ఎండ తీవ్రత, కరోనా వైరస్ పట్ల తగు జాగ్రత్తలు పాటించాలి
జిల్లా కలెక్టర్ డా. హరి జవహర్ లాల్
విజయనగరం, పెన్ పవర్ :
వేసవి కాలంలో ఎండ తీవ్రంగా ఉంటుందని ప్రజలందరూ తగు జాగ్రత్తలు పాటించాలని, కరోనా వైరస్ నివారణకు తగు పద్దతులు పాటించాలని జిల్లా కలక్టరు డా. హరి జవహర్ లాల్ ఒక ప్రకటనలో తెలిపారు. సాధ్యమైనంత వరకు ఇంటి వద్దనే ఉండాలని ఎండ తీవ్రత, కరోనా వైరస్ గురించి టివి, రేడియో, పత్రికలలో వస్తున్న విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. త్రాగునీరు సరిపడినంత తీసుకోవాలని, ఓఆర్ఎస్, లస్సీ, రైస్ వాటర్, లెమన్ వాటర్, మజ్జిగ వంటి త్రాగాలన్నారు. మంచి పౌష్టి కాహారాన్ని తీసుకోవాలని, కిడ్ని, లివర్ వ్యాధులు ఉన్నవారు వైద్యులను సంప్రదించాలన్నారు. తక్కువ బరువు ఉన్న, లైట్ కలర్, లూజుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలన్నారు. తప్పనిసరి పరిస్ధితుల్లో బయటకు వెళ్లెటప్పుడు టోపిని గాని, గొడుగును గాని, రుమాలును గాని వినియోగించాలని, తలకు ఎండ తగలకుండా చూసుకోవాలని, నీడ ఉన్న ప్రదేశంలో తిరగాలని, ఇతరులను ముట్టుకోకుండా ఒక మీటరు దూరంలో ఉండాలన్నారు. నీటితోగాని, సబ్బుతో గాని, శానిటైజర్ తో గాని చేతులను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఒక్కొక్క టవల్ ను ఉపయోగించాలని, వాటిని ఎప్పటికప్పుడు శుభ్రపర్చుకోవాలన్నారు. వీలైనంత వరకు ఇంటిలోనే ఉండాలని, ఇంటి చల్లదనం కోసం కర్టెన్లు, షట్టర్స్, సన్ షేడ్స్ ఏర్పాటు చేసుకోవాలని, రాత్రి సమయంలో కిటికీలు తెరిచి ఉండాలన్నారు. పేన్లు, డంప్ క్లాతింగ్ ఉపయోగించాలని, చల్లటి నీటితో ఎప్పటికప్పుడు స్నానం చెయ్యాలన్నారు. జ్వరం, తలనొప్పి, దగ్గు, శ్వాస పీల్చునప్పుడు ఇబ్బందులు వచ్చినచో సత్వరమే డాక్టర్ ను సంప్రదించాలన్నారు. జంతువులను నీడిలో ఉంచి త్రాగునీటి సదుపాయం కల్పించాలన్నారు. లాక్డౌన్ సమయంలో బయటకు వెళ్లరాదని, తప్పనిసరి పరిస్దితుల్లో వెళ్లదలచినచో వర్క్ అనుమతి పత్రం తీసుకోవాలని, చల్లగా ఉండే సమయంలో పనిచేయాలన్నారు. మధ్యాహ్నం 12 నుండి 3 గంటల సమయంలో ఎట్టి పరిస్దితులలోను పనిచేయరాదన్నారు. ఉద్యోగులు, పనిచేసే వారికి పని ప్రదేశంలో చల్లటి త్రాగునీటిని ఏర్పాటు చెయ్యాలని, పరిశుభ్రంగా ఉంచాలన్నారు. వ్యవసాయ, ఉపాధి హామి తదితర పనులు చేసే వారి తలకు, ముఖానికి ఎండ తగలకుండ ఉండేటట్లు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. చల్లటి వాతావరణం ఉన్న సమయాలలో పనిచేసేటట్లు చూడాలన్నారు. గర్భీణీ స్త్రీలుకు, వర్కర్స్ కు వైద్య సదుపాయం కల్పించాలన్నారు. పనివారు పనిచేయు సమయంలోను, లంచ్, డిన్నర్ చేసేటప్పుడు సామాజిక దూరం పాటించాలని, సబ్బు, నీటిని ఏర్పాటు చెయ్యాలని, చేతులు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చేతులు ముఖనికి తాకకుండా తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. పారిశుద్ద్య పనివారు తప్పనిసరిగా మాస్క్లు లు, గ్లౌస్ లు ధరించాలని, మాస్క్ లను తాకరాదని, ఇంటికి వెళ్లిన తర్వాత వాటిని పరిశుభ్ర పర్చాలన్నారు. అనారోగ్యం ఉంటే వెంటనే సూపర్ వైజర్ కు తెలియజేయాలన్నారు. పనిచేయు ప్రదేశంలో పొగాకు ఉత్పత్తులు, సిగరెట్స్ వినియోగించరాదని, షేక్ హేండ్ గాని, హత్తు కోవడం వంటి పనులు చేయరాదన్నారు. కళ్లు, ముక్కు, నోటిని తాకరాదని, మీరు అనారోగ్యంగా ఉంటే పనికి వెళ్లరాదని, ఎవరైనా అనారోగ్యంగా ఉంటే దగ్గరలో ఉండరాదని తెలిపారు. పోలీస్, ట్రాఫిక్ పోలీస్ వారు డ్యూటీలో ఉండే సమయంలో చల్లగా ఉండే జాకెట్ను ధరించాలని, ప్రజలకు, వాహనాలకు సామాజిక దూరం పాటించాలని, తనిఖీచేసే సమయంలో డాక్యుమెంట్లను ముట్టుకోరాదని తెలిపారు. ట్రాఫిక్ దగ్గర యవ్వనంలో ఉన్న పోలీస్ లను నియమించాలని, ఇంటికి వెళ్లిన వెంటనే దుస్తులను పరిశుభ్రపర్చుకోవాలన్నారు. సీనియర్ సిటిజన్లు ఇంటి వద్దనే ఉండాలని, పార్కులకు, జన సంచారం గల ప్రదేశాలకు, మార్కెట్ కు, మత సంబంధ ప్రదేశాలకు వెళ్లరాదన్నారు. పిల్లలు తమ తల్లిద్రండుల ఆరోగ్యం ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. ఆనారోగ్యం నకు గురైనట్లయితే వైద్యులను సంప్రదించాలని, నిర్ణీత వేళల్లోనే భోజనం చేయాలన్నారు. కరోనా వైరస్ నివారణ పద్దతులు తప్పనిసరిగా పాటించాలన్నారు.