కొత్తపేట ఏరియా ఆసుపత్రిలో వేక్సిన్ గందరగోళం..
తహశీల్దార్, ఆసుపత్రి సూపరింటెండెంట్ల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం
రికమండేషన్లతో వేక్సిన్లు వేస్తున్నారని ప్రజల ఆరోపణ
పెన్ పవర్, కొత్తపేట/ రావులపాలెం
కరోనా ఉధృతి పెరగడంతో ప్రజలు వేక్సిన్ కోసం ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద క్యూలు కడుతున్నారు. అయితే సరఫరా చేస్తున్న డోసులకు వస్తున్న జనానికి పొంతన లేక ఆసుపత్రిల వద్ద ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఏరియా ఆసుపత్రిలో సోమవారం నిర్వహించిన కోవిడ్ వేక్సినేషన్ ప్రక్రియ గందరగోళంగా మారింది. ఈ నేపథ్యంలో తహశీల్దార్ జి.డి.కిషోర్ బాబు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మధుకర్ ల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరగడం అధికారుల మధ్య సమన్వయ లోపానికి అద్దం పడుతుంది. సోమవారం ఈ ఆసుపత్రి వద్ద సెకెండ్ డోస్ వేక్సిన్ వేసేందుకు ఏర్పాట్లు చేసారు. 200 డోసులు సిద్ధం చేశారు. అయితే రెండవ డోస్ కోసం తక్కువ మంది రావడంతో మొదటి డోస్ కోసం వచ్చిన వారికి వేక్సిన్ వేయడం ప్రారంభించారు.
ఈ నేపథ్యంలో డోసులు అయిపోయే సమయానికి జనం పెరగడంతో ఎగబడ్డారు. దీంతో గందరగోళం నెలకొంది. ఈ సమయంలో తహశీల్దార్ అక్కడికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలో రికమెండేషన్ ఉన్న వాళ్ళకి వేక్సిన్ ముందు వేస్తున్నారని కొందరు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వ్యాక్సిన్ ఉన్నా గానీ అయిపోయింది అని పంపేస్తున్నారని ఆరోపించారు. దీంతో తహసీల్దార్ వైద్య సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో అక్కడికి చేరుకున్న సూపరింటెండెంట్, తహశీల్దార్ ల మధ్య వాగ్వాదం జరిగింది. ఏరియా ఆసుపత్రులు వాక్సినేషన్ కి అనువుగా ఉండవని, వ్యాక్సిన్ వేయడం తమ వల్ల కావడం లేదని, పోలీసులు, రెవెన్యూ అధికారులు సహకరించడం లేదని అన్నారు. వీరి వాగ్వాదంతో సుమారు గంటకు పైగా వాక్సినేషన్ నిలిచిపోయింది. అనంతరం మిగిలి ఉన్న వేక్సిన్ డోసులు వేసారు.
No comments:
Post a Comment