ఆక్రమణలే ముద్దు & అధికారులు పట్టించుకోవద్దు ?
పరవాడ , పెన్ పవర్పరవాడ మండలంలో ఆక్రమణ దారుల జోరుకు కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూముల కబ్జా లు కొనసాగుతూనే ఉన్నాయి. పెద్ద మనుషుల ముసుగు లో కొంత మంది తమ అధికారాన్ని ఉపయోగించి కోట్లాది రూపాయల విలువైన స్థలాలను యథేచ్ఛగా ఆక్రమించి అక్రమ నిర్మాణాలను చేపడుతున్నారు. రెవెన్యూ అధికారులకు సమాచారమిచ్చినా వారు ఏ మాత్రం స్పందించిన దాఖలాలు కనిపించలేదు. రెవెన్యూ అధికారుల ఉదాసీనత,పైగా ఆయా శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. ముఖ్యంగా ఏడుమెట్ల మర్రిపాలెం సర్వే నెంబర్ 3లో దాదాపు రెండు కోట్ల రూపాయల విలువ చేసే కొండ బంజరు ఆక్రమణకు గురైంది.ఓ స్థానిక నాయకుడు నకిలీ ఎల్పిసీలు సృష్టించి విక్రయించినట్లు గతంలో రెవెన్యూ అధికారులు జరిపిన దాడుల్లో బయట పడ్డాయి.ఐతే ఏమైందో ఏమో కాని తర్వాత ఎటువంటి చర్యలు తిసుకోకుండా అధికారులు నిమ్మకుండిపోయారు. దీంతో ప్రస్తుతం ఆ సర్వే నెంబర్ లో పదుల సంఖ్యలో నిర్మాణాలు వెలిసాయి.కోట్లాది రూపాయల ప్రభుత్వ భూమి అన్యాక్రాంత మవుతోంది. ఈ.బోనంగి రెవెన్యూలో కూడా నకిలీ ఎల్పీసీల తో ఒకొక్క సైట్ ఇద్దరు ముగ్గురకు అమ్మేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.ఈ బోనంగి సర్వే నెంబర్ 300 లోని గెడ్డ వాగును ఓ అధికార పార్టీ నాయకుడు ఆక్రమించు కున్నా అధికారులు పట్టించుకోలేదు.ఆర్కే లే అవుట్ సమీపంలో గెడ్డ వాగు ఆక్రమణపై అనేక పిర్యాదులు చేసినప్పటికి రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు.దీని విలువ కూడా సుమారు కోటి రూపాయల పైనే ఉంటుంది.అలాగే ఇదే అధికార పార్టీ నాయకుడు పరవాడ సర్వే నెంబర్ 119, 102,106 సర్వే నెంబర్లలోని సుమారు రెండెకరాల ప్రభుత్వ స్థలాలను ఆక్రమించు కొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.ఈ అధికార పార్టీ నాయకుడి కన్ను పడితే ఎంతటి ప్రభుత్వ భూమి అయినా కబ్జా కావాల్సిందేనని నాయకుల అనుచరులు కొందరు స్థానికుల వద్ద ప్రస్తావిస్తూ ఉంటారు. ప్రభుత్వ భూముల పక్కన ఎంతో కొంత జిరాయితీ స్థలాన్ని కొనడం పక్కనున్న గెడ్డవాగులు,ఇతర ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి అనధికార లే అవుట్లు వేయడమే ఇతని వ్యాపారం.ప్రభుత్వ భూములను కాజేసే క్రమంలో ల్యాండ్ ట్యాంపరింగ్ కూడా ఇతనికి వెన్నతో పెట్టిన విద్య అని పబ్లిక్ టాక్. అలాగే సబ్ రిజిస్ట్రార్ లను కూడా మేనేజ్ చేయడంలో ఆరితేరిన ఘనుడుగా ఇక్కడ వారంతా చెప్పు కుంటుంటారు. అంతే కాదు నకిలీ ఎల్పిసీలను అమాయకులకు అంటగట్టి సొమ్ము చేసుకోవడం లోనూ ఈయన గారికి మంచి పేరుంది.ఈ అధికార పార్టీ నాయకుడికి తమ సొంత పార్టీ ముఖ్యనేతలతో పాటు రెవెన్యూ అండదండలు పుష్కళంగా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించడమే కాకుండా అనధికార లే అవుట్లు వేసి పంచాయతీ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నాడు.ఇంత జరుగుతున్నా ఆక్రమణలపై అటు రెవెన్యూ అధికారులు గానీ,అక్రమ లేఅవుట్ లపై ఇటు పంచాయతీ అధికారులు కానీ పట్టించుకోపోవడం వెనుక లక్షలాది రూపాయలు చేతులు మారినట్లు అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా రెవెన్యూ, పంచాయతీ శాఖల అధికార యంత్రాంగం స్పందించి ఈ.మర్రిపాలెం,ఈ. భోనంగి,పరవాడ రెవెన్యూ ప్రాంతాల్లో జరిగే అక్రమాలపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
No comments:
Post a Comment