రాష్ట్రంలో మళ్ళీ ఉచిత బియ్యంతో పేద ప్రజలకు సీఎం అభయం
గుడివాడ, పెన్ పవర్
రాష్ట్రంలో మళ్ళీ ఉచిత బియ్యంతో పేదప్రజలకు సీఎం జగన్మోహనరెడ్డి అభయమిచ్చారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. శుక్రవారం కృష్ణాజిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నాని విలేఖర్లతో మాట్లాడారు. బియ్యం కార్డులున్న కుటుంబాల్లో ఒక్కో సభ్యుడికి 10 కిలోల చొప్పున సార్టెక్స్ స్వర్ణ రకం మధ్యస్థ సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తామన్నారు. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు మే, జూన్ నెలల్లో ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేసి పేదల ఆకలి తీర్చేందుకు దాదాపు రూ. 800 కోట్లు వెచ్చించేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు. రాష్ట్రంలో మొత్తం 1.47 కోట్ల బియ్యం కార్డులు ఉన్నాయన్నారు. వీటిలో కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా చట్టం కింద 88 లక్షల బియ్యం కార్డులను మాత్రమే గుర్తించిందన్నారు. ఒక్కో లబ్ధిదారుడికి కేంద్ర ప్రభుత్వం 5 కేజీల బియ్యాన్ని మాత్రమే ఇస్తోందన్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం గుర్తించని మరో 59 లక్షల బియ్యం కార్డుల కుటుంబాలకు కూడా ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేయాలని సీఎం జగన్మోహనరెడ్డి నిర్ణయించారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 5 కిలోలకు అదనంగా మరో 5 కిలోలు కలిపి మొత్తం 10 కిలోల బియ్యాన్ని కార్డుదారుల్లో ఒక్కో సభ్యుడికి ఉచితంగా అందించనున్నామన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గత ఏడాది మార్చి 29 వ తేదీన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ఆంక్షలను విధించాయన్నారు. ఈ ఆంక్షల కారణంగా పేదలు ఉపాధికి దూరమయ్యారన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడూ ఆకలితో ఉండకూడదన్న ఉద్దేశ్యంతో సీఎం జగన్మోహనరెడ్డి ఉచిత నిత్యావసరాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. గత ఏడాది మార్చి నుండి నవంబర్ నెల వరకు 16 విడతలుగా పౌరసరఫరాల శాఖ ద్వారా రేషన్ కార్డుదారులందరికీ ఉచితంగా నిత్యావసరాలను పంపిణీ చేశామన్నారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉందని, ఈ పరిస్థితుల్లో కూడా బియ్యం కార్డుదారులను ఆదుకునేందుకు సీఎం జగన్మోహనరెడ్డి రెండు నెలల పాటు బియ్యం కార్డుదారులకు ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా పేదలకు ఉపాధి తగ్గుతోందని, మరికొందరు పని ఉన్నా బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. పేదలను మరింతగా ఆదుకునేందుకు సీఎం జగన్మోహనరెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. వచ్చే మే, జూన్ నెలల్లో జరిగే ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని బియ్యం కార్డుదారులందరూ వినియోగించుకోవాలని మంత్రి కొడాలి నాని సూచించారు.
No comments:
Post a Comment