పరాయి పంచలో గ్రామ సచివాలయాలు
మధ్యలో నిలిచిపోయిన గ్రామ సచివాలయాలు.
మెంటాడ, పెన్ పవర్:
ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన గ్రామ సచివాలయ వ్యవస్థను అధికారులు నీరు కారుస్తున్నారని మండలంలోని పలువురు ప్రజా ప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, ముఖ్యంగా మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. మెంటాడ మండలంలో 19 గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశారు. ఇందులో ఇప్పటికీ జక్కువ, పిట్టా డ, మెంటాడ, ఆండ్ర, బడే వలస, పోరం, లోతుగడ్డ, పెదమేడపల్లి తదితర గ్రామ సచివాలయాలు నిర్మాణాలు నేటికి పూర్తి కాకపోవడంతో గ్రామ సచివాలయాలు పరాయి పంచన నిర్వహిస్తున్నారు. పరాయి పంచన ఉన్న గ్రామ సచివాలయంలో సరైన సౌకర్యాలు లేక గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయాలు సిబ్బంది ఇరుకు గదుల్లో తమ విధులు నిర్వహిస్తున్నారు. భవనాలు నిర్మాణాలు చేపట్టినప్పటికీ పనికి తగిన విధంగా బిల్లులు కావడం లేదని కాంట్రాక్టర్లు బహిరంగంగా చెబుతున్నారు. చాలా వరకు సచివాలయాల నిర్మాణాలు చేపట్టిన పంచాయతీ రాజ్ శాఖ అధికారులు పనికి తగిన బిల్లులు మంజూరు చేయడం లేదని, ఈ కారణంగానే గ్రామ సచివాలయాలు నిర్మాణాలు మధ్యలో నిలిపివేసినట్లు వారు ఆరోపిస్తున్నారు. పంచాయతీరాజ్ అధికారులు చేసిన పనికి సక్రమంగా బిల్లులు మంజూరు చేయడం లేదని కాంట్రాక్టర్లు స్థానిక శాసనసభ్యులు పీడిక రాజన్నదొర దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. అందుకు ఎమ్మెల్యే రాజన్నదొర సంబంధిత అధికారులకు గట్టి వార్నింగ్ ఇచ్చిన ఆ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని కాంట్రాక్టర్లు బహిరంగంగా చెబుతున్నారు. గ్రామ సచివాలయాలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో సక్రమంగా పని చేయలేక పోతున్నామని సచివాలయ సిబ్బంది వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు పూర్తిస్థాయిలో స్పందించి సచివాలయాల నిర్మాణాలు పూర్తిచేసే విధంగా పంచాయతీరాజ్ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై పంచాయతీ రాజ్ అధికారులను వివరణ కోరడానికి ప్రయత్నించగా వారు అందుబాటులో లేరు.
No comments:
Post a Comment