కరోనా కట్టడిలో జగన్ సర్కార్ దూకుడు..
ఇంటికే ఉచితంగా కరోనా కిట్..
హోం క్వారంటైన్ లో ఉన్నవారికి కిట్ల పంపిణీ
కిట్ లో మందులు,శానిటైజర్, ఆక్సీమీటర్, మాస్కులు
కరోనా లక్షణాలు ఎక్కువగా ఉంటే ఆసుపత్రికి తరలింపు
కరోనాపై పోరులో జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హోం క్వారంటైన్లో చికిత్స తీసుకుంటున్న బాధితులకు ఉచితంగా కరోనా కిట్లు అందించేందుకు రంగం సిద్ధం చేసింది. కోవిడ్ పేషంట్లు ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకునేందుకు ఈ కిట్ ఎంతగానో ఉపయోగపడనుంది. మొదట్లో హోం క్వారంటైన్లో ఉన్న బాధితులకు ఎలాంటి లక్షణాలు లేకపోయినా.. ఆ తర్వాత రెండు, మూడు రోజుల వ్యవధిలో జ్వరం, దగ్గు వంటి లక్షణాలు బయటపడుతున్నాయి. అందుకే వారికి అవసరమయ్యే వాటిని ప్రభుత్వం ఈ కిట్ ద్వారా అందిస్తోంది. ఇప్పటికే దేశంలోనే రికార్డుస్థాయిలో కరోనా శాంపిల్ టెస్టులు చేస్తున్న ఏపీ ప్రభుత్వం.. ప్రతీ జిల్లాకు కోటి రూపాయల నిధులు మంజూరు చేసి.. కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయనుంది. అలాగే కరోనా నిర్ధారణ టెస్టింగ్ కోసం ప్రతీ జిల్లాకు నాలుగు బస్సుల చొప్పున ఏర్పాటు చేసింది. కరోనా రోగులకు హోం క్వారంటైన్ పూర్తయ్యే వరకు సరిపోయే మందులను ఈ కిట్ల ద్వారా ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఇందులో మాస్కులు, శానిటైజర్లు, యాంటి బయాటిక్స్, విటమిన్ టాబ్లెట్లతో పాటు ఆక్సిజన్ లెవెల్‌ను చూసుకునేందుకు పల్స్ ఆక్సీమీటర్ లాంటివి ఉంటాయి.