జర్నలిస్ట్ ఖషోగీ హత్యలో సౌదీ యువరాజు హస్తం: అమెరికా నిఘా నివేదిక!
నేడు ఆ నివేదికను విడుదల చేయనున్న అమెరికా
సీఐఏ, ఇతర నిఘా సంస్థల సమాచారం ఆధారంగా రిపోర్ట్
ఖషోగిని చంపిన వారిపై వేరే మార్గాల్లో చర్యలు తీసుకుంటామన్న విదేశాంగ శాఖ
సౌదీపై ఆంక్షలు, ఆయుధ విక్రయాల నిషేధంపై యోచిస్తున్నామని వెల్లడి
న్యూస్ డెస్క్ , పెన్ పవర్
సంచలనం సృష్టించిన జర్నలిస్ట్ జమాల్ ఖషోగి హత్యలో సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ప్రమేయం ఉందా? అంటే అవుననే అంటోంది అమెరికా నిఘా నివేదిక. సల్మాన్ సూచనల మేరకే ఖషోగిని హత్య చేశారని నివేదికలో పేర్కొన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం ఆ నివేదికను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. 2018 అక్టోబర్ లో ఇస్తాంబుల్ లోని సౌదీ కాన్సులేట్ లో ఖషోగి హత్య జరిగింది. అప్పటి నుంచి సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ), ఇతర నిఘా సంస్థల సమాచారం ఆధారంగా ఈ నివేదికను తయారు చేసినట్టు చెబుతున్నారు. హత్యకు సౌదీ యువరాజు సల్మాన్ పాత్ర ఎంతమేరకుంది? ఆయన ఎలా సహకరించారు? వంటి వివరాలను మాత్రం వాళ్లు వెల్లడించలేదు. అయితే, నివేదికపై స్పందించేందుకు అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ నిరాకరించారు. హత్యలకు కారకులైన వారిని శిక్షించేందుకు వేరే మార్గాల్లో చర్యలు తీసుకుంటున్నామన్నారు. సౌదీకి ఆయుధ విక్రయాలపై నిషేధం, ఆంక్షలు విధించడం వంటి చర్యలపై ఆలోచిస్తున్నామన్నారు. జవాబుదారీతనానికి పారదర్శకతే ముఖ్యమని, అయితే, వారికి ఆ జవాబుదారీతనం లేదని తాను అనుకుంటున్నానని చెప్పారు. ప్రస్తుత నివేదిక విడుదల కాకుండా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆపారన్నారు.హత్యపై అప్పట్లో ప్రపంచ దేశాల నుంచి ఎన్నో విమర్శలు వచ్చాయి. సల్మాన్ పాత్ర ఉందన్న ఆరోపణలూ వెల్లువెత్తాయి. అయితే, హత్యతో తనకే సంబంధమూ లేదని సల్మాన్ చెబుతూ వచ్చారు. అయితే, దేశ యువరాజుగా ఖషోగి హత్యకు బాధ్యత వహిస్తున్నానని అన్నారు. ప్రస్తుతం హత్య కేసులో అరెస్టైన నిందితులపై విచారణ జరుగుతోంది. కాగా, నివేదిక విడుదలకు ముందే గురువారం సల్మాన్ కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్ చేసి మాట్లాడారు. ప్రాంతీయ భద్రత, యెమన్ లో యుద్ధాన్ని ఆపడంలో ప్రయత్నాలు, మానవ హక్కులు, శాంతి భద్రతలు కాపాడడం వంటి విషయాలపై చర్చించారు.