సంక్షోభ సమయంలో దోచుకోవడం టిడిపి నైజం
అతి తక్కువ ధరకే కొరియానుంచి కిట్లను కొనుగోలు చేశాం
కరోనా నియంత్రణకు పటిష్టమైన చర్యలు
మంత్రి బొత్స సత్యనారాయణ
విజయనగరం, పెన్ పవర్ ప్రతినిధి : డేవిడ్ రాజ్
విపత్తులు, సంక్షోభాలు తలెత్తినప్పుడు ఇదే అవకాశంగా ప్రజాధనాన్ని దోచుకోవడం టిడిపికి అలవాటని రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖామంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. అటువంటి అలవాటుగానీ, దృక్ఫథం గానీ తమ పార్టీకి లేవని ఆయన స్పష్టం చేశారు. విజయనగరంలో సోమవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు.
దేశంలోనే అతి తక్కువ ధరకు కొరియా నుంచి ర్యాపిడ్ కిట్లను కొనుగోలు చేశామని మంత్రి బొత్స తెలిపారు. ఇలాంటి క్లిష్ట సమయంలో కూడా టిడిపి చౌకబారు విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు. కరోనా నిర్ధారణ కోసం తొలిసారిగా కొరియా నుంచి లక్ష కిట్లను అతితక్కువ ధరకు కొనుగోలు చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన రెడ్డి, దేశానికే ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. ఇప్పుడు కేంద్రం కూడా కొరియా నుంచి ఈ కిట్లను కొనుగోలుకు ముందుకు వచ్చిందని చెప్పారు.
రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ముఖ్యమంత్రి పటిష్టమైన చర్యలను తీసుకున్నారని మంత్రి బొత్స చెప్పారు. విజయనగరం జిల్లా ఇప్పటివరకు సురక్షితంగా ఉండటానికి ప్రజల సహకారమే కారణమని పేర్కొన్నారు. ఇదే పరిస్థితి కొనసాగాలంటే మరికొంతకాలం జిల్లా ప్రజలు సహకరించాలని మంత్రి కోరారు. జిల్లాలో కరోనా నియంత్రణకు పకడ్భంధీగా చర్యలు తీసుకున్నామని, ముందు జాగ్రత్తగా ఆరు కోవిడ్-19 ఆసుపత్రులను సిద్దం చేశామని చెప్పారు. 40 క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, అనుమానితులను ఈ కేంద్రాల్లో 14 రోజులపాటు ఉంచుతున్నామని చెప్పారు. అలాగే దగ్గు, జలుబు, జ్వరం తదితర వ్యాధి లక్షణాలు కనిపించిన వారికి, ఇతర ప్రాంతాలనుంచి వచ్చిన వారికి ఎప్పటికప్పుడు కరోనా నిర్ధారణా పరీక్షలను నిర్వహించడం జరుగుతోందని చెప్పారు. ఇలా ఇప్పటివరకు 1795 మందికి పరీక్షలు నిర్వహించినట్లు మంత్రి వెళ్లడించారు.
జిల్లాలో రైతులు ఇబ్బంది పడకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అలాగే 30 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతుల స్వగ్రామాల్లోనే మొక్కజొన్నను కొనేందుకు చర్యలు చేపట్టామన్నారు. డ్వాక్రా మహిళలకు పెండింగ్‌లో ఉన్న వడ్డీ రాయితీని ఈనెల 24న రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి రాజధాని నుంచి విడుదల చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ఒక్క విజయనగరం జిల్లాలోనే మహిళా సంఘాలకు సుమారు రూ.5కోట్ల రూపాయల లబ్ది జరుగుతుందని మంత్రి బొత్స తెలిపారు.
ఈ మీడియా సమావేశంలో విజయనగరం ఎంఎల్ఏ కోలగట్ల వీరభద్రస్వామి, వైకాపా రాజకీయ వ్యవహారాల ఇన్‌ఛార్జి మజ్జి శ్రీనివాసరావు పాల్గొన్నారు.