Followers

ఆంక్షలు కఠినం ... అవసరమైతే లోకల్ లాక్ డౌన్

 ఆంక్షలు కఠినం ... అవసరమైతే లోకల్ లాక్ డౌన్

కోవిడ్ నియంత్రణలో రాజీపడేది లేదు
జిల్లా కలెక్టర్ కు డిప్యూటీ సీఎం కృష్ణదాస్ ఆదేశాలు

శ్రీకాకుళం, పెన్ పవర్

కోవిడ్ కేసులు అనూహ్యంగా పెరిగిపోతున్నందున ఆంక్షలు మరింత కఠినంగా అమలు చేయాలని, జిల్లాలో అవసరమైన చోట్ల లోకల్ లాక్ డౌన్ విధించేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ జిల్లా కలెక్టర్ జె.నివాస్ ను ఆదేశించారు. ఆయన సోమవారం ఉదయం కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ కేసుల పరిస్థితిపై సమీక్షించారు. ఈ వారంలో ప్రతిరోజూ రెండు వేలకు మించి పాజిటివ్ కేసులు నమోదవుతుండడం ఎంతో ఆందోళన కలిగిస్తున్న విషయమని అన్నారు. ఇంకా కోవిడ్ పరీక్షల సంఖ్యను బాగా పెంచాలని సూచించారు. కోవిడ్ రోగులకు సత్వర వైద్యాన్ని అందించే విషయంలో ఎంతమాత్రం అలక్ష్యం పనికిరాదని, ప్రతి పాజిటివ్ కేసుకీ వెంటనే తగిన వైద్య సదుపాయాలు కల్పించాలన్నారు. ఫోన్ చేసిన మూడు గంటల్లో కోవిడ్ రోగికి పడక ఏర్పాటు చేయడమే లక్ష్యంగా సీఎం జగన్ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని అన్నారు. 

 ఐదువేల పడకలు సిద్దం చేయాలి : 

జిల్లాలో కనీసం ఐదు వేల పడకలు త్వరితగతిన ఏర్పాటు చేయాలని మంత్రి  పేర్కొన్నారు. హెూమ్ ఐసోలేషన్ లో ఉన్న వారిపై మరింత ప్రత్యేక దృష్టి సారించాలని,  అందరికీ కిట్స్ అందాలని సూచించారు. ఏ.ఎన్.ఎం ఇళ్లను సందర్శించడం లేదనే ఆరోపణలు రాకూడదని, వాటిని సరిదిద్దాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. ఆక్సిజన్, రేమిడిసివర్ ఇంజెక్షన్ సరఫరాలో ఇబ్బందులు ఉండకూడదన్నారు. ప్రతి పడకపై ఉన్న బాధితులకు మంచి మెరుగైన వైద్య సేవలు అందాలని ఆయన ఆదేశించారు. కోవిడ్ బాధితులకు మందులు, ఆహారం సకాలంలో అందాలని,  వెంటిలేటర్, ఆక్సిజన్ పడకలపై ఉన్న క్రిటికల్ కేసుల పరిస్థితిపై ప్రత్యేక దృష్టి సారించాలని, వాటి సంఖ్య తక్కువగా ఉన్నందున వాటిని పెంచే సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆయన పేర్కొన్నారు.

 ఆహారం, శానిటేషన్ పై ఫిర్యాదులు ఉండరాదు : 

104 కాల్ సెంటర్ అత్యంత కీలకమైన వ్యవస్థగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి భావిస్తున్నారని చెప్పారు. సాధ్యమైనంత మేర ఏ వ్యక్తి మరణించకుండా శాయశక్తుల కృషి చేయాలని ఆయన తెలిపారు. వైద్యులు, వైద్య సిబ్బంది మానవతాధృక్పధంతో సేవలను అందించి బాధితుల కుటుంబాల్లో ఆనందం నింపుతున్నారని అభినందించారు. కోవిడ్ వైద్యం కోసం వచ్చే వారికి తక్షణం పడకలు అందాలని ఆ మేరకు ఏర్పాట్లు ఉండాలని అన్నారు. ఆక్సీజన్ వినియోగించడంలో వృధా ఉండరాదని సూచించారు. ప్రతి ఒక్కరి ప్రాణాలు కాపాడటమే ధ్యేయంగా పనిచేయాలని ఆదేశించారు. కొవిడ్ సెంటర్లలో ఆహారం, శానిటేషన్ విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని, అన్ని చోట్ల సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రైవేట్ ఆస్పత్రిలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే మాట వినిపించుకూడదని ఫిర్యాదులు వస్తే వాటిపై దృష్టి పెట్టాలని చెప్పారు. 

ఆక్సిజన్ పడకల కొరత లేదు  కలెక్టర్ నివాస్ :

 దీనిపై జిల్లా కలెక్టర్ కె నివాస్ స్పందిస్తూ రెండవ విడత కరోనా వ్యాప్తి సందర్భంగా జిల్లాలో వైద్య సదుపాయాలను బాగా మెరుగుపరచడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. కొద్ది రోజుల్లో అదనంగా మరిన్ని పడకలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. ప్రస్తుతం 17 వందలు ఉన్నాయని అందులో దాదాపు 13 వందల బెడ్లలో కోవిడ్ బాధితులు ఉన్నారని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉన్న ఆక్సిజన్ బెడ్లు అన్నిటినీ కోవిడ్ కోసం తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. రాజాం, పాలకొండ, ఇచ్చాపురం, మందన వంటి ప్రాంతాల్లో సైతం ఆక్సిజన్ పడకలు ఏర్పాటు చేయుటకు సన్నాహాలు చేస్తున్నామని కలెక్టర్ నివాస్ తెలిపారు. జెమ్స్ లో ఆక్సిజన్ పడకలు పెంచుతున్నామని, రిమ్స్ లో అదనంగా వంద పడకలను రెండు రోజుల్లో ఏర్పాటు చేశామని వివరించారు. రాజాం ఏరియా ఆస్పత్రి, జిఎంఆర్ ఆస్పత్రిని కోవిడ్ ఆస్పత్రులుగా మార్చామని, పాలకొండ ఆసుపత్రిని కూడా మార్చుతున్నామని ఆయన చెప్పారు. జిల్లాలో కోవిడ్ కేర్ కేంద్రాలను ఏర్పాటు చేశామని అందులోనూ మంచి వైద్య సదుపాయాలు అందిస్తున్నామని, హెూమ్ ఐసోలేషన్ లో ఉన్నవారికి కూడా వైద్య సదుపాయాలు అందిస్తున్నట్లు చెప్పారు. కంటైన్మెంట్ ఆపరేషన్లను పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు వివరించారు.  పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు 24 గంటల్లో ఫలితాలను తెలియజేస్తున్నామని చెప్పారు. జిల్లాలో రోజుకు 48 వేల లీటర్ల ఆక్సిజన్ అవసరమని, ప్రస్తుతానికి ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కావడం లేదని ఆక్సిజన్ సరఫరా పెంచుటకు విశాఖపట్నం జిల్లా యంత్రాంగంతో సైతం సంప్రదింపులు జరిపామని కలెక్టర్ తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి రేమిడీస్వీర్ ఇంజక్షన్ అవసరం మేరకు అందిస్తున్నామని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కు కలెక్టర్ నివాస్ వివరించారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...