మహిళలు గొప్ప వ్యాపారవేత్తలుగా మారాలి
రాష్ట్రంలో మహిళలను గొప్ప వ్యాపారవేత్తగా, లక్షాధికారులుగా చూడాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకం రెండవ సంవత్సరం అమలులో భాగంగా శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో సమావేశం ద్వారా మాట్లాడారు. ఈ వీడియో సమావేశానికి చిత్తూరు నగరపాలక సంస్థ నుంచి నగర మేయర్ ఎస్.అముద, నగర కమిషనర్ పి.విశ్వనాథ్, డిప్యూటీ మేయర్ ఆర్.చంద్రశేఖర్, డ్వాక్రా సంఘాల మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ సున్నా వడ్డీ పథకాన్ని రెండవ సంవత్సరం కొనసాగిస్తున్నామని... 2020-21 ఆర్థిక సంవత్సరంలో సకాలంలో చెల్లించిన అన్ని సంఘాలకు, ఈ సంవత్సరం తీసుకున్న కొత్త రుణాలు కూడా సున్నా వడ్డీకే రుణాలు అందిస్తున్నామని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మహిళలు వ్యాపారాలు చేయడం ద్వారా ఆర్థికంగా స్థిరపడాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు వివరించారు. సమావేశంలో మెప్మా సీఎంఎం గోపి, ఆర్పి లు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వీడియో సమావేశాన్ని అన్ని వార్డు సచివాలయాల్లో డ్వాక్రా సంఘాల మహిళలు వీక్షించారు.
No comments:
Post a Comment