సచివాలయాలలో పౌర సేవలు,రికార్డులను పరిశీలించిన అధికారులు
ఆత్రేయపురం ,పెన్ పవర్
ఆత్రేయపురం మండలం గ్రామ సచివాలయాల ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ అజయ్ జైన్ గారి ఆదేశాల మేరకు మండలంలో ఉన్న సచివాలయాలను అధికారులు పరిశీలించి ఆన్లైన్ యాప్ ద్వారా వివరాలను నమోదు చేస్తున్నారు. ఇందుకు గాను మండల ప్రత్యేక అధికారి మరియు డ్రైన్స్ డిఈ బుల్లిరాజు కు వెలిచేరు, రాజవరం, వద్దిపర్రు, వసంతవాడ, కట్టుంగ, నార్కెడ్ మిల్లి సచివాలయాలను, ఎంపీడీఓ నాతి బుజ్జి ఆత్రేయపురం, లొల్ల, ర్యాలి, బొబ్బర్లంక సచివాలయాలను మరియు పంచాయతీ విస్తరణాదికారి శ్రీనివాస్ మెర్లపాలెం, అంకంపాలెం, వాడపాలెం, పేరవరం ,తాడిపూడి, ఉచ్చిలి సచివాలయాలను పరిశీలించవలసి ఉంది. ఈ రోజు వెలిచేరు, రాజవరం, వాడపల్లి, ఆత్రేయపురం గ్రామ సచివాలయాలలో సచివాలయ సిబ్బంది హాజరు, రికార్డుల నిర్వహణ, ప్రభుత్వ పధకాల లబ్ధిదారుల జాబితాలు, నిర్ణీత సమయంలో అందజేయాల్సిన పౌర సేవల వివరాలు, ప్రజలకు పౌర సేవల అందుబాటు తదితర అంశాలను పరిశీలించి ఆన్లైన్ యాప్ ద్వారా నమోదు చేసారు. వెలిచేరు, రాజవరం సచివాలయాలను పరిశీలించిన మండల ప్రత్యేక అధికారి బుల్లిరాజు ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేసారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలులోకి తీసుకు వచ్చిన సచివాలయ వ్యవస్థలో పని చేస్తున్న సిబ్బంది ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు జవాబుదారీగా పని చేయాలన్నారు.ఈ పరిశీలన లో ఆయా పంచాయతీల కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.