బాబు జగ్జీవన్ 114వ జయంతికి ఘన నివాళులు.. మందా వెంకటేశ్వర్లు..
సత్తుపల్లి, పెన్ పవర్
ఒకదశ స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే, మరోవైపు సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం, అలుపెరగని సమరం సాగించిన రాజ కీయ, సామాజిక విప్లవ యోధుడు బాబూ జగ్జీవన్ రామ్ అని తెలంగాణ రాష్ట్ర దళిత హక్కుల పోరాట సమితి డిహెచ్ పిఎస్ రాష్ట్ర కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు కొనియాడారు.. బాబు జగ్జీవన్ రామ్ 113వ జయంతి సందర్భంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి లో జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం మందా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జగ్జీవన్ బిహార్‌లోని షాబాద్ జిల్లా చాంద్వా గ్రామంలో 1908 ఏప్రిల్ 5న శోభిరామ్, బసంతి దేవిలకు జన్మించారు. ఆయన చదువుకున్న పాఠశాలలోనే మొదటిసారిగా అంటరాని తనాన్ని అనుభవించారని పాఠశాలలో విద్యార్థుల కోసం మంచినీటి సదుపాయాన్ని కల్పిస్తూ రెండు కడవలపై ‘హిందూ పానీ’, ‘ముస్లిం పానీ’ అని రాసి ఉంచేవారని అయితే జగ్జీవన్ రామ్ హిందూ పానీలో మంచినీరు తాగారని హిందూ విద్యార్థులు ఆ కుండలోని నీరు త్రాగేవారు కాదని తెలిపారు. ఈ ఉదంతంతో ఆగ్రహించిన బాబు ఒక రాయి విసిరి ఆ కుండను ముక్కముక్కలు చేశారు. అప్పుడు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ‘హరిజన పానీ’ అనే మరో కుండను ఏర్పాటుచేశారు. జగ్జీవన్ రామ్ ఆ కుండని కూడా పగులకొట్టాడు. ఇక చేసేదేమీలేక ఆ పాఠశాల వారు ఒకే కుండను ఏర్పాటుచేశారు. ఈ సంఘటనలో జగ్జీవన్ రామ్ గెలిచినా ఆయన గుండె ఆవేదనతోనూ, కోపంతోనూ నిండిందని ఆ అనుభవాలే ఆయన దళిత జనుల జాగృతి వైపు ముందుకు సాగడానికి ప్రేరణనిచ్చాయని అన్నారు. జగ్జీవన్ రామ్ జీవిత కాలంలో ఎన్నో అవమానాలు, ఆటంకాలు ఎదుర్కొని సమాజాన్ని ప్రభావితం చేయగలిగారు. అంతటి కష్టకాలంలో కేవలం 27 ఏళ్ల వయస్సులోనే శాసన మండలి సభ్యునిగా ఎన్నిక కావడం ఆయనకే చెల్లిందన్నారు. 52 ఏళ్లపాటు పార్లమెంటును ఏలిన మహా అనుభవ శీలి. వ్యవసాయ, రక్షణ, ఆరోగ్య, రైల్వేశాఖ మంత్రిగా, ఉప ప్రధానిగా ఆయన సేవలు అనిర్వచనీయం. విద్యార్థి దశలోనే గాంధీజీ అహింసా మార్గానికి ఆకర్షితుడు అయి 1930లో సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ పోలీసులను ఎదిరించి లాఠీ దెబ్బలకు బెదరకుండా నిలబడ్డా నాటి స్వాతంత్య్ర సమరయోధుడు జగ్జీవన్ రామ్ అని తెలియజేశారు. వివక్షను ఎదుర్కొంటూ ఉపప్రధాని స్థాయికి రావడం జగ్జీవన్‌రామ్ అకుంఠిత దీక్ష, పట్టుదల, క్రమశిక్షణ అని చెప్పడంలో అతిశయోక్తి లేదని ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేసిన ఆయన 1986 జూలై 6న పరమపదించారని. దళితుల హక్కులను రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిస్తే వాటిని చట్ట రూపంలో అమలుచేయడానికి జగ్జీవన్‌రామ్ చేసిన కృషి ఎప్పటికీ మరిచిపోలేనిదని అవమానాలు, ఆటంకాలను విజయాలుగా మలుచుకున్ననిజమైన దేశ నాయకుడు జగ్జీవన్ రామ్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి డిహెచ్ పిఎస్ డివిజన్ కార్యదర్శి తడికమళ్ళ యోబు, కొత్తపల్లి కుమార్, జీవన్, గిరి, శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment