సంప్రదాయబద్దంగా సీతారాముల కల్యాణం
పట్టువస్త్రాలు సమర్పించిన ఎంఎల్ఏ బడ్డుకొండ దంపతులు
రామతీర్ధం (విజయనగరం), పెన్ పవర్
నెల్లిమర్ల మండలం రామతీర్ధంలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం శ్రీ సీతారామస్వామి ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. సంప్రదాయబద్దంగా అభిజిత్ లగ్నంలో సీతారాముల కల్యాణాన్ని చూడముచ్చటగా నిర్వహించారు. నెల్లిమర్ల ఎంఎల్ఏ బడ్డుకొండ అప్పలనాయుడు సతీసమేతంగా ఈ వేడుకల్లో పాల్గొని, స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. కొద్దిమంది అధికారులు, ఆలయ పూజారులు మినహా, భక్తులను వేడుకలకు అనుమతించలేదు.
. కరోనా నియంత్రణలో భాగంగా లాక్‌డౌన్ అమల్లో ఉండటంతో అతికొద్ది మంది అతిధుల నడుమ రామతీర్ధంలో శ్రీరామ నవమి వేడుకలను గురువారం నిరాడంబంరంగా నిర్వహించారు. సంప్రదాయ బద్దంగా ప్రభుత్వం తరపున ఎంఎల్ఏ బడ్డుకొండ అప్పలనాయుడు శ్రీ సీతారామస్వామి వారికి పట్టు వస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. అప్పలనాయుడు దంపతులను ఆలయ పూజారులు ఆశీర్వదించి, ప్రసాదాన్ని అందజేశారు.
అనంతరం శ్రీ సీతారాముల కల్యాణాన్ని కేవలం ఆలయ పూజారులు, దేవస్థానం అధికారులు మాత్రమే నిర్వహించారు. స్వామివారికి ప్రభుత్వం సమర్పించిన పట్టువస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను అలంకరించి వైభవంగా కల్యాణాన్ని జరిపించారు. అదేవిధంగా ఆనవాయితీ ప్రకారం సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నుంచి కూడా సీతారామస్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను దేవస్థానం అధికారులు అందజేశారు. ఈ వేడుకలను తిలకించేందుకు సాధారణ భక్తులను అనుమతించనప్పటికీ, ఎప్పటిలాగే శాస్త్రోక్తంగా, సంప్రదాయానుసారం వైభవంగా నిర్వహించారు.
కరోనామహమ్మారినుంచి ప్రపంచాన్ని రక్షించాలి: బడ్డుకొండ అప్పలనాయుడు, ఎంఎల్ఏ
మానవాళిని వణికిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ప్రపంచాన్ని రక్షించాలని ఆ శ్రీరామచంద్రమూర్తిని ప్రార్ధించినట్లు ఎంఎల్ఏ బడ్డుకొండ అప్పలనాయుడు చెప్పారు. ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనాపై నిర్వహిస్తున్న పోరాటంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు సీతారాములు అండగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ ఆదేశాను సారం, కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఈ ఏడాది అతికొద్ది మంది సమక్షంలో రామతీర్ధంలో శ్రీరామ నవమి వేడుకలను నిర్వహించడం జరిగిందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని భక్తులను వేడుకలకు అనుమతించకపోయినప్పటికీ, సంప్రదాయానుసారం కల్యాణాన్ని, ఇతర కార్యక్రమాలను హిందూ ధర్మాన్ని అనుసరించి ఆచార, సంప్రదాయాల ప్రకారం వైభవంగా నిర్వహించడం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో సీతారామస్వామివారి దేవస్థానం ఇఓ కిషోర్‌కుమార్, ఆలయ ప్రధాన పూజారి సాయిరామాచార్యులు, ఇతర ఆలయ పూజారులు, సింహాచలం దేవస్థానం ఇఓ మారెళ్ల వెంకటేశ్వర్లు, ఆయల పూజారి గోపాలకృష్ణమాచార్యులు, నెల్లిమర్ల ఎంపిడిఓ రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.