నిజానికి కారు బోల్తా పడలేదు
వికాస్ దూబే 'ఎన్కౌంటర్'పై అఖిలేశ్ యాదవ్ కామెంట్!
దూబే ద్వారా రహస్యాలు బయటపడితే ప్రభుత్వం బోల్తా
అందుకే ఈ చర్యలు తీసుకున్నారు: అఖిలేశ్
దూబేకు సహకరించిన వారి సంగతేంటి?: ప్రియాంకా గాంధీ
చనిపోయిన వ్యక్తి ఎలాంటి కథలు చెప్పలేడు కదా: ఒమర్ అబ్దుల్లా
గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేను పోలీసులు ఎన్కౌంటర్లో హతమార్చిన విషయం తెలిసిందే. అతడిని ప్రత్యేక వాహనంలో కాన్పూర్‌కు తరలిస్తుండగా అది బోల్తా పడడంతో వికాస్ పారిపోయేందుకు ప్రయత్నించడంతో కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. అయితే, దీనిపై పలువురు రాజకీయ నేతలు స్పందిస్తూ అనుమానాలు వ్యక్తం చేశారు. అతడికి బీజేపీ నేతలతో ఉన్న సంబంధాలు బయటపడతాయన్న ఉద్దేశంతోనే ఎన్కౌంటర్ చేశారంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి కారు బోల్తా పడలేదని.. అతడి ద్వారా రహస్యాలు బయటపడితే ప్రభుత్వం బోల్తా పడే అవకాశం ఉండడంతో అలా జరగకుండా చర్యలు తీసుకున్నారని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ చురకలంటించారు. అసలు ఆ గ్యాంగ్‌స్టర్‌ను పోలీసులే పట్టుకున్నారా? అతడే లొంగిపోయాడా? అన్న విషయం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నేరస్తుడు చచ్చిపోయాడు సరే.. మరి అతడు చేసిన నేరాలు, అందుకు సహకరించిన వారి సంగతేంటి? అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ నిలదీశారు. కాగా, దీనిపై జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ.. 'చనిపోయిన వ్యక్తి ఎలాంటి కథలు చెప్పలేడు కదా' అని ట్వీట్ చేశారు. అందుకే, బతికి ఉన్నవారు ఈ విషయంపై కథలు చెబుతున్నారనేలా ఈ వ్యాఖ్య చేశారు.