ధరలను అదుపు చేయడంలో విఫలమైన ప్రభుత్వం
మందుల కొరతతో ఇబ్బంది పడుతున్న రోగులు
ఓ వైపు ఆర్ధిక ఇబ్బందులు, మరో వైపు కొరత కారణం
(పెన్ పవర్, మార్కాపురం డివిజన్ ఇన్ ఛార్జి)
కరోనా మహమ్మారి కారణంగా నిత్యావసర ధరలు భారీగా పెరిగి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ధరల పట్టికలను అధికారులు ఏర్పాటు చేసినా అవి అలంకార ప్రాయంగా మారాయి. కొనుగోలుదారులు ఎవరైనా అధికారులు పెట్టిన ధరల పట్టిక పై ప్రశ్నిస్తే రవాణా చార్జీలు భారీగా పెరిగాయని, ఆ ధరలకు సరుకులు ఇవ్వలేమని వ్యాపారులు చెబుతున్నారు. ఇక మందుల విషయానికి వస్తే రోగులకు అవసరమైన మందులు అందు బాటులో లేవంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి రవాణా సౌకర్యాలు లేక మందుల సరఫరా నిలిచిపోయిందని సమాధానం ఇస్తున్నారు. గతంలో మందులు కొనుగోలు చేస్తే 10 నుంచి 20 శాతం వరకు కమిషన్ రూపంలో ఇచ్చే వారు ప్రస్తుత కష్టాలను సాకుగా చూపి ఆ కమిషన్ ఎత్తి వేయడమే కాక ధరలు పెంచి ఆమ్మకం సాగిస్తున్నారు. ఓ వైపు ఆర్థిక ఇబ్బందులు, మరో వైపు ధరల పెరుగుదలతో కొందామంటే కొరివి, వేసుకోకపోతే రోగాలు పెరిగి ఆరోగ్య సమస్యలు అధికమవుతాయేమోనని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం మాత్రం ఈ 40 రోజుల్లో వ్యక్తికి పది, ఐదు కిలోల బియ్యం, 2 కిలోల కందిపప్పు, ఒక కిలో శనగపప్పు, రూ.1000 నగదు ఇచ్చి చేతులు దులుపుకుంటే ఎలా అంటూ ప్రజలు విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ ప్రజలు కరోనా మరణాల కన్నా ఆకలి మరణాలే అధికం అవుతాయేమోనని ఆందోళన చెందుతున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల విమర్శలకు సమాధానం ఇచ్చేందుకే అధిక సమయం కేటాయిస్తున్నారు తప్ప ప్రజా సమస్యల పరిష్కారంలో చిత్త శుద్ధితో పని చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి ఇంటికి 3 మాస్కులు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చి పది రోజులు గడిచినా ఇంతవరకు సక్రమంగా పంపిణీ జరిగిన దాఖలాలు లేవు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర ప్రాంతాల్లో చిక్కుకొని ఇబ్బంది పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు తక్షణమే తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.