అక్రమ కట్టడాలు , అనుమతుల ఆగడాలు
అన్ని కట్టడాలు అసైన్డ్ భూములలోనే
అనుమతుల పేరుతొ చేతివాటం చూపిస్తున్న నాయకులు, సంబంధిత అధికారులు
జోరందుకున్న అసైన్డ్ భూముల అమ్మకాల వ్యాపారం
తాండూర్, పెన్ పవర్
మంచిర్యాల జిల్లా ,తాండూర్ మండల కేంద్రంలో అసైన్డ్ భూములలో అక్రమ కట్టడాలు వెలుస్తున్నాయి. ఎన్నో రోజుల నుండి యథేచ్ఛగా జరుగుతున్న ఈ కట్టడాలకు అనుమతులు ఎవరు ఇస్తున్నారు...? ఏ నాయకుల అండతో కడుతున్నారు...? అనేది ప్రశ్నార్ధకంగా మారింది,. కొద్ది రోజుల కిందట కొనుగోలు జరిగిన అసైన్డ్ భూములలో త్వరిగతిన నిర్మాణాలు ఊపందుకున్నాయి. అసైన్డ్ భూముల్లో అమ్మకాలు జరిపీన వ్యక్తులు ముందు జాగ్రత్త చర్యగా అందులో నిర్మాణాలు చేపట్టేలా పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. దీంతో అక్కడ చకచకా నిర్మాణాలు సాగుతున్నాయి. తమ వద్ద భూమి కొనుగోలు చేసిన వారిని త్వరిగతిన ఇంటి నిర్మాణాలు చేపట్టుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు. అలాగే వీటి నిర్మాణాల అనుమతుల విషయంలో కూడా వారి పలుకుబడి ఉపయోగిస్తున్నారు. సంబంధిత అధికారుల నుండి నామామత్రపు అనుమతుల పేరుతో స్లాబు నిర్మాణాలతో పాటు రెండు అంతస్తుల భవనాల కట్టడాలను సైతం నిర్మిస్తున్నారు. ఈ విషయంలో సంబంధిత ఆధికారులకు కూడా అధిక మొత్తంలో ముడుపులు చెందుతున్నాయి అని సమాచారం. కోట్ల విలువైన అస్డైన్డ్ భూములు అన్యాక్రాంతం.. అసైన్డ్ భూములలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దు. ఎందుకంటే అది పేదలకు ప్రభుత్వం ఇచ్చిన భూమి. ఎవరికైతే ప్రభుత్వం ఈ భూములను ఇచ్చిందో వారే ఈ భూములకు హక్కుదారులుగా ఉంటారు. ఈ భూమిని ఎట్టి పరిస్థితుల్లో ఇతరులకు అమ్మడం కాని కొనడం కాని చెయ్యరాదు . అలా కొన్నా.. అమ్మినా.. ఇద్దరూ కూడా శిక్షార్హులే. కానీ ఇక్కడ మాత్రం ఈ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు యథేచ్ఛగా సాగుతున్నాయి. అయినా అటు అధికారులు కానీ, ఇటు ప్రజాప్రతినిధులు కానీ కనీసం పట్టించుకోవడం లేదు. ఈ వ్యవహారంపై పెన్‌పవర్ దృష్టి సారించి సాక్ష్యాలతో సహా కథనాలు ప్రచురించింది. దీంతో అక్రమార్కుల్లో కలవరం మొదలైంది. అధికారులు సైతం చర్యలు తీసుకునేందుకు ముందుకు సాగుతున్నారు. త్వరగా కట్టుకోండి... ఈ అక్రమ భూ దందా వ్యవహారంలో అమ్మిన వారు కొన్న వారిని త్వరగా ఇండ్లు కట్టుకోవాలని ఒత్తిడి తేవడం వెనక అధికారుల అండదండలు సైతం ఉన్నట్లు సమాచారం. ఆ స్థలాల్లో ఇండ్లు కట్టుకుంటే తామేమీ చేయలేమని అప్పుడు అక్రమ వ్యవహారం సక్రమంగా మారుతుందని వారు అక్రమార్కులకు వంత పాడుతున్నారు. ఇండ్లు కట్టుకుంటే సహజంగానే విద్యుత్ కనెక్షన్లు, నల్లా కనెక్షన్లు తీసుకుంటారు. దీంతో కోర్టుకు వెళ్లినా ఏమీ కాదనే ధీమాతో ఉన్నారు. ఇలా అడ్డగోలుగా వ్యవహారం నడుస్తున్నా, కోట్లాది రూపాయాలు చేతులు మారుతున్నా అధికారులు ఏ మాత్రం పట్టించుకోకపోవడం వెనక రహస్యం ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికైనా భూములను రి సర్వే చేపించి వారి వద్ద నుండి భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని పలువురు కోరుతున్నారు. అసైన్డ్ భూముల ముందు హెచ్చరిక సూచికలను ఏర్పాటు చేసి అక్రమార్కుల పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు . అక్రమ కట్టడాలను వెంటనే కూల్చి వేసి ఎవరైతే అసైన్డ్ భూములలో నిర్మాణానికి అనుమతులు ఇచ్చారో వారిపైన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
No comments:
Post a Comment