తెలుసుకుంటూ... తెలియజేస్తూ... అర్థవంతంగా సమయాన్ని గడుపుదాం
ఉపరాష్ట్రపతి ఫేస్ బుక్ నుంచి యధాతధంగా
పాఠకుల కోసం......
కొంత మంది మిత్రులు ఈ లాక్ డౌన్ (స్వీయ నిర్బంధం) సమయంలో మీరేం చేస్తున్నారు, ఎప్పుడూ ప్రజల్లో తిరుగుతుండే మీకు ఇంట్లో పొద్దు ఎలా గడుస్తోంది అని ఆసక్తిగా అడుగుతూ ఉన్నారు. మిత్రులందరికీ సామాజిక మాధ్యమం (ఫేస్ బుక్) ద్వారా ఈ విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను.
ముఖ్యంగా ఆందరి ప్రశ్నా ఒక్కటే... ఒక్క రోజు కూడా విరామం ఇవ్వకుండా అవిశ్రాంతంగా తిరిగే మీకు ఒకే చోట ఇన్నేసి రోజులు గడపడం ఎలా సాధ్యమైందా అని. లాక్ డౌన్ ప్రారంభించిన సందర్భంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఫోన్ ద్వారా మాట్లాడుతూ, క్షణం కూడా తీరిక లేకుండా తిరిగే మీలాంటి వారికి ఇది మరీ కష్టం అంటూ చమత్కరించారు. దీనికి సమాధానం చెప్పాలంటే నేనెంతో అభిమానించే కవి డా. సింగిరెడ్డి నారాయణ రెడ్డికి జ్ఞానపీఠ్ పురస్కారాన్ని సంపాదించి పెట్టిన విశ్వంభర పుస్తకంలోని నా జీవితాన్ని ప్రతిబింబించే ఓ నాలుగు మాటలు చెబితే సరిపోతుందని భావిస్తున్నాను.
ఋషిత్వానికి పశుత్వానికీ.... సంస్కృతికీ దుష్కృతికీ....
స్వచ్ఛందతకూ నిర్బంధతకూ... సమార్ధ్రతకూ, రౌద్రతకూ...
తొలిబీజం మనసు... తులారూపం మనసు...
మనసుకు తొడుగు మనిషి... మనిషికి ఉడుపు జగతి...
ఇదే విశ్వంభరాతత్త్వం... ఇదే అనంత జీవిత సత్యం...
ఏదైనా మనసులోనే ప్రారంభం కావాలి. దేనికైనా మనసే ముందుగా సిద్ధంగా కావాలి. ఆ తర్వాత మనిషి సిద్ధం అవుతాడు. ఈ చిన్న కిటుకు తెలిస్తే... ఎవ్వరైనా సరే దేన్నైనా ఆనందంగా స్వీకరించగలరు. నిజానికి విద్యార్థి దశ నుంచి అంటే 70వ దశకం నుంచి ఈనాటి వరకూ ఎక్కువ సమయం ఒకే చోట గడిపిన సందర్భాలు లేవు. ఎప్పుడూ ప్రజల్లో తిరగడం, కలవడం, మాట్లాడడానికి అలవాటు పడిన నేను ఇలా స్వీయ నిర్బంధంలో (ఎమర్జెన్సీ మినహా) ఉండడం ఎప్పుడూ అలవాటు లేదు. ఇది కొత్త అనుభవం. మంచి పుస్తకాలు చదవడం, మంచి ఆలోచనలు పెంచుకోవడం, పంచుకోవడం లాంటి వాటి ద్వారా ఈ సమయాన్ని మరింత నిర్మాణాత్మకంగా గడిపేందుకు ప్రయత్నిస్తున్నాను. నా కాళ్ళను కట్టేసి, మనసు వేగాన్ని మరింత పెంచి, దినచర్యలో స్వల్పమార్పులు చేసుకుని ఈ స్వీయనిర్బంధాన్ని పాటిస్తున్నాను. మనసును సిద్ధం చేయడం తప్ప, నేను దీని కోసం ప్రత్యేకంగా చేసిందేమీ లేదు.
ఇక రోజు వారి దినచర్య విషయానికి వస్తే ఎప్పటిలాగే ఉదయాన్నే 5 గంలకు నిద్ర లేవడంతో నా రోజు ప్రారంభం అవుతోంది. కాల కృత్యాలు తీర్చుకుని 5.30 గంటల నుంచి 6 గంటల వరకూ శ్రీ అన్నమాచార్య సంకీర్తనలను వింటూ మనసారా ఆనందిస్తున్నాను. ఉదయాన్నే ఒక కప్పు గ్రీన్ టీ. పసుపు, జిలకర, దాల్చిన చెక్క పొడి, అల్లం, నిమ్మరసం, స్వల్పంగా తేనె కలిపిన వేడి తేనీరు తీసుకుంటాను. గ్రీన్ టీతో పాటు రాత్రి నానబెట్టిన బాదం, ఎండు ద్రాక్ష, వివిధ రకాల ఆరోగ్యవంతమైన మొలకెత్తిన విత్తనాలు కూడా తీసుకుంటాను. ఎందుకంటే నాకు ఆరోగ్యం దృష్ట్యా కొంత ప్రొటీన్స్ అవసరం.
ఇక 6 గంటల నుంచి 7 గంటల వరకూ తెలుగు, ఆంగ్లము, హిందీ భాషల దినపత్రికలను ఎక్కువ భాగం ఆన్ లైన్ ద్వారా కొన్నింటిని నేరుగా చదువుతున్నాను. వాటిలో ప్రాముఖ్యత గల అంశాలను, వ్యాసాలను అండర్ లైన్ చేసి, సహాయకులు వచ్చిన తర్వాత వాటిని వేరుగా తీయించి, జతపరచి భవిష్యత్ అవసరాల కోసం ఫైల్ చేయిస్తుంటాను. 7 గంటల నుంచి అరగంట సేపు శ్రీమతి ఉషమ్మతో పాటు ఉపరాష్ట్రపతి నివాసం చుట్టూ ఉన్న పచ్చికలో నడక, ఆ తర్వాత 15 నిముషాల పాటు తేలికపాటి యోగ చేస్తాను. 8 గంటల నుంచి కాసేపు మిత్రులతో, ఇష్టులతో ఫోన్లో సంభాషించండం, తర్వాత స్నానం పూర్తి చేసి గం. 8-45 కు ఉపాహారం.
తర్వాత గం. 9-15 నుంచి గం.10-00 వరకూ ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు, నేటి అవసరాలను, పరిస్థితులను బట్టి, నా ఆలోచనలు, ప్రజల నుంచి వచ్చిన సూచనల గురించి మంత్రులు, అధికారులతో మాట్లాడతాను. ముఖ్యమైన వాటిని అవసరమైనప్పుడు ప్రధానికి తెలియజేస్తాను. 10 గంటల నుంచి ఉపరాష్ట్రపతి నివాసం వెలుపలి ప్రాంగణంలోని పెద్ద వృక్షం కింద కూర్చుని రాజ్యసభ, ఉపరాష్ట్రపతి కార్యాలయం అధికారులతో ముఖ్యమైన అంశాలు ఫోన్లో మాట్లాడతాను. అత్యవసరమైన ఫైళ్ళు ఏవైనా ఉంటే వాటిని చూస్తాను. ఈ లోగా శ్రీమతి ఉషమ్మ తన పూజా, ఇతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని వస్తే, 11 గంటల నుంచి 12.30 వరకూ దేశంలోని, రాష్ట్రంలోని మిత్రులను, పాత సహచరులను ఫోన్ ద్వారా పలకరించి, ఈ సమయంలో ఎలా ఉన్నారో తెలుసుకుంటాము. ఉషమ్మ మా చుట్టు పక్కల గ్రామాల బంధుమిత్రులను చిన్న, పెద్ద తేడా లేకుండా అందరినీ ఫోన్లో పలకరించి క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటారు. ఆ తర్వాత మా పిల్లలతో మాట్లాడతాము. చెన్నైలో ఉన్న మా అల్లుడు, కుమార్తె, మనవడు, మనవరాలితో... తదుపరి హైదరాబాద్ లో ఉన్న కుమారుడు, కోడలు, మనుమరాళ్ళతో మాట్లాడతాము. వారి క్షేమ సమాచారం తెలుసుకుంటాము. ఏదైనా ముఖ్యమైన విషయాలు ఉంటే చర్చిస్తాము.
తర్వాత సరిగ్గా 1 గంటకు మధ్యాహ్న భోజనం చేస్తాము. మేమిద్దరమే కాకుండా, మాతో పాటు ఉంటున్న పిన్నమ్మ సుశీలమ్మ గారితో కలిసి భోజనం చేస్తాము. ఆ తర్వాత ఖాళీగా ఉన్నాం కాబట్టి గంటసేపు విశ్రాంతి తీసుకుంటాము. మధ్యాహ్నం పైన 3 నుంచి 4 గంటల మధ్యలో కాస్త మనసు తేలిక కలిగించే ఘంటసాల, సుశీలమ్మ, జానకి, బాలు లాంటి వారి పాత పాటలు గానీ, చిన్న చిత్రాలు గానీ విని, చూసి కాసేపు కాలక్షేపం చేసి, 4 గంటలకు మళ్ళీ గ్రీన్ టీ తాగి బయటకు వెళ్ళి చెట్టు కింద కూర్చుని ఆఫీసు విషయాలు ఏవైనా ఉంటే శ్రీ విక్రాంత్ తదితర సహాయకుల ద్వారా తెలుసుకోవడం, సూచనలు ఇవ్వడం, వచ్చిన కాల్స్ అన్నింటికీ సమాధానం చెప్పడం, మళ్ళీ శ్రీమతి ఉషమ్మ, నేను కలిసి 5 గంటల వరకూ ఫోన్ ద్వారా మిత్రుల క్షేమ సమాచారం కనుక్కుని, కాసేపు కబుర్లు చెప్పుకుంటూ, ఆయా ప్రాంతాల విశేషాలు కనుక్కోవడం చేస్తాము. పాత రోజులను, పాత జ్ఞాపకాలను రోజుకు ఒక్కసారైనా తలచుకుని ఆనందిస్తుంటాము. అంతే కాకుండా కనీసం వారానికి ఒకరోజు స్వర్ణభారత్ ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి తెలుసుకుని, సూచనలు అందిస్తూ, సేవచేయడంలో లభించే తృప్తిని ఆనందిస్తుంటాను. 5.30 గంటల నుంచి మళ్ళీ 6 గంటల వరకూ నడక, దాని కంటే ముందు ఉపరాష్ట్రపతి నివాసం వెనుక ఉన్న తోటలో కూరగాయలు ఎలా ఉన్నాయి, ఏమేం పెరుగుతున్నాయి, వాటి మంచి చెడు చూసి, చుట్టూ ఉన్న పుష్పాలు, వాటి ప్రగతి, తోటపనుల్లో తీసుకోవలసిన చర్యల గురించి తోటమాలితో చర్చిస్తాము. మేము కూడా స్వయంగా సహకరిస్తాము. ఈ తోటలో మంచి కూరగాయలతో పాటు ఆకుకూరలు పండిస్తున్నాము. రోజూ ఇద్దరం కలిసి ఎంపిక చేసిన కూరగాయలతో చక్కని తెలుగు వంటకాలు చేసుకుని, చేయించుకుని తిని ఆనందిస్తున్నాము. వీటితో పాటు అదనంగా రోజూ కోడిగుడ్లను కూడా తింటూ ఉంటాము. స్వయంగా ఎలాంటి రసాయనాలు వాడకుండా పండించిన శుచి, శుభ్రత కలిగిన ఈ కూరగాయలు తింటుంటే లభించే ఆనందం చెప్పనలవి కానిది. మేము మాత్రమే కాదు, మా దగ్గరలో ఉన్న, సహకరిస్తున్న అందరికీ ఉషమ్మ కూరగాయలు పంచి ఇచ్చి ఆనందిస్తూ ఉంటుంది..
తర్వాత 6.30కు వచ్చి ఆవరణలో ఉన్న చిన్న పాటి పాత ఆంజనేయ స్వామి దేవస్థానం ముందు కూర్చుని ఉషమ్మ పాత భజనల క్యాసెట్ పెడితే, ఇద్దరం కలిసి కాసేపు ఆనందిస్తాము. తర్వాత కాసేపు ఇద్దరం మాట్లాడుకుని, రేపటి వంటకాలు ఏమిటి అని చర్చించుకుంటాము. తర్వాత వంట మనిషి కేదార్ కు తగిన సలహాలు ఇచ్చి, 7 గంటలకు లోపలకు వచ్చి, 7 గంటల నుంచి 8 గంటల వరకూ ముఖ్యమైన వార్తలు ఏవైనా ఉంటే సమీక్ష చేసుకోవడం, తేలిక పాటి తెలుగు పాటలు వినడం, రాత్రి 8-30 కి త్వరగా భోజనం చేసి, 9 గంటలకు నిద్రకు ఉపక్రమించడం. ఈ మధ్యలో నేను వ్యక్తిగతంగా సేకరించిన కొన్ని పుస్తకాలను సందర్భాన్ని బట్టి చదువుతూ ఉంటాను. దేశనాయకుల జీవితాలు, రాజ్యాంగ సభల్లో, నేటి కాలపు చట్టసభల్లో చేసిన అర్థవంతమైన ప్రసంగాలు చదువుతున్నాను. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలను గమనిస్తున్నాను. మంచి సందేశాలను మిత్రులకు పంపిస్తున్నాను. సంక్షిప్తంగా ఇదీ ఈ మధ్యకాలంలో మా దినచర్య. ఈ మధ్యలో నియమాల ప్రకారం ఉపరాష్ట్రపతి కార్యాలయ వైద్యులు వచ్చి క్షేమ సమాచారాన్ని విచారిస్తుంటారు.
ఉపరాష్ట్రపతి నివాసంలో పని చేసే సిబ్బంది చాలా వరకూ వాళ్ళ ఇంటి నుంచే పని చేస్తున్నారు. ఇక్కడకు వచ్చి పని చేసే వారిని దాదాపు ఆపేయడం జరిగింది. పారిశుద్ధ్య, వైద్య మరియు రక్షణ సిబ్బందికి మాత్రం మినహాయింపు లేదు. ఎందుకంటే అది నియమాలకు విరుద్ధం. వంటశాలతో సహా మిగతా వ్యక్తిగత సిబ్బందిని గణనీయంగా తగ్గించి, అవసరమైనప్పుడు మాత్రమే పిలుస్తున్నాం. ఐ.ఏ.ఎస్. అధికారులు సహా ఇతర సహాయ సిబ్బందిని కూడా ఇంటి నుంచే ఆన్ లైన్ ద్వారా పని చేయమని సలహా ఇవ్వడం జరిగింది.
ఎప్పటికప్పుడు దేశం, రాష్ట్రాలు పరిస్థితుల గురించి సమీక్షించి ముఖ్యమైన విషయాలపై ఉపరాష్ట్రపతి పరిధిలో ఆలోచించి, వ్యాసాలు తయారు చేసి, అప్పుడప్పుడు వివిధ భాషల్లోని పత్రికలకు పంపడం, ప్రజల్లో చైతన్యం కలిగించండం, ముఖ్యంగా ఐసీఎంఆర్, కేంద్ర ప్రభుత్వం, డబ్ల్యూహెచ్ఓ, అంతర్జాతీయ ప్రఖ్యాత శాస్త్రజ్ఞుల సందేశాలు గమనించి, వాటిలో ఉపయుక్తమైన వాటిని ట్విట్టర్ ద్వారా జన చైతన్యం కోసం అందించడం జరుగుతుంది. కొన్ని విషయాలపై వివిధ రంగాల్లో నిష్ణాతులైన మిత్రులతో కూడా చర్చిస్తుంటాము.
నిజానికి ఈ కార్యక్రమాలను నేను చాలా కాలంగా ఆచరిస్తున్నాను. చాలా మంది మిత్రులు అడుగుతున్నారు గనుక ఇది రాస్తున్నాను. ఇదేం గొప్ప విషయం కాదు. తెలుసుకోవాలనుకున్న వారికి సమాచారం మాత్రమే. దానితో పాటు కలిగిన ప్రయోజనాలు ఏమిటంటే, నేను మా శ్రీమతి ఉషమ్మ జీవితంలో ఎప్పుడూ లేనంత ఎక్కువ సమయం కలిసి ఉన్నాం. మాట్లాడుకుంటున్నాం. కబుర్లు చెప్పుకుంటున్నాం. (ముఖ్యంగా మా శ్రీమతి ఆనందిస్తోంది) నేను 1970లో పెళ్లైన నాటి నుంచి పట్టుమని 10 రోజులు ఎప్పుడూ ఇంటి పట్టున ఉండలేదు. కారణం మీకు తెలుసు. రెండోది ప్రస్తుతం కుటుంబ సభ్యులు అందరం వేరు వేరుగా ఉంటున్నా, ప్రతి రోజు మాట్లాడుతున్నాను. మూడోది పెద్ద వాళ్ళను పలకరించే అవకాశం, తద్వారా వారికి కలిగే ఆనందం పొందుతున్నాం. శ్రీ అద్వానీజీ, శ్రీ జోషి, శ్రీ మన్మోహన్ సింగ్, శ్రీ దేవగౌడ, శ్రీ ఎ.కె.ఆంటోని, శ్రీ శాంత కుమార్, శ్రీ డి.రాజ, శ్రీ రామ్ నాయక్, శ్రీ మోతీలాల్ వోరా, శ్రీ అహ్మద్ పటేల్, శ్రీ కేశుభాయ్ పటేల్, శ్రీ ఎం.ఎస్. స్వామి నాథన్, శ్రీ మెట్రో శ్రీధరన్, శ్రీమతి జూపూడి హైమావతమ్మ, శ్రీ తుర్లపాటి కుటుంబరావు, శ్రీ పీవీ చలపతిరావు లాంటి పాతకాలంలో పని చేసిన అనేక మంది పెద్దలను పలకరిస్తున్నాను. వివిధ పార్టీల పార్లమెంట్ సభ్యులు, ప్రముఖ పాత్రికేయుల క్షేమసమాచారాలు కనుక్కుంటున్నాను. ఇది వారికి, నాకు ఆనందాన్ని కలిగిస్తోంది. మన సంస్కృతిలో కుటుంబ వ్యవస్థ శక్తివంతమైనది. అది వివిధ కారణాలతో బలహీనపడుతోంది. వేగవంతమైన జీవితంలో వేరుగావేరుగా ఉంటున్న వారందరూ ఈ సమయంలో కుటుంబంలోని వారితో కలిసి మెలసి మాట్లాడుకోవడం, అవకాశం ఉన్న చోట కలిసి ఉండడం, ఇలాంటివి మళ్ళీ మన కుటుంబ వ్యవస్థను పటిష్ట పరుస్తున్నాయి.
ప్రకృతికి సంబంధించి కాలుష్యానికి పెట్టింది పేరైన మన రాజధాని నగరంలో కాలుష్యం గణనీయంగా తగ్గిందని నివేదికలు చెబుతున్నాయి. రణగొణ ధ్వనులు లేవు. మరి ఉపరాష్ట్రపతి నివాసంలో అయితే, గతంలో కన్నా పక్షుల కిలకిలారావాలు చక్కగా వినిపిస్తున్నాయి. రోజూ కొన్ని నెమళ్ళు సహా అన్ని రకాల పక్షులు వచ్చి, విహరించి, కాసేపు చెట్ల మీద గడిపి సమూహాలుగా వెళ్ళిపోతున్నాయి. ఇవన్నీ ప్రకృతి సమతౌల్యతకు ఉపయోగపడుతున్నాయని పెద్దలు, శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. అంతే కాదు అందరం అవసరాన్ని మించి ఏ వస్తువూ వాడడం లేదు. ముఖ్యంగా వాహనాలు వంటివి బయటకు తీసే పరిస్థితి లేదు. అన్నింటికీ మించి మన ఆరోగ్యాలపై శ్రద్ధ చూపించే అవకాశం అందరికీ కలిగింది.
మన ప్రధాన మంత్రి, రాష్ట్రాల ముఖ్యమంత్రులు సకాలంలో తీసుకుంటున్న అనేక చర్యలు సానుకూల ఫలితాలు ఇస్తున్నాయి. సంక్షోభ సమయంలో కలిసి మెలసి ఉండి ఎలా సహకరించుకోవాలో, మనమంతా ప్రస్తుత పరిస్థితులను బట్టి అర్థం చేసుకుంటున్నాం. అనుభవం ఏం చెబుతోందంటే, ఈ వైరస్ నిరోధానికి సులభమైనది, అన్నింటికీ మించిది సామాజిక దూరాన్ని పాటించడం. రెండోది ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించడం. వైద్యులు, శాస్త్తజ్ఞులు, ప్రభుత్వాల సలహాలు పాటించడం. ప్రపంచ దేశాల పరిణామాలు, ఆయా దేశాల జనాభా, అక్కడ సంభవించిన దుర్మరణాలతో పోల్చి చూసుకుంటే 130 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఈ మహమ్మారిని నియంత్రించగలగడం మన ప్రజల సహకారం, క్రమశిక్షణ దేశ నేతృత్వ దూరదృష్టికి నిదర్శనం. విశ్వంభర కావ్యంలో చెప్పినట్టు...
కుత్తుకలను నరికితే కాదు... గుండెలను కలిపితే గెలుపు
వినాశం జరిగితే కాదు... వివేకం పెరిగితే గెలుపు...
సమరం రగిలించేది భీతి... సహనం వర్షించేది ప్రీతి
అనురాగం చేసే శాసనమే... అసలైన రాజనీతి
ఈ విజయం ఒత్తిడితో సాధించింది కాదు. ప్రజల నమ్మకం నుంచి సాధించింది. ప్రజలంతా కలసి కట్టుగా గెలిపిస్తున్నది.
కోవిడ్ మహమ్మారితో జరిగే పోరులో ఐక్య భారతం తప్పక విజయం సాధిస్తుంది. ఈ మహమ్మారిని అరికట్టే సామర్థ్యం రాజకీయ సంకల్పంతోనే గాక, వివిధ రంగాల వృత్తి నిపుణులు అందించే సహకారంతో ముడిపడి ఉంది. ఈ మహమ్మారి అధిగమించే క్రమంలో కరోనా ఆందోళనను అధిగమించేందు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. కరోనా వార్తలను రోజుకు ఒక్కసారి తెలుసుకుంటే చాలు. రోజంతా దానినే చూడడం, ఆలోచించడం లాంటివి మంచిది కాదు.. స్వీయ నిర్బంధంలో ఉంటూ, సామాజిక దూరాన్ని పాటిస్తూ ఇప్పటికే మీరు కీలకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జరిగేదేదో జరుగుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. మీ ఆతురత వల్ల మీరు పొందేది ఏమీ లేదు. అమితాసక్తి, ఆదుర్దా, ఆందోళన అనంతరం ఆవేదన కలిగిస్తాయి. అందువల్ల రోజుకు ఒక్కసారికి మించి కరోనా వార్తలు వినకూడదు. భయం లేకుండడం అనే గుణాన్ని ఆత్మ గొప్ప లక్షణాల్లో ఒకటిగా భగవద్గీత చెబుతోంది. ధైర్యంతో మీ మనసును నింపండి. దేవుడి మీద విశ్వాసం ఉంచండి. మరీ ముఖ్యంగా పొద్దునే నిద్ర లేచిన వెంటనే మొబైల్ చూడడం, నిద్రకు ఉపక్రమించే ముందు టీవీ, మొబైల్, కంప్యూటర్ లాంటి వాటి ముందు కూర్చోవడం అస్సలు మంచిది కాదనే విషయాన్ని గ్రహించాలి. నిద్ర లేచిన వెంటనే తలుపులు, కిటికీలు తెరచి బయటకు చూస్తూ ప్రకృతిని, సూర్యోదయాన్ని ఆస్వాదించండి. తద్వారా మంచి ఆలోచనలు వస్తాయి.
ఈ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడపడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఉల్లాసం కలుగుతుంది. వైరస్ తో చేస్తున్న ఈ యుద్ధంలో అందరితో కలిసి ఆలోచనలు పంచుకోవడమే విజయాన్ని సాధించే మార్గం. పెద్దలు, పిల్లలతో కబుర్లు చెప్పుకుంటూ సమయాన్ని సదుపయోగం చేసుకోవాలి. పిల్లలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని బామ్మ, తాతయ్యలతో తగిన సమయం గడిపి విలువైన ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. పిల్లలు, పెద్దలు అందరూ కూర్చుని కాసేపు అనుభవాలు, అనుభూతులు కలబోసుకోవాలి. కలిసి పంచుకోవాలి. పిల్లలు వంటపని, ఇంటి పనిలో తల్లిదండ్రులకు సహకరిస్తూ నేర్చుకోవాలి. పాత మిత్రులను బంధువులను ఫోన్ ద్వారా పలకరించేందుకు కూడా ఇదో మంచి అవకాశం. పాఠశాలలు, కళాశాలలకు ఇచ్చిన సెలవులను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు మాతృభాషతో పాటు, హిందీ, ఆంగ్లంతో పాటు పొరుగు భాషలు అదనంగా నేర్చుకునే ప్రయత్నం చేయాలి. సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం, వ్యాయామం, పాకశాస్త్రం, రచనలు ఇలా వేటిలో అభిరుచి ఉంటే వాటిని సాధన చేయాలి. ముఖ్యంగా ఈ సమయంలో పెద్ద బాల శిక్ష, పంచతంత్రం లాంటి విజ్ఞానాన్ని పెంచే ప్రాచీన పుస్తకాలతో పాటు అలనాటి చందమామ, బాలమిత్ర సంపుటాలను చదివే అలవాటు చేసుకోండి. పిల్లలతో పాటు పెద్దలు కూడా చదవడం వల్ల ప్రాపంచిక పరిజ్ఞానం పెరుగుతుంది. తోటి వారికి సహకరించేందుకు, కష్టాల్లో ఉన్న అన్నార్తులను, పేదలను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థల సేవాకార్యక్రమాలకు సహకారం అందజేద్దాం.
కరోనా మహమ్మారి మీద జరుపుతున్న ఈ పోరులో కలిసి ముందుండి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మన ప్రాణాల కోసం శ్రమిస్తున్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, శానిటరీ సిబ్బంది, పోలీసులు తదితరులకు సంఘీభావం తెలుపుతూ చప్పట్ల ద్వారా తెలియజేయడం గానీ, ప్రియమైన ప్రధాని పిలుపునకు దేశ వ్యాప్తంగా అద్భుతమైన రీతిలో స్పందించి, దీపాలు వెలిగించి ఆయన చెప్పిన విధంగా "మనం అన్నివైపుల నుంచీ ఒక్కొక్క దీపంతో నిలబడినపుడు ఏ సామూహిక లక్ష్యం కోసమైతే మనం పోరాడుతున్నామో ఆ దిశగా వెలుగుకు గల అద్భుత శక్తిని మనం అనుభూతి చెందగలం. ఆ వెలుగులో.. ఆ మెరుపులో... ఆ ప్రకాశంలో... మనం ఒంటరులం కామని, మనలో ఎవరూ ఒంటరిగా లేరని, 130 కోట్లమంది భారతీయులమైన మనమంతా ఓ సామూహిక లక్ష్యసాధనకు కట్టుబడి ఉన్నామని దృఢంగా సంకల్పం చెప్పుకుందాం" అనే మాటలు అనుసరించి మనందరికీ ఈ అంధకారాన్ని పారదోలే శక్తి ఉందని, ఎవరూ ఒంటరి వారిమి కాదని నిరూపించగలిగాం. ఈ పరిస్థితి మరికొంత కాలం కొనసాగించాలి. ఎందుకంటే మన ఐసీఎంఆర్. శాస్త్రజ్ఞులు, ఈ వ్యాధి ఒక వ్యక్తి నుంచి 406 మందికి వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందుకే ఇంకొంత కాలం మనం జాగ్రత్తగా ఉండాలి. వైద్యుల సూచనలతో పాటు, ప్రభుత్వాలు పెట్టే నిబంధనలు స్వచ్ఛందంగా పాటించాలి. మనిషి తలుచుకుంటే ఇదేమంత పెద్ద విషయం కాదు. ఆలోచనలు పెంచుకుందాం, పంచుకుందాం. అదే విధంగా ఐశ్వర్యాన్ని పంచుకుని, ఆనందాన్ని పెంచుకుందాం. ఈరోజు ప్రధాని జాతినుద్దేశించి మాట్లాడుతూ.. సప్త పదులు అంటే సప్త విధులను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ఎంతో ఆలోచించి, ప్రపంచవ్యాప్త పరిస్థితిని, శాస్త్రజ్ఞుల సలహాలను ముఖ్యమంత్రులతో సంప్రదించి ఇచ్చిన పిలుపు ఇది. లాక్‌డౌన్‌లో ఏప్రిల్ 20 నుంచి కొన్ని మినహాయింపులు ఇస్తామన్నారు. ఈ పరీక్షా సమయంలో మన ప్రవర్తనను బట్టి.. పొడగింపు, సడలింపు, ముగింపు ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి. ఉపరాష్ట్రపతికి ఉన్న సౌకర్యాలు అందరికీ ఉండకపోవచ్చు. మనకున్న పరిమితుల్లో మనసును అదుపులో పెట్టుకుని మన దైనందిన కార్యక్రమాలు రూపొందించుకోవాలి. ఇదే నా మిత్రులకు, ప్రజలకు నేనిచ్చే సలహా. మరింత పట్టుదలతో, సంయమనంతో మనం కలిసి నడుద్దాం. ఈ మహమ్మారిని ఎదుర్కొందాం. ఏదైనా, ఏమైనా మనసుని గెలిచిన మనిషికే సాధ్యం. మనం అంతిమంగా విజయం సాధిస్తాము.