మురుగు సమస్యకు ముగింపు ఎప్పుడు....?
పలుకూరు లో అధ్వానంగా మురుగు కాలువలు
దుర్వాసన, దోమల ఆవాస కేంద్రాలుగా మురుగు కాల్వలు
ప్రభుత్వాలు మారినా పలుకూరు మురుగు కాలువల రాత మారలేదని పలుకూరు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుకూరు లోని ప్రధాన రహదారి వెంట కాలువలు నిర్మించగా ఎక్కడ మురుగునీరు అక్కడే నిల్వ ఉండి దుర్వాసనతో పాటు దోమలకు కేంద్రాలుగా తయారయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజారోగ్య భద్రతకు మురుగు కాలువ వ్యవస్థ సక్రమ నిర్వహణ కీలకం. మురుగు కాలువల నిర్మాణం బాగుంటే దుర్వాసన, దోమలు సమస్య ఉండదు. దీంతో వ్యాధులు ప్రబలవు. ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఇదే ప్రధాన సమస్యగా మారింది. ప్రభుత్వాలు ఎన్ని మారిన మురుగుసమస్య మాత్రం గ్రామాలను వీడడం లేదు. సమగ్ర కాలువల వ్యవస్థ లేకపోవడమే దీనికి కారణం. ప్లాస్టిక్ వినియోగం మరో ఇబ్బందికర పరిణామం. ఎటుచూసినా పేరుకున్న మురుగుతో దుర్వాసన, దోమల విజృంభన వల్ల పల్లె ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. పంచాయతీ కార్యదర్శులు పట్టించుకోకపోవడంతో పూడిక తొలగదు, మురుగు కదలదు అన్న చందంగా గ్రామంలోని అన్ని వీధులలో ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మరుగు తొలగించి కాలువలు నిర్మించాలని వారు కోరుతున్నారు. సర్పంచ్ వీరమల్లి శ్రీను ను కాలువలపై వివరణ కోరగా ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి సహాయ సహకారాలతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని, నూతన కాలువలు నిర్మిస్తామని దశలవారీగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని వివరించారు.
No comments:
Post a Comment