ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్..
భవిష్యత్తు అవసరాల అంచనాతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ సమస్యలపై ప్రణాళికను సిద్ధం చేయాలి..
సీఎం కేసీఆర్ ముందుచూపు..3 వేల కోట్ల నిధులతో శివారు ప్రాంతాల సమీకృత అభివృద్ధి..
కుత్బుల్లాపూర్, పెన్ పవర్
హైదరాబాద్ నగరానికి అనుసంధానమై దినదినాభివృద్ధి చెందుతున్న రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమీకృతాభివృద్ధి, సమస్యల శాశ్వత పరిష్కారం కోసం సీఎస్ సోమేశ్ కుమార్ అధ్యక్షతన నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం దిశగా అనుసరించాల్సిన కార్యాచరణపై ప్రజా ప్రతినిధులు, అన్ని శాఖల ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం కొంపల్లిలోని జీబీఆర్ గార్డెన్ లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ మరియు జోనల్ కమిషనర్ మమత సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలు, జిహెచ్ఎంసి ప్రాంతాల్లో రోడ్లు, విద్యుత్తు, తాగునీరు, పరిశుభ్రత వంటి మౌలిక వసతులను అభివృద్ధి పరచడం, సీవరేజీ డ్రైనేజీ, నాలాల మరమ్మత్తు, వరదనీరు, ముంపు, ట్రాఫిక్ వంటి సమస్యల శాశ్వత పరిష్కారం కోసం కావలసిన ప్రతిపాదనలు రూపొందించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో 2050 వరకు జనాభా పెరుగుదల, అవసరాలు అంచనా వేస్తూ, సమస్యల శాశ్వత పరిష్కారం, మౌలిక వసతుల సమగ్రాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఎంతో దూరదృష్టితో ఏకీకృత విధానాన్ని అమలు పరుస్తున్నారని ఇందుకోసం కుత్బుల్లాపూర్ నియోజకవర్గ సమస్యలపై స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అవసరమున్న చోట ప్రజలకు విద్య, వైద్యం వంటి అన్నిరకాల సౌకర్యాలను మరింతగా అందుబాటులోకి తెచ్చేందుకు నివేదికను రూపొందించాలన్నారు. నగర శివారు ప్రాంతాలు అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ 3 వేల కోట్లు కేటాయించడం హర్షదాయకం అని, ఈ నిధుల ద్వారా ప్రజా సమస్యలు శాశ్వతంగా పరిష్కారం కానున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్, చైర్మన్లు, కార్పొరేటర్లు మరియు అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment