ఫొటో నెం. 124, 125
కంటైన్మెంట్, సర్వేలెన్స్ పక్కాగా నిర్వహించాలి
అధికారులు ఇంగిత జ్ఞానంతో బాధ్యతగా పని చేయాలి అధికారులతో కలెక్టర్ పోల భాస్కర్
(పెన్ పవర్, చీమకుర్తి)
లాక్ డౌన్ మూడవసారి పొడిగించినందున కంటైన్మెంట్ సర్వేలెన్స్ పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అధికారులు ఇంగిత జ్ఞానం కలిగి చిత్తశుద్ధితో బాధ్యతగా పనిచేయాలని ఆయన సూచించారు. శుక్రవారం చీమకుర్తి మండలం ఎమ్.పి.డి.ఓ. కార్యాలయంలో మండల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. చీమకుర్తి మండలంలో 28 రోజుల క్రితం ఒకరికి కరోనా వైరస్ సోకితే హైరిస్క్ జోన్, కంటైన్మెంట్ జోన్, బఫర్ జోన్ ఏర్పాటులో మండల స్థాయి అధికారులు ప్రణాళిక లేకుండా పనిచేస్తున్నారని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. హైరిస్క్ జోన్లో 736 కుటుంబాలు వున్నాయని, కంటైన్ మెంట్ జోన్ పరిధిలో 7,620 కుటుంబాలలో మొత్తం 30,332 మంది జనాభా వున్నారని వైద్య అధికారులు ఆయన దృష్టికి తెచ్చారు. బఫర్ జోన్, కంటైన్ మెంట్ జోన్ పరిధిలో ఆరు గ్రామాలు వస్తాయని ఒకరు, ఎనిమిది గ్రామాలు వస్తాయని మరొకరు, రెండు గ్రామలే వస్తాయని ఇంకొకరు స్పష్టత లేని సమాధానం అధికారులు ఇవ్వడంతో కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. పెరీమీటర్ కంట్రోల్ సమర్థంగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు. కోవిడ్ విస్తరణ అరికట్టడానికి చీమకుర్తి పట్టణంలోకి ప్రజలు, వాహనాలు రాకపోకలు పూర్తి గా నియంత్రించాలని ఆయన చెప్పారు. కంటైన్ మెంట్, బఫర్ జోన్ పరిధిలో హైరిస్క్ ప్రజలను నిరంతరం పర్యవేక్షించాలని ఆయన తెలిపారు. చీమకుర్తి మండలంలో 308 మంది నుంచి నమూనాలు సేకరించగా కరోనా వైరస్ సోకలేదని నిర్ధారణ అయినట్లు కలెక్టర్ చెప్పారు. కంటైన్మెంట్ జోన్లో 278 మంది నమూనాలు సేకరించి వి.ఆర్.డి.ఎల్. ద్వారా పరీక్షలు నిర్వహించామన్నారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తి కుటుంబీకులలో ఐదుగురు, సన్నిహితంగా మెలిగిన మరో తొమ్మిది మంది, అనుమానితులుగా 30 మందికి ట్రూనాట్ యంత్రాలు ద్వారా పరీక్షలు నిర్వహించగా వ్యాధి సోకలేదని ఆయన తెలిపారు. మరో 60 మందిని ఎంఐసోలేషన్ లో వుంచామన్నారు. హైరిస్క్ జోన్ లో విధులు నిర్వహిస్తున్న 21 మంది పారిశుద్ధ్య కార్మికులకు పరీక్షలు నిర్వహించగా వ్యాధి సోక లేదని వైద్యులు ధృవీకరించారని చెప్పారు. అనుమానస్పద లక్షణాలు కలిగిన మరో 40 మంది వృద్ధులకు పరీక్షలు కూడా చేశామన్నారు. చీమకుర్తిలో ప్రస్తుతం ఒకరికి మాత్రమే వ్యాధి వుందని, విస్తరణ జరగలేదన్నారు. కంటైన్ మెంట్ జోన్ పరిధిలోని వలస కూలీలకు రిలీఫ్ సెంటర్ ఏర్పాటు చేయడం సరికాదన్నారు. జిల్లాలో కరోనా వైరస్ కేసులు 60 నమోదు కాగా వైద్యం పొంది 44 మంది ఆరోగ్యవంతులై వైద్యశాల నుంచి డిశ్చార్జి అయ్యారని కలెక్టర్ తెలిపారు. మరో రెండు రోజుల్లో ఆరుగురు వ్యక్తులు డిశ్చార్జి కానున్నారని ఆయన చెప్పారు. ప్రస్తుతం 14 కంటైన్ మెంట్ జోన్లలో ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు లాక్ డౌన్ పక్కాగా అమలుచేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ నెల 4వ తేదీ నుంచి 17వ తేదీవరకు లాక్ డౌన్ 14 రోజులపాటు పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఇప్పటివరకు 12 వేల మంది నుంచి నమూనాలు సేకరించామని, ఏడు వేల మందికి వ్యాధి సోకలేదని నిర్ధారణ అయ్యిందన్నారు. మిగిలిన వారి నమూనాలు వి.ఆర్.డి.ఎల్. ద్వారా పరీక్షిస్తున్నామని ఆయన చెప్పారు. ఫలితాలు వెల్లడైతే ఏ మేరకు కోవిడ్ విస్తరించిందో తెలుస్తుందని, దీనిని పూర్తి స్థాయిలో అరికట్టగలమని ఆయన వివరించారు. చీమకుర్తి లో గ్రానైట్ క్వారీలు, ఫ్యాక్టరీలు, క్రషర్లు నడపడానికి ఆంక్షలతో కూడిన అనుమతులు ఇస్తామని కలెక్టర్ చెప్పారు. ప్రస్తుతం చీమకుర్తిలో 40 క్వారీలు, 600 ఫ్యాక్టరీలు, 20 క్రషర్ లు వున్నాయని యజమానలు దరఖాస్తులు చేసుకుంటే అనుమతులు ఇస్తామని ఆయన వివరించారు. 6,034 మంది ఇతర రాష్ట్రాల నుంచి వలసకూలీలుగా చీమకుర్తిలో వున్నారని, పరిశ్రమలు ప్రారంభిస్తే ఎంతమంది వుంటారో యజమానులు గుర్తించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఐదు వేలమంది ఇతర జిల్లాలకు చెందిన వలస కూలీలను వారి స్వస్థలాలకు ఆర్.టి.సి. బస్సుల ద్వారా తరలిస్తున్నామని ఆయన చెప్పారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో ఒంగోలు ఆర్.డి.ఓ. ప్రభాకర రెడ్డి, నియోజకవర్గ ప్రత్యేక అధి కారి అద్దెయ్య, మైన్స్ ఏ.డి. నరసింహా రెడ్డి, ఉప కార్మిక కమీషనర్ శ్రీనివాస్ , తహసిల్దార్ కె. విజయకుమారి, ఎమ్.పి.డి.ఓ. వండర్ మెన్, చీమకుర్తి మున్సిపల్ కమీషనర్ బి. రవి కుమార్, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.