మొదటి డోస్ వ్యాక్సిన్ వేయించుకుంటున్న కొడాలి నాని
👉 కోవిడ్ మొదటి డోస్ వ్యాక్సిన్ వేయించుకున్న మంత్రి కొడాలి నాని
👉 ప్రభుత్వం సూచించిన విధంగా వ్యాక్సిన్ వేయించుకోండి
👉 బాధ్యతతో కోవిడ్ మరణాలను నిరోధించండి
👉 రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
గుడివాడ, పెన్ పవర్
రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ( నాని ) శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి కోవిడ్ మొదటి డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని సచివాలయంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రభుత్వం సూచించిన విధంగా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. బాధ్యతతో కోవిడ్ మరణాలను నిరోధించాలని సూచించారు. రాష్ట్రంలో రెండవ విడత కోవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించామన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని పరీక్షలు, పడకలను పెంచడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. ఆర్టీపీసీఆర్‌తో పాటు ట్రూనాట్ టెస్ట్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు.
పలు జిల్లాల్లో ప్రభుత్వ ఆసుపత్రులను పూర్తిగా కోవిడ్ కేంద్రాలుగా మార్పు చేయడం జరిగిందన్నారు. అత్యవసర చికిత్సలు మినహా సాధారణ శస్త్రచికిత్సలను వాయిదా వేశారన్నారు. దేశంలో 18 ఏళ్ళు నిండిన వారందరికీ మే 1 వ తేదీ నుండి కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ నెల 24 వ తేదీ నుండి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైందన్నారు. కోవిన్ యాప్ ద్వారా 18 ఏళ్ళు నిండిన వారంతా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడానికి మరిన్ని ప్రభుత్వ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కోవిడ్ మొదటి దశలో కన్పించిన లక్షణాలతో పాటు రెండవ దశలో అదనంగా తలనొప్పి, నీళ్ళ విరేచనాలు, ఒళ్ళు నొప్పులు, నీరసం, వాంతులు, వినికిడి సమస్య, కళ్ళు ఎర్రబారటం వంటి లక్షణాలు కన్పిస్తున్నాయన్నారు. ఈ సెకండ్ వేవ్ లో కరోనా వైరస్ మరింత బలంగా మారి 18 నుండి 45 సంవత్సరాల సమూహంలోని యువ జనాభాను కూడా ప్రభావితం చేస్తోందన్నారు. కరోనా వైరస్ ప్రభావాన్ని అర్ధం చేసుకుని దానికనుగుణంగా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. జనాభాలో 70 శాతం ప్రజలు పూర్తి వ్యాక్సినేషన్ పొందే వరకు ఇలాంటి వేవ్ లు వచ్చే అవకాశం ఉంటుందని, ప్రజలంతా పూర్తిగా వ్యాధి నిరోధక శక్తి పొందే వరకు మాస్క్ లను ఉపయోగించడం మానకూడదన్నారు. పాడైన, లూజుగా ఉండే మాస్క్ లను ధరించవద్దన్నారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండే మాస్క్ లను ఉపయోగించవద్దన్నారు. ఇదిలా ఉండగా ఆక్సిజన్ డిమాండ్, సరఫరా అందుబాటుపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. ప్రస్తుతం రోజుకు 80 నుండి 100 టన్నుల ఆక్సిజన్ అవసరమవుతోందని అధికారులు తెలిపారన్నారు. రాష్ట్రానికి విశాఖ స్టీల్ ప్లాంట్, భువనేశ్వర్, బళ్ళారి, చెన్నైల నుండి ఆక్సిజన్ తెచ్చుకునేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఇప్పటికే ఆక్సిజన్ సరఫరాను ప్రారంభించిందని మంత్రి కొడాలి నాని తెలిపారు.
No comments:
Post a Comment