ఏర్పడ్డ కోరుకొండ తాలూకాలో గోకవరం మండలం ఉండేది. అంతేకాకుండా మండల వ్యవస్థకు పూర్వం పంచాయతీ సమితి ఉన్న రోజుల్లో కోరుకొండ పంచాయతీ సమితిలో గోకవరం మండలం చేరి ఉంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్ టి రామారావు మండల వ్యవస్థను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో గోకవరం మండలం ఏర్పడింది. ఈమండలం ఇప్పటివరకు రాజమండ్రి రెవెన్యూ డివిజన్ లోనే సాగుతూ వచ్చింది. 1952 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడిన నాటి కాలం నుండి ఉన్న బూరుగుపూడి నియోజకవర్గంలో కోరుకొండ, గోకవరం, సీతానగరం మండలాలు ఉండేవి. నియోజకవర్గాల పునర్విభజనలో కొంతమంది రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం గోకవరం మండలంని బూరుగుపూడి అసెంబ్లీ నియోజకవర్గం నుండి తొలగించి జగ్గంపేట అసెంబ్లీ, కాకినాడ లోక్ సభ నియోజకవర్గంలో చేర్పించేందుకు కొంతమంది వ్యక్తులు చేసిన కృషి ఫలించింది. కడియం నియోజకవర్గంలో ఉన్న రాజానగరం మండలాన్ని తీసుకువచ్చి కోరుకొండ, సీతానగరం మండలాలతో కలిపి రాజానగరం నియోజకవర్గంగా ఏర్పాటు చేయించుకునేందుకు వారు చేసిన ప్రయత్నం ఫలించింది. అయితే గోకవరం మండలాన్ని జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో కలిపినప్పటికీ కొంతమేరకు ప్రజలు అసౌకర్యానికి గురైనా పెద్దగా ఇబ్బంది కలగలేదు. అయితే జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న గోకవరం మండలం కాకినాడ లోక్ సభ పరిధిలో ఉండటంతో ఒక్కొక్క లోక్ సభ నియోజకవర్గాన్ని ఒకొక్క జిల్లాగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉండటంతో గోకవరం మండలం ప్రజానీకానికి ఆందోళన మొదలైంది. ఇప్పటివరకు రాజమండ్రి రెవెన్యూ డివిజన్ లో వున్న గోకవరం మండలం పోలీస్ సీఐ, డీఎస్పీ కార్యాలయాలు, వ్యవసాయశాఖ సబ్ డివిజన్ , ఉద్యానవనశాఖ, విద్యుత్ డిఇఇ, ఐసిడిఎస్ కోరుకొండ ప్రాజెక్టు తదితర ప్రభుత్వశాఖలు సైతం కోరుకొండ, రాజమండ్రి ప్రాంతాలతో ముడిపడి గోకవరం మండలం అనుభందం కలిగివుంది. ఈపరిస్థితుల్లో కాకినాడ లోక్ సభ నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేసి, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న గోకవరం మండలంని కాకినాడ జిల్లాలో కలిపితే ఈ ప్రాంత ప్రజల కష్టాలు మొదలైనట్టేనని జనం ఆందోళన చెందుతున్నారు. అసెంబ్లీ నియోజకవర్గం పునర్విభజనలో ఈ మండలం విడిపోయిన సమయంలో చాలామంది ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయగా, ప్రస్తుతం ఈమండలాన్ని 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజమహేంద్ర వరం లోక్ సభ నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం జిల్లాగా ఏర్పాటు చేయబోతున్న ఈ పరిస్థితుల్లో ఇక్కడ నుండి దూరం చేసి, 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లాలో కలిపితే జనం ఏ విధంగా కష్టాలు అనుభవించాల్సివస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని స్ధానికులు అంటున్నారు. కాకినాడ జిల్లాలో కలిపితే 45 కిలోమీటర్ల దూరంలో వున్న పెద్దాపురం రెవెన్యూ డివిజన్ కు, కాకినాడ కలెక్టరేట్ కార్యాలయంనకు వెళ్లాల్సి వస్తుందని జనం అంటున్నారు. నైసర్గికంగా 30 కిలోమీటర్ల దూరంలో దాదాపు మూడు వంతుల మండలం రాజమండ్రికి దగ్గరలో ఉన్నప్పటికీ, కాకినాడ జిల్లాలో కలిపే ఆలోచన చేస్తే జనం అధోగతి పాలు అవుతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా గోకవరం మండలం ప్రజానీకం తమ అభిప్రాయాలను స్పష్టం చేసారు. రాజమహేంద్రవరం జిల్లాను ఏర్పాటు చేస్తే రాజమహేంద్రవరం జిల్లాలోనే గోకవరం మండలం ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు. న్యాయమైన గోకవరం మండలం ప్రజానీకం కోరికను ముఖ్యమంత్రి వైయస్ జగన్ అనుకూలంగా స్పందిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అన్యాయం జరిగిన పక్షంలో ప్రజా పోరాటం, న్యాయపోరాటం చేందుకు ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త జిల్లాలు ఏర్పాటు గోకవరం మండలానికి కష్టాలు తెచ్చిపెడుతోందా ? లేక రాజమండ్రి లో చేర్చి జనానికి సౌకర్యవంతంగా ఉంచుతారా వేచి చూడాల్సిందే.