క్వారంటైన్ కేంద్రాలు తెరవండి ప్లీజ్..!!
ఊహించని స్థాయిలో కోవిడ్ ఉధృతి..
రోజుకి 500 పైగా పాజిటివ్ కేసులు నమోదు..
జిల్లాలో అరకొరగా కోవిడ్ వైద్య సేవలు..
పక్క జిల్లాలకు పరుగెడుతున్నా..
కాపాడుకోలేని ప్రాణాలు..
హోమ్ క్వారంటైన్ వల్ల విషమిస్తున్న పరిస్థితులు..
ఇంట్లో ఒకరి వల్ల మిగిలిన వారికి..ఆపై బయట వారికి సోకుతున్న వైరస్..
పెన్ పవర్ బ్యూరో, విజయనగరం
కోవిడ్-19 మొదటి వేవ్ లో వైరస్ వ్యాప్తి ఎక్కువ లేకుండా, సకాలంలో నియంత్రణ చేయడానికి క్వారంటైన్ కేంద్రాలు ఎంతగానో దోహద పడ్డాయి. అక్కడక్కడా అరకొర సమస్యలు తలెత్తినా, ఈ కేంద్రాల్లో కోవిడ్ పాజిటివ్ బాధితులకి ఆహారం, వసతి, వైద్య చికిత్స కల్పించడం ద్వారా సత్పలితాన్నే చవిచూసాం. అయితే ప్రస్తుత కోవిడ్ సెకెండ్ వేవ్ తీవ్రత గత ఏడాది కన్నా పది రెట్లు అధికంగా కనిపిస్తోంది. గత ఏడాది తొలిలో రోజుకి యాబై కేసులు నమోదైతే ఇప్పుడు వాటి సంఖ్య రోజుకి 500 పైగా ఉంది. ఒకరికి వైరస్ సోకి, వారు సాధారణ వ్యాధి లక్షణాలతో హోమ్ క్వారంటైన్ లో ఉంటున్నప్పటికీ, వారి ద్వారా ఇంటిలోని మిగిలిన వారికి వైరస్ సోకుతుంది. ఇంట్లో నుంచి బయటకు వచ్చే వారి వల్ల ఇతరులకి వైరస్ సోకి పాజిటివ్ కేసుల సంఖ్య తారాస్థాయికి చేరుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మళ్లీ ఆయా పట్టణ, నగర ప్రాంతాల్లో ప్రత్యేక క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సాధారణ కోవిడ్ పాజిటివ్ బాధితులు ఇళ్లల్లో ఉండడానికి తగిన సదుపాయాలు లేక, వైద్య సూచనలు, సలహాలు అందక, తమ వల్ల మిగిలిన కుటుంబ సభ్యుల కూడా వ్యాధి బారిన పడతారేమోనన్న ఆందోళనతో ఉన్నారు. ఈ గందరగోళ పరిస్థితుల్లో వారంతా హాస్పిటల్స్ చుట్టు పరుగులు పెడుతున్నారు. దీనివల్ల ఒకరి నుంచి మరికొందరికి వ్యాప్తి చెంది వైరస్ ఉధృతి రోజు రోజుకి జిల్లాలో పెరిగిపోతోంది. ప్రతి రోజూ కొన్ని పదుల సంఖ్యలో పాజిటివ్ బాధితులు పక్క జిల్లా విశాఖకి పరుగులు తీస్తున్నారు. ఈ జిల్లాలో ప్రస్తుతం కోవిడ్ కే కాదు సాధారణ వ్యాధులకి కూడా వైద్యం మృగ్యం అని ఎప్పటి నుంచో ఉన్న మాటే. దీంతో కోవిడ్ వలనే కాకుండా, సాధారణ అనారోగ్య సమస్యలు వల్ల, ఎక్కడికి పోవాలో తెలియని దుస్థితిలో పేద, మధ్య తరగతి ప్రజలు అనేక మంది మృత్యువాత పడుతున్నారు. ఇక కోవిడ్ బారిన పడి పరిస్థితి విషమిస్తే ఊపిరి ఆడక ప్రాణం పోవాల్సిందే తప్ప వారిని ఆదుకుని, సరైన చికిత్స అందించే పరిస్థితి జిల్లాలో అస్సలు లేనే లేదు. ఇక్కడ పని చేస్తున్న కోవిడ్ హాస్పిటల్స్ లో బెడ్ ల కొరత అధికంగా ఉంది. దీంతో ఏమీ చేయలేమని ప్రభుత్వ వైద్యులు కూడా చేతులెత్తేస్తున్నారు. విశాఖ పోయి కార్పొరేట్ హాస్పిటల్స్ లో చేరి లక్షలు ఖర్చు పెడుతున్న వారికే ప్రాణాలు నిలువని దుస్థితి ఉంది. ఇక ప్రస్తుత తరుణంలో, పేద, మధ్యతరగతి వారికి కోవిడ్ చికిత్స సకాలంలో అంది, వారి ప్రాణాలు నిలబడతాయి అనుకుంటే అది అవివేకమే అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో వైరస్ వ్యాప్తి ఇంకా ఎక్కువ కాకుండా ఉండాలంటే, క్వారంటైన్ కేంద్రాలు అందుకు ప్రత్యామ్నాయ మార్గాలుగా కనిపిస్తున్నాయి. వాటిని ఏర్పాటు చేయాలని బాధితులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
మొదటి వేవ్ లో కేవలం వలస దారులను దృష్టిలో ఉంచుకొని, వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి కోవిడ్ పాజిటివ్ బాధితులు అందరినీ యుద్ధ ప్రాతిపదికన ఈ క్వారంటైన్ కేంద్రాలకి తరలించారు. అక్కడ ప్రత్యేకంగా పాజిటివ్ రోగులకు మంచి పోషకాహారం, మందులు వంటి సదుపాయాలు కల్పించి వైరస్ వ్యాప్తిని అరి కట్టడమే కాకుండా, ఎక్కువ కోవిడ్ మరణాలు సంభవించకుండా నియంత్రించ గలిగారు. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే నాడు ప్రత్యేక క్వారంటైన్ కేంద్రాలే ఎక్కువ ప్రాణ నష్టం జరగకుండా ప్రజల్ని కాపాడాయి. ఐతే ఇప్పుడు ఈ కోవిడ్ సెకండ్ వేవ్ లో రోజుకి ఐదు వందలకు పైగా పాజిటివ్ కేస్ లు నమోదయ్యే దుస్థితిని చూస్తున్నాం. ఇందుకు ప్రజల నిర్లక్ష్య ధోరణి కూడా ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. కానీ వారి చావు వాళ్ళు చస్తారని యంత్రాంగం ఏమీ చేయకుండా నిర్లిప్త ధోరణిలో ఉంటే మాత్రం ఇంకా ఎక్కువ ప్రాణ నష్టాన్ని చవి చూడక తప్పదు. అలాగని క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు, వాటి నిర్వహణ కూడా అంత ఆషామాసీ కాదు. రోజుకి వందల సంఖ్యలో నమోదవుతున్న పాజిటివ్ కేస్ లను బట్టి చూస్తే, క్వారంటైన్ కేంద్రాల ఏర్పాటు యంత్రాంగానికి పెద్ద సవాలే కాకుండా అధిక ఆర్ధిక ప్రయాస కూడా. అందుకే ఇటు అధికారులు గానీ, అటు ప్రభుత్వం గానీ ఆ ఊసుకే పోవడం లేదనిపిస్తోంది. కానీ ప్రస్తుత వైరస్ వ్యాప్తిని, పెరుగుతున్న పాజిటివ్ కేస్ లను, వైద్యం అందక సంభవిస్తున్న మరణాలను దృష్టిలో ఉంచుకొని మరోసారి అటువంటి ప్రత్యేక క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉందనిపిస్తోంది.
ఇంకో వైపు ప్రభుత్వం ప్రకటించిన కోవిడ్ ప్రత్యేక హాస్పిటల్స్ లో ఇంకా పూర్తి స్థాయిలో వైద్య సేవలు మొదలు కాని దుస్థితి కూడా ఉంది. నేడో రేపో వైద్య సేవలు మొదలైనా, పాజిటివ్ కేసులు, అందులోనూ సీరియస్ కేసులకు తగ్గ బెడ్ లు , వైద్య సదుపాయాలు కూడా ఆయా ఆసుపత్రుల్లో సరిపడా లేవన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆయా హాస్పిటల్స్ వద్ద కోవిడ్ పాజిటివ్ బాధితుల రద్దీని తగ్గించి, వైరస్ వ్యాప్తిని నియంత్రించాలంటే క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే మంచిదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది. అలాగని ఇందుకోసం ఎక్కువ ప్రజాధనం దుర్వినియోగం చేయనవసరమూ లేదు. ప్రత్యేకించి భవనాలు అద్దెకి తీసుకోవాల్సిన పరిస్థితి లేకుండా, ఆయా మండల కేంద్రాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు( హాస్టల్స్)ని క్వారంటైన్ కేంద్రాలుగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక మండల పరిధిలో ఉన్న మొత్తం వైద్య సిబ్బందిని ఆ కేంద్రాల్లో విధులకు వినియోగించుకోవచ్చు. సకాలంలో టెస్ట్ లు, ఫలితాలు, చికిత్స ను అందించనూ వచ్చు. సంక్షేమ హాస్టళ్ల నిధుల ద్వారా కోవిడ్ క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్న వారికి ఆహారం అందిస్తూ, ఆ బాధ్యతల్ని సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించవచ్చు. దీంతో ఆయా మండల పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి కోవిడ్ పాజిటివ్ సాధారణ బాధితులని ఆ కేంద్రాలకు చేర్చడం ద్వారా క్షేత్ర స్థాయిలో వైరస్ ఉధృతిని నియంత్రణ లోకి తీసుకు రావడానికి కూడా ఆస్కారం వుంటుంది. ప్రభుత్వం ప్రజా భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రస్తుత తరుణంలో ఉచితంగా కోవిడ్ పరీక్షలు, వైద్య సేవలు, మందులు, వ్యాక్సినేషన్ అందించడం ప్రజల అదృష్టంగా చెప్పుకోవచ్చు. అయితే కేసులుకి తగ్గట్టుగా హాస్పిటల్స్ అందుబాటులో లేనందున సాధారణ కోవిడ్ బాధితులు ఈ సేవలను అందుకునేలా ప్రత్యేక వసతి కేంద్రాలు ఏర్పాటు చేయడమే ప్రత్యామ్నాయ మార్గంగా కనిపిస్తోంది. పైగా ప్రభుత్వం 104 కాల్ సెంటర్ ద్వారా కోవిడ్ సేవలు అని ఇటీవల విస్తృతంగా ప్రకటించినా, ప్రస్తుత వైరస్ ఉధృతి వల్ల అది సక్రమంగా అమలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయం, ఆయా శాఖల్లో ఉన్న నిధులతో క్వారంటైన్ కేంద్రాలని ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తే పరిస్థితి అదుపులోకి రావచ్చన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. అధికారులు ఈ సాధ్యాసాధ్యాలని పరిశీలించి, ప్రభుత్వానికి నివేదించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
No comments:
Post a Comment