ఎం.పి.టి.సి,జెడ్.పి.టి.సి.ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి
విశాఖపట్నం,పెన్ పవర్
రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమ, నిబంధనల మేరకు ఎం.పి.టి.సి, జెడ్.పి.టి.సి ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అథారిటీ వి.వినయ్ చంద్ తెలిపారు.శనివారం నాడు స్థానిక వి.యం.ఆర్.డి.ఎ.చిల్డ్రన్స్ ఎరినాలో ఎం.పి.టి.సి, జెడ్.పి.టి.సి ఎన్నికల నిర్వహణపై ఎం.పి.డి.ఒ.లు తాహసీల్దార్లు, మండల ప్రత్యేకాధికారులు, నియోజకవర్గ ప్రత్యేకాధికారులు, రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు, జోనల్ అధికారులు, మాస్టర్ ట్రైనర్లతో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటినుంచి ప్రతి క్షణం అప్రమత్తంగా వుండి అధికారులు తమతమ బాధ్యతల పట్ల అవగాహన పెంచుకొని, నియమ నిబంధనలు అధ్యయనం చేసి, సమర్థవంతంగా విధులు నిర్వహించాలన్నారు. ఎం.పి.డి.ఒ.లు తాహసీల్దార్లు, మండల ప్రత్యేకాధికారులు, రిటర్నింగ్ అధికారులు ఒక బృందంగా సమన్వయం చేసుకొని ఎటువంటి పొరపాట్లు జరగకుండా శ్రద్థ వహించాలన్నారు. నియోజక వర్గ ప్రత్యేకాధికారులు క్షేత్రస్థాయిలో తలెత్తే ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు.బ్యాలెట్ పేపర్లను ట్రెజరీ నుంచి తీసుకొని మండల కేంద్రంలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేసుకొని 7వతేదీ వరకు భద్రపరచాలన్నారు. బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులు, స్టేషనరీ మొదలైన అన్ని మెటీరియల్ ను పోలింగ్ నిర్వహణాధికారులకు పోలింగ్ స్టేషన్ ల వారీగా అందజేయాలని తెలిపారు. కోవిడ్ జాగ్రత్తలను తప్పని సరిగా పాటించాలని తెలిపారు. మండల కేంద్రంలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఎం.పి.టి.సి, సెగ్మెంట్ వారీగా కౌంటర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. జోనల్ అధికారులు తమ పరిధిలోని పోలింగ్ స్టేషన్లను కనీసం 2 సార్లు పరిశీలించి కనీస మౌలిక సదుపాయాలు వుండేలా జాగ్రత్త వహించాలన్నారు. జోనల్ అధికారులు తమ పరిధిలో శాంతి భద్రతలను పరిరక్షించాలని కోరారు. పోలింగ్ విధులకు కేటాయించబడ్డ అధికారులు, సిబ్బంది ర్యాండమైజేషన్ పూరైందని వారికి కేటాయించ బడ్డ మండల కేంద్రంలో 5వ తేదీ నాడు శిక్షణ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. రిజర్వ్ సిబ్బందికి కూడా శిక్షణ ఇవ్వాలని తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ బృందాలు ఆర్.టి.సి.బస్సులలో పోలింగ్ స్టేషన్ కు చేరుకుంటారన్నారు.పోలింగ్ 8వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారని తెలిపారు. పోలింగ్ అనంతరం పోల్ మెటీరియల్ ను రిసెప్షన్ సెంటర్లో తీసుకొని స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచాలని తెలిపారు. ఒకే ప్రాంగణంలో రిసెప్షన్ సెంటర్ , స్ట్రాంగ్ రూమ్ , కౌంటింగ్ సెంటర్లు వుండేలా ఏర్పాటు చేయాలన్నారు.
తప్పని సరిగా కౌంటింగ్ సెంటర్లో ప్రతీ ఎం.పి.టి.సి. సెగ్మెంట్ కు ఒక టేబుల్ ను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. కౌంటింగ్ హాళ్లలోనూ , స్ట్రాంగ్ రూమ్ బయట తప్పనిసరిగా సి.సి.కెమెరాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఆదేశించిందని తెలిపారు. కౌంటింగ్ 10వ తేది ఉదయం 8 గంటల నుంచి ప్రారంభిస్తారని తెలిపారు.రిటర్నింగ్ అధికారులు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లపై తగిన సమాచారం ఇవ్వాలన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ను అమలు చేయాలని, ఎప్పటికప్పు డు అవసరమైన నివేదికలను జాప్యం లేకుండా పంపించాలని తెలిపారు. 6వ తేదీ సాయంత్రం 5గంటలకు ఎన్నికల ప్రచార వ్యవధి ముగుస్తుందని తెలిపారు. 4వ తేదీ లోగా ఫొటో ఓటరు స్లిప్పులు వస్తాయని 5వ తేదీ నాడు బి.ఎల్.ఒ.లతో పంపిణీ చేయించాలని తెలిపారు.జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహణాధికారి నాగార్జున సాగర్ మాట్లాడుతూ 2100 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. డి.ఆర్.డి.ఎ.పి.డి విశ్వేశ్వరరావు మాట్లాడుతూ రిసెప్షన్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్ నిర్వహణ, కౌంటింగ్ ఏర్పాట్లపై వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు ఎం.వేణు గోపాల్ రెడ్డి, పి.అరుణ్ బాబు, ఆర్. గోవిందరావు, ఐ.టి.డి.ఎ. ప్రాజెక్ట్ అధికారి ఎస్.వెంకటేశ్వర్, సబ్ కలెక్టర్ ఎన్. మౌర్య, డి.ఆర్.ఒ.ఎ.ప్రసాద్, ఆర్.డి.ఒ.లు పి.కిషోర్, సీతారామారావు, లక్ష్మీ శివజ్యోతి, డి.పి.ఒ.క్రిష్ణకుమారి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment