Followers

వీరుడా...నీకు వందనం...

 వీరుడా...నీకు వందనం...

మావోల ఘాతుకానికి..

నేల కొరిగిన వీరుడు..

విజయనగరం ధీరుడు..

సహచరులను రక్షించబోయి..

బుల్లెట్ వర్షానికి బలైన త్యాగ ధనుడు..

సీఆర్పీఎఫ్ కోబ్రా జవాన్ రౌతు జగదీష్ పోరాటం నిరూపమానం..

వీర జవాన్ మృతి పట్ల కన్నీరు పెట్టిన గాజుల రేగ..

దేశ భక్తిని తట్టి లేపే అశ్రునయనాలతో అంత్యక్రియలు..


విజయనగరం, పెన్ పవర్ 

 "వీరుడా నీకు వందనం..భరత మాత ముద్దు బిడ్డా  నీకు చేతులెత్తి చేస్తున్నాం అభివందనం. సాయుధులైన శత్రువులు నీ ఎదురుగ ఉన్నా వెన్ను చూపని నీ ధైర్య సాహాసాలకి..ప్రాణ త్యాగానికి యావత్ జాతి అర్పిస్తోంది ఘన నీరాజనం. గుళ్ల వర్షానికి నీ దేహం ఛిద్రమై రక్తమోడుతుంటే..ఆ రుధిరాభిషేకంలో అరుణ రూప దారియైన భరతమాత నిన్ను తన కౌగిట పట్టుకొని రోధిస్తుంటే ఆ విషాద క్షణాలను తలచుకున్న నీ మాతృమూర్తి హృదయం ఎంతగా రోదించిందో మరి. నీ పార్థివ దేహాన్ని చూసి నీ స్నేహితులు, సన్నిహితులు ఎంతగా తల్లడిల్లారో మరి. నిరుపమానమైన నీ దేశ భక్తి, ధైర్య సాహాసాలు, త్యాగనిరత ముందు మా ఈ కన్నీటి రోదన, వేదన, ఆవేదన ఏపాటివి. దేశ భక్తికి చిరునామాగా, ధైర్య సాహాసాలకి కొలమానంగా, త్యాగ నిరతకి నిరుపమానంగా..దేశం కోసం ప్రాణాలర్పించిన నీ మరణం మాకొక స్ఫూర్తి స్తూపం. వినీలాకాశంలో తారవై ధ్రువ తారవై ప్రకాశిస్తూ  అందుకో మా అశ్రునయనాల నివాళుల ముఖులిత నీరాజనం.." 

ఇవీ ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో జరిగిన మావో దుశ్చర్య వల్ల ప్రాణాలు కోల్పోయిన విజయనగరం గాజుల రేగకి చెందిన వీర జవాన్ రౌతు జగదీష్ పార్దీవ దేహానికి ప్రజలు అర్పించిన ఆశ్రు నీరాజనాలు. ఘన నివాళులు. రౌతు జగదీష్ దేశమంటే భక్తి  దానికి తోడు కండలు తిరిగిన శరీరం, చురుకుగా కదిలే నైజం  ఆ లక్షణాలు అతడ్ని కోబ్రాదళానికి నాయకుడిగా ఎంపికయ్యేలా చేశాయి. విధుల్లో చేరినప్పటి నుంచి కోబ్రాదళం తరపున ఎన్నో కీలక ఆపరేషన్ ల్లో పాల్గొన్నాడు.. మావోయిస్టుల గుండెల్లో ధడ పుట్టించాడు. కానీ అతడి ధైర్య, సాహసాలు చూసిన విధికి కన్నుకుట్టినట్టు ఉంది. త్వరలో జీవితభాగస్వామితో పాటు ఏడు అడుగులు నడిచేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో విధి కన్నెర్ర చేసాంది. పెళ్లి వయసు వచ్చిన సమయంలో.. ఆ ముచ్చట తీరకుండానే మావోయిస్టుల రాపంలో మృత్యువై కాటేసింది. కుటుంబ సభ్యులకు దుఃఖాన్ని మిగిల్చింది. జవాన్‌ మృతితో విజయనగరం జిల్లా కేంద్రంలోని గాజులరేగ, మక్కువ మండలం కంచేడువలసలో పెను విషాదం అలముకుంది. చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపుర్‌లో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో  విజయనగరం జిల్లాకు చెందిన యువకుడు, సీఆర్పీఎఫ్‌ జవాన్‌ 27 ఏళ్ల రౌతు జగదీష్‌ వీరమరణం పొందాడు. జిల్లా పోలీస్‌లు తెలిపిన వివరాల ప్రకారం.. జగదీష్‌ది మక్కువ మండలం కంచేడువలస గ్రామం. ప్రస్తుతం రౌతు జగదీష్ కుటుంబం విజయనగరం జిల్లా కేంద్రంలోని గాజులరేగలో నివసిస్తోంది. డిగ్రీ వరకు చదువుకున్న జగదీష్‌ 2014లో సీఆర్పీఎఫ్‌ జవాన్‌గా ఎంపికయ్యాడు. విధుల్లో చురుగ్గా మెలగడంతో కోబ్రాదళానికి లీడర్‌గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం అస్సాం క్యాంపులో పని చేస్తున్నాడు. శనివారం బీజాపూర్‌ జిల్లా అటవీ ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్, కోబ్రా, డీఆర్‌జీ భద్రతా దళాలతో కలిసి కూంబింగ్‌ చేస్తున్న సమయంలో మావోయిస్టుల ఎదురు కాల్పుల్లో మృతిచెందాడు. విధుల్లో చేరిన కొద్దికాలంలోనే మంచిపేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. 

మృతుడి తండ్రి సంహాచలం కూలీకాగా, తల్లి రమణమ్మ గృహిణి. కాగా ఈ మధ్యనే అక్క సరస్వతికి వివాహమైనట్టు తెలుస్తోంది. అయితే జగదీష్ కు వచ్చే నెల 22న పెళ్లి నిశ్చమైంది. ఆ పెళ్లికోసం మరో వారం రోజుల్లో సెలవుపై రావాలి అనుకున్నాడు. దీంతో జగదీష్ కుటుంబ సభ్యులంతా పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. ఎంతో ఆనందంగా ఉన్న సమమంలో పిడుగులాంటి వార్త ఆ ఇంటిని శోకసంద్రంలోకి నెట్టేసింది. కొండంత ఎదిగిన కొడుకు.. పేరు ప్రఖ్యాతలు సాధించాడనుకున్న బిడ్డ మృతి చెందాడన్న వార్తతో కుటుంబం దుఃఖ సాగరంలో మునిగిపోయింది.  చేతికి అందుకొచ్చాడు ఇంటి బరువు బాద్యతలు చూసుకుంటాడనుకున్న సమయంలో ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులిద్దరూ కన్నీరుమున్నీరవుతున్నారు. జగదీష్‌ మృతితో గాజులరేగ, అటు స్వస్థలం కంచేడువలస వాసులు శోకసంద్రంలో మునిగిపోయారు. గాజులరేగలో బ్లాక్‌ డే పాటించారు. పెళ్లి పల్లకీ ఎక్కుతాడనుకున్న ఆ జవాను మావోయిస్టుల ఎదురుకాల్పుల్లో వీర మరణం పొందాడు. విషయం తెలిసిన మరుక్షణమే తల్లిదండ్రులు కుప్పకూలారు. ఈ ఘటనతో గాజులరేగలోని జగదీష్‌ ఇంటివద్ద తీవ్ర విషాద చాయలు అలముకున్నాయి. మరోవైపు జగదీష్ స్నేహితులు సైతం తీవ్ర దు:ఖంలో ఉన్నారు. వీర మరణం పొందిన స్నేహితుడికి శ్రద్ధాంజలి ఘటిస్తూ బ్లాక్ డే నిర్వహించారు. జగదీష్ అమర్ రహే.. అంటూ విజయనగరం పట్టణంలోని గాజుల రేగలో భారీ ర్యాలీ చేపట్టారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...