కరోనాను ఎదుర్కొనడానికి సిద్దంగా ఉన్నాం
3వేల పడకలతో కోవిడ్ కేర్ సెంటర్లు
కోవిడ్ కట్టడికి మూడంచెల వ్యూహం
విజయనగరం, పెన్ పవర్
కరోనా రాకుండా అన్ని రకాల ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఒకవేళ వస్తే దైర్యంగా ఉండాలని విజయనగరం పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ సూచించారు. ఈ మహమ్మారిని ఎదుర్కొనడానికి జిల్లా యంత్రాంగం సిద్దంగా ఉందని ఆయన అన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్‌తో కలిసి జెఎన్‌టియు కోవిడ్ కేర్‌సెంటర్‌ను ఆయన శుక్రవారం పరిశీలించారు. కేర్ సెంటర్‌వద్ద ఏర్పాటు చేసిన ఆసుపత్రి, పిపిఇ కిట్లు, మందులు, కోవిడ్ కిట్లు, ఆక్సీజన్ సిలండర్లు, ఇసిజి, మెనూ బోర్డులు, రూముల్లోని పడకల ఏర్పాట్లను పరిశీలించి, ఎంపి సంతృప్తిని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎంపి బెల్లాన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు కోవిడ్‌ను ఎదుర్కొనడానికి జిల్లా యంత్రాంగం అన్నివిధాలా సంసిద్దంగా ఉందని అన్నారు. దీనిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 3వేల పడకలతో కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే సుమారు 1000 పడకలతో నాలుగు చోట్ల కేర్ సెంటర్లు సిద్దం చేశామన్నారు. విజయనగరంలోని గిరిజన్ భవన్‌లో 66 పడకలు, జెఎన్‌టియులో 600 పడకలు, బొబ్బిలిలో జనహిత డైట్ కాలేజ్‌లో 100, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్‌లో 250 పడకలతో సెంటర్లను సిద్దం చేసినట్లు చెప్పారు. ప్రభుత్వం నిర్ధేశించిన విధంగా ఒక్కో రోగికి రోజుకు సుమారు రూ.300 ఖర్చులో మంచి పోషకాహార భోజనాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కేర్ సెంటర్ల వద్ద అవసరమైన సమయంలో వినియోగించుకొనేందుకు ఆక్సీజన్ సదుపాయం కూడా ఉందని, రోగులను అత్యవసర పరిస్థితిలో ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్సులను కూడా సిద్దంగా ఉంచుతున్నట్లు చెప్పారు. కరోనా సోకితే భయపడకుండా ధైర్యంగా ఉండాలని సూచించారు. జిల్లా ఆసుపత్రుల్లో ఆక్సీజన్ కొరత లేదన్నారు. జిల్లా కేంద్రాసుపత్రిలో ఆక్సీజన్ నిల్వ సామర్థ్యాన్ని 2వేల కిలో లీటర్ల నుంచి 8 వేల కిలోలీటర్లకు పెంచుతున్నట్లు చెప్పారు. రోగులు ఆసుపత్రిలో ఆక్సీజన్‌ను వృధా చేయవద్దని ఎంపి కోరారు.
కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ మాట్లాడుతూ, జిల్లాలో కోవిడ్‌ను కట్టడి చేసేందుకు మూడంచెల వ్యూహాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. కరోనా నివారణా చర్యల్లో భాగంగా, ఈ వ్యాధి పట్ల విస్తృతమైన అవగాహనను పెంపొందించడం, మాస్కులను ధరించాలని, శానిటైజర్లు వాడాలని, భౌతిక దూరాన్ని పాటించాలని ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు వేక్సినేషన్‌ను కార్యక్రమాన్ని విస్తృతం చేశామన్నారు. ఫ్రంట్‌లైన్ వారియర్లతోపాటుగా, 45 ఏళ్లు పైబడిన ప్రతీఒక్కరికీ వేక్సిన్ వేస్తున్నామని, 18 ఏళ్లు పైబడిన వారికి రిజిష్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించామని తెలిపారు. రెవెన్యూ, పోలీసు సిబ్బంది సహకారంతో కంటైన్‌మెంట్ స్ట్రాటజీని పకడ్భంధీగా అమలు చేస్తూ, వ్యాధి ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా కట్టుధిట్టం చేస్తున్నామన్నారు.వ్యాధి సోకిన వారికి మూడు పద్దతుల ద్వారా చికిత్సను అందిస్తున్నామని కలెక్టర్ చెప్పారు. ఎటువంటి లక్షణాలు లేనివారిని హోం ఐసోలేషన్‌లోనే ఉంచి, వారికి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేస్తున్నామన్నారు. వీరికి ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా 3 గంటల్లోనే కోవిడ్ కిట్లను అందజేస్తున్నామని తెలిపారు.
ఇళ్లలో ఏకాంతంగా ఉండే అవకాశం లేనివారిని కోవిడ్ కేర్ సెంటర్లకు తరలించి, చికిత్సను అందిస్తున్నామన్నారు. లక్షణాలు తీవ్రంగా ఉన్నవారిని కోవిడ్ ఆసుపత్రులకు తరలిస్తున్నామన్నారు. దీనికోసం జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 30 ఆసుపత్రులను సిద్దం చేశామని, 14 ప్రభుత్వ ఆసుప్రతులతోపాటు, 16 ప్రయివేటు ఆసుపత్రుల్లోని 2,098 పడకలను సిద్దం చేసి చికిత్స చేయిస్తున్నామని చెప్పారు. వైద్యులు, సాంకేతిక నిపుణులు, నర్సులు తదితర సిబ్బంది కూడా సిద్దంగా ఉన్నారన్నారు. ఎప్పటికప్పుడు డెత్ ఆడిట్‌ను నిర్వహిస్తూ, మరణాలపై విశ్లేషణ కూడా జరుపుతున్నామని కలెక్టర్ వివరించారు. ఈ పర్యటనలో జాయింట్ కలెక్టర్లు డాక్టర్ జి.సి.కిశోర్ కుమార్, డాక్టర్ ఆర్.మహేష్ కుమార్, ఆర్‌డిఓ బిహెచ్ భవానీ శంకర్, జెడ్‌పి సిఇఓ టి.వెంకటేశ్వర్రావు, విజయనగరం డిఎస్‌పి పి.అనిల్, తాశీల్దార్ ఎం.ప్రభాకరరావు, ఎంపిడిఓ చైనులు, సిఐ మంగవేణి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment