ఆకలివేళ ఆపన్న హస్తం
నిరాశ్రయులను ఆదుకుంటున్న ఉపశమన కేంద్రాలు
జిల్లా వ్యాప్తంగా 35 రిలీఫ్ సెంటర్ల ఏర్పాటు
విజయనగరం, పెన్ పవర్
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి, పేదల ఉపాధికి గండికొట్టింది. రెక్కాడితే గాని డొక్కాడని బడుగు జీవులు లాక్‌డౌన్ కారణంగా పనుల్లేక అల్లాడాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితి వారికి రాకూడదని భావించిన రాష్ట్రప్రభుత్వం, వారిని ఆదుకొనేందుకు ఎన్నో చర్యలను చేపట్టింది. ఇలాంటి వారికోసం ఉచితంగా భోజన సదుపాయాన్న, ఆవాశాన్ని ఏర్పాటు చేశారు. ఇలా జిల్లా వ్యాప్తంగా సుమారు 35 ఉపశమన కేంద్రాలద్వారా అన్నార్తులకు నిత్యం భోజనం పెట్టి ఆదుకుంటున్నారు.
విజయనగరం జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉపశమన కేంద్రాలు ఇప్పుడు పేదల పాలిట వరంగా మారాయి. ఈ కేంద్రాల ద్వారా నిత్యం పేదలకు ఉచితంగా రుచికరమైన భోజనాన్ని ప్రభుత్వం అందజేస్తోంది. వలస జీవులు, లాక్‌డౌన్ కారణంగా జిల్లాలో చిక్కుకుపోయినవారు, నిరుపేదలు, సంచార తెగలు, నిరాశ్రయులు, బిక్షగాళ్లు తదితరులంతా ఇప్పడు ఈ కేంద్రాల్లో చేరి సంతృప్తిగా భోజనం చేస్తున్నారు. ఇలాంటి వారికోసం ప్రభుత్వం స్వయంగా 18 రిలీఫ్ సెంటర్లను ఏర్పాటు చేసింది. వీటిలో ఆరు చోట్ల ఆశ్రయాన్ని కూడా కల్పించి మూడు పూటలా భోజనం పెడుతున్నారు. మిగిలిన 12 చోట్ల మాత్రం రెండు పూటలా కేంద్రాలకు వచ్చి భోజనం చేసి వెళ్తున్నారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా 17 స్వచ్ఛంద సంస్థల ద్వారా ఆశ్రయం, భోజన సదుపాయాన్ని కల్పించారు. ఇలా ఇప్పుడు జిల్లాలో మొత్తం 554 మంది ఈ కేంద్రాల్లో ఆశ్రయాన్ని పొందారు. వీరికి భోజన సదుపాయంతోబాటు ఉండటానికి వసతి సౌకర్యాన్ని కూడా కల్పించారు. ఇవి కాకుండా మిగిలిన ఉపవమన కేంద్రాల ద్వారా సుమారు 3,170 మందికి రెండు పూటలా భోజనాన్ని పెడుతున్నారు. ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన కొందరు వలస జీవులు, సంచార తెగలు నిత్యం ఏదో ఒక పనిచేసుకుంటూ జీవితాలను వెళ్లదీస్తుంటారు. ఇలాంటి వారంతా ఇప్పుడు లాక్‌డౌన్ కారణంగా పూర్తిగా ఉపాధి కోల్పోయారు. వీరికి ఆదుకొనేందుకు వారున్నచోటే తాత్కాలికంగా సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసి, రెండు పూటలా భోజనాన్ని అందజేస్తోంది. ఇలా శృంగవరపుకోట మండలకేంద్రంలోని ఆకులకట్టవద్ద, కోరుకొండ తదితర చోట్ల ఇతర రాష్టాలనుంచి వచ్చినవారికి భోజన సదుపాయం కల్పించారు. ఈ సహాయ కేంద్రాలకు నోడల్ ఆఫీసర్‌గా జిల్లా అటవీశాఖాధికారి (సామాజిక వన విభాగం) జి.లక్ష్మణ్ వ్యవహరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్నఉపశమన కేంద్రాలను ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఇవే కాకుండా జిల్లా వ్యాప్తంగా వందలాదిమంది వ్యక్తిగతంగా, సంస్థా పరంగా కూడా నిత్యం ఆహారాన్ని అందిస్తూ ఆకలిగొన్న వేళ అన్నార్తులను ఆదుకుంటున్నారు.