కలుషిత జలాలను చెరువులో వదలి ప్రజల ప్రాణాలతో చెలగాటమా
కురుంజలం లెదర్ పరిశ్రమ వద్ద రైతుల ధర్నా
సీఎల్ఎన్ పల్లి సర్పంచ్ దుడ్డు వేణు ఆధ్వర్యంలో గ్రామస్తుల ఆందోళన
విచారణచేపట్టిన ఎస్సై పురుషోత్తంరెడ్డి
వరదయ్యపాలెం, పెన్ పవర్ న్యూస్
పరిశ్రమ నుంచి వెలువడే విషపూరిత రసాయనాలు వ్యర్థ జలాలను కాలువలోకి వదలి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతారా అంటూ పల్లి సర్పంచ్ దుడ్డు వేణు గోపాల్ ఆధ్వర్యంలో గ్రామస్తులు వరదయ్యపాలెం మండలం కురుంజలం లెదర్ పరిశ్రమ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామస్తులు మాట్లాడుతూ ప్రాణాంతక వ్యర్థ నీటిని పైపుల ద్వారా కాలువలోకి వదలడం వల్ల చెరువు కలుషితమై పంటలు ఎండిపోతున్నాయి అది ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా భూగర్బ జలాలు సైతం విషపూరితంగా మారి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు.
దీనిపై కంపెనీ ప్రతినిధి రాజేంద్రన్ డైనేజి టాంక్ నిండినపుడే కాలువలోకి మురికినీరు మాత్రమే వెళుతుందని, దీనివల్ల ఎటువంటి ఇబ్బందీ లేదని నచ్చజెప్పేందుకు యత్నించారు. దీనిపై గ్రామస్తులు మండిపడుతూ ప్రజలని తప్పుదారి పట్టిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. కంపెనీ నుంచి వచ్చే వ్యర్థ నీటిని కాలువలోకి వదలకుండా పైపులు తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎస్సై పురుషోత్తం రెడ్డి అక్కడకు చేరుకుని వ్యర్థ నీటిని నిల్వ చేసిన బావులను, అక్కడ నుంచి పైపుల ద్వారా కాలువలోకి వదిలే స్థలాన్ని పరిశీలించారు. ప్రజల ఆరోగ్య దృష్ట్యా వారి ఆందోళన మేరకు కలుషిత నీటిని కాలువలోకి వదలకుండా చర్యలు తీసుకోవాలని, కంపెనీ ఆవరణలోనే బావులను ఏర్పాటు చేసి వాటిలో నీటిని వదిలేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామపెద్దలు కుమారస్వామిరెడ్డి, భరత్ రెడ్డి మాజీ ఎంపీటీసీ మోహన్ రావ్ మరియు గ్రామస్తూ పాల్గొన్నారు.
No comments:
Post a Comment