గ్రామీణ ప్రాంతాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి
పెన్ పవర్, కందుకూరు
గ్రామీణ ప్రాంతాలలో కరోనా పై అవగాహన కార్యక్రమాలు ఎక్కువగా నిర్వహించాలని స్థానిక శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శుల తో విలేజ్ టాస్క్ ఫోర్స్ కమిటీ పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి మాట్లాడుతూ కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్ష చేయించుకొని చికిత్స పొందాలని అన్నారు. కరోనా అంటే భయపడకుండా ఉండాలని ఒత్తిడికి గురైతే అది వేగంగా విస్తరిస్తుంది అని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎవరు అవగాహన లేకపోవడంతో మాస్కులు పెట్టడం లేదని అన్నారు. అవగాహన లేమితో కూడిన విధానం అవలంభించడం వల్ల గ్రామీణ ప్రాంతాలలో కరోన మహమ్మారి తీవ్రరూపం దాలుస్తుందని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో అవగాహనతో కూడిన బాధ్యతారహితమైన ప్రవర్తనవల్ల కరోనా మహమ్మారి వస్తుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు అవగాహన కల్పించడం కష్టంతో కూడుకున్న పని అయినప్పటికీ వారికి పదేపదే అవగాహన కల్పించి ర్యాలీలు నిర్వహించాలని అన్నారు. వాలంటీర్లు 50 శాతం కూడా ర్యాలీ కార్యక్రమాలకు ముందుకు రావడం లేదని తెలిసిందని అలాంటి వారిపై ఎంపీడీవో కు ఫిర్యాదు చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఇంటింటికి తిరిగి కరోనా పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అవగాహన కల్పించడంలో అధికారులు ఎక్కడో విఫలమవుతున్నారని వాటిని సరిదిద్దుకోవాలి అని అన్నారు. మహిళా పోలీసులు ప్రజలు గుమికూడిన ప్రాంతాలలో వారిని నిషేధించాలని మాట వినకపోతే పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదు చేయాలని కోరారు. గడపగడపకు అవగాహన ర్యాలీలు నిర్వహించాలని లేనిపక్షంలో తీవ్రతను చెప్పలేకపోతే కుటుంబం చుట్టూ పరిసరాల్లో నివసిస్తున్న వారు సైతం అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. శానిటేషన్ ప్రముఖ పాత్ర వహిస్తుందని అన్నారు. సమాజం పట్ల సామాజిక స్పృహ చాలా తక్కువగా ఉందని అలా ఉంటే సమాజానికి చాలా ప్రమాదకరమని అన్నారు. రాబోయే 15 రోజులు కరోన తీవ్రత దేశంలోనూ, రాష్ట్రంలోనూ చాలా తీవ్రంగా ఉంటుందని కావున అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు.
బాధ్యతారాహిత్యంగా విచ్చలవిడిగా రోడ్లపై ప్రజలు తిరుగుతున్నారని అత్యవసర పనులు ఉంటే బయటకు రావాలని కోరారు. గ్రామాలలో 80 శాతం మంది ప్రజలు మాస్కులు లేకుండా తిరుగుతున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కు తప్పనిసరిగా ధరించాలి అని, భౌతిక దూరం పాటించాలని అన్నారు. లేనిపక్షంలో ఎలాంటి వారైనా, విధి నిర్వహణలో ఇబ్బంది పెట్టిన తీవ్రమైన కేసులు పెట్టి లోపల వేస్తామని, కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బస్సులలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రయాణికులను, విద్యార్థులను గమ్యస్థానాలకు చేరవేయాలి తప్ప ఇష్టానుసారంగా బస్సులో ఉంటే బస్సులు సీజ్ చేయడంతోపాటు యజమాన్యం వారికి భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఎంపిడిఓ విజయ్ శేఖర్ మాట్లాడుతూ కరోనా మొదటి దశలో 120 టన్నుల బ్లీచింగ్ పంపిణీ చేశారని, ప్రస్తుతం 20 టన్నుల బ్లీచింగ్, 42 టన్నుల సున్నం ను దాత సహకారంతో ఉచితంగా ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి పంపిణీ చేశారని ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలిపారు. దీంతో గ్రామాలలో సంపూర్ణంగా శానిటేషన్ చేసే అవకాశాన్ని ప్రభుత్వం తో సంబంధం లేకుండా ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి ద్వారా చేశామని అన్నారు. తహసిల్దార్ సీతారామయ్య మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఇలాంటి సమావేశాలకు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి భాగస్వామ్యం కావడం ఆయనకు ప్రజల పట్ల ఉండే నిబద్ధత అర్థమవుతుందని అన్నారు. విలేజ్ టాస్క్ ఫోర్స్ కమిటీ సమర్థవంతంగా పని చేసేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మనోహర్, డాక్టర్ స్వాతి, రూరల్ ఎస్సై కొత్తపల్లి అంకమ్మ, ఈఓఆర్డి కొండపి రఘుబాబు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment