చరిత్ర మరువని మహనీయుడు శివాజీ మహరాజ్
కూకట్ పల్లి, పెన్ పవర్మహానుభావుల జయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో కె.పి.హెచ్.బి కాలని మూడో ఫేస్ కట్టా వారి సేవా కేంద్రం వద్ద హిందూ సామ్రాజ్య వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ 341వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ పోలీస్ అధికారి నారే గూడెం బుచ్చిరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి చత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భముగా బుచ్చిరెడ్డి మాట్లాడుతూ పదహారు సంవత్సరాల వయసులో కత్తి పట్టి యుద్ధం చేసిన మహావీరుడు చత్రపతి శివాజీ అని, యుద్ధములో శత్రువుల ఎత్తులకు పైఎత్తులు వేయగల ధీరుడు అని, తన రాజ్యములో ప్రజలకు కష్టాలు రాకుండా చూసేవారని కొనియాడారు. అలాగే సతీసహగమనాన్ని కూకటివేళ్లతో పెకిలించి ఆడవాళ్ళ చేత అన్నయ్యా అని పిలిపించుకున్న మహానుభావుడని, ధైర్యసాహసాలకు పరాక్రమాలకు నిలువెత్తు నిదర్శనం చత్రపతి శివాజీ మహారాజ్ అని, పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి లెక్కలేనన్ని యుద్ధాలు చేసినా ఎన్నడూ పవిత్ర స్థలాలను ధ్వంసం చేయలేదని అన్నారు. యుద్ధంలో ఓడిపోయిన శత్రువుల రాజ్యంలో యుద్ధం చేయలేని వారికి, స్త్రీలకు, పసివారికి సహాయం చేసే వారని, యుద్ధ తంత్రాలలో మాత్రమే కాకుండా పరిపాలనా విధానంలో కూడా శివాజీ మహారాజ్ భారత దేశ రాజులలో అగ్రగణ్యుడని, పటిష్టమైన గూడాచారి వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ప్రజలకోసమే ప్రభువు అన్న సూత్రం పాటిస్తూ వ్యక్తిగత విలాసాలకు ఎటువంటి వ్యయం చేయక ప్రజల సంక్షేమం కోసం ఎనలేని పాటుపడ్డా మహావీరుడు శివాజీ అని తెలిపారు. ఈకార్యక్రమములో మహానుభావుల జయంతి ఉత్సవాల కమిటీ అధ్యక్షులు కట్టా నరసింగరావు, కొల్లా శంకర్, సరిపెల్ల బలరామరాజు, మాజీ పోలీస్ ఆఫీసర్లు కాముని నరసింహారెడ్డి, బండారి మల్లారెడ్డి, పి. మొగలయ్య, స్థానిక నాయకులు వాసిరెడ్డి లక్ష్మినారాయణ, గౌరవరపు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment