తిరుమల ఆంజనేయుని జన్మస్థానం అంజనాద్రిగా ఆధారాలతో నిరూపించిన టిటిడి
శ్రీరాముని జన్మస్థానం అయోధ్య, హనుమంతుడిది తిరుమల : తమిళనాడు గవర్నర్
భగవత్ సంకల్పంతోనే రామనవమి నాడు హనుమంతుని జన్మస్థానం వెల్లడి : టిటిడి ఈవో
తిరుమల, పెన్ పవర్శ్రీ ఆంజనేయ స్వామివారి జన్మస్థలం అంజనాద్రి అని పౌరాణిక, వాఙ్మయ, శాసన, భౌగోళిక ప్రమాణాలతో టిటిడి నిరూపించింది. ఈ మేరకు పండితుల కమిటీ తయారు చేసిన నివేదికను శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం తిరుమల లోని నాద నీరాజనం వేదికపై ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తమిళనాడు గవర్నర్ గౌ. శ్రీ భన్వారిలాల్ పురోహిత్ మాట్లాడుతూ శ్రీరాముని జన్మస్థానం అయోధ్య అని, ఇకపై రామ భక్తుడైన హనుమంతుని జన్మస్థానం తిరుమల అన్నారు. టిటిడి ఈ విషయాన్ని శాస్త్రబద్ధంగా నిరూపించిందన్నారు. తాను హనుమంతుడి భక్తుడినని, ఈ విషయం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. హనుమంతుని జన్మస్థలాన్ని నిర్ధారించేందుకు పండితుల కమిటీ లోతుగా పరిశీలించిందన్నారు. లోతుగా పరిశీలించి ఆధారాలు సేకరించడం ఎంత కష్టమో తమిళనాడులోని 20 విశ్వవిద్యాలయాల ఛాన్సలర్‌గా తనకు బాగా తెలుసన్నారు. నాలుగు నెలలపాటు అవిశ్రాంతంగా శ్రమించిన పండితుల కమిటీని ఈ సందర్భంగా గౌ. గవర్నర్ అభినందించారు. భగవత్ సంకల్పంతోనే రామనవమి నాడు హనుమంతుని జన్మస్థానం వెల్లడి : టిటిడి ఈవో టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి మాట్లాడుతూ భగవత్ సంకల్పంతోనే రామనవమి నాడు హనుమంతుని జన్మస్థానాన్ని తిరుమలగా నిరూపించామని తెలిపారు. పండితులతో కూడిన కమిటీ పౌరాణిక, వాఙ్మయ, శాసన, భౌగోళిక ఆధారాలను సేకరించి నిర్ధారించిందని వెల్లడించారు. ఆధారాలతో కూడిన నివేదికను ఈ రోజు మీడియాకు విడుదల చేశామని, టిటిడి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని వివరించారు. త్వరలో పుస్తక రూపంలోకి తీసుకొస్తామని తెలిపారు. కర్ణాటకలోని హంపి క్షేత్రాన్ని హనుమంతుని జన్మస్థలంగా చెబుతున్నారని, దీన్ని కూడా శాస్త్రీయంగా పరిశీలించామని, అక్కడ కిష్కింద అనే రాజ్యం ఉండొచ్చని, హనుమంతుడు అంజనాద్రి నుంచి అక్కడికి వెళ్లి సుగ్రీవునికి సహాయం చేసినట్టు భావించవచ్చని తెలియజేశారు. గుజరాత్, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో హనుమంతుడు జన్మించినట్టుగా ఎలాంటి ఆధారాలు లభించలేదని చెప్పారు. ప్రస్తుత నివేదికపై టిటిడి బోర్డులో చర్చిస్తామని, ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వంతో, దేవాదాయ శాఖ అధికారులతో చర్చించి హనుమంతుడు జన్మించిన స్థానంలో ఆలయం నిర్మించి అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులైన ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సన్నిధానం సుదర్శనశర్మ, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య మురళీధర శర్మ, ఆచార్య రాణి సదా శివమూర్తి, ఆచార్య జానమద్ది రామకృష్ణ, ఆచార్య శంకరనారాయణ, ఇస్రో శాస్త్రవేత్త శ్రీ రేమెళ్ల మూర్తి, రాష్ట్ర పురావస్తు శాఖ మాజీ డెప్యూటీ డైరెక్టర్ శ్రీ విజయ్‌కుమార్, కన్వీనర్ మరియు టిటిడి ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీషణశర్మను ఈవో అభినందించారు. 4 నెలల పాటు విస్తృతంగా పరిశోధన : టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి పండితుల కమిటీ 4 నెలల పాటు విస్తృతంగా పరిశోధించి బలమైన ఆధారాలు సేకరించిందని టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. కరోనా మహమ్మారిని అంతమొందించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ ఏడాది క్రితం యోగవాశిష్టం, సుందరకాండ పారాయణం ప్రారంభించామని చెప్పారు. సుందరకాండ పారాయణం జరుగుతుండగానే హనుమంతుని జన్మస్థానం తిరుమలగా ఆధారాలతో సహా నిరూపణ కావడం భగవంతుని కృప అన్నారు. పురాణ, వాఙ్మయ, శాసన, భౌగోళిక ఆధారాల మేరకే నిర్ధారణ : ఆచార్య మురళీధర శర్మ తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వ విద్యాలయం ఉపకులపతి ఆచార్య మురళీధర శర్మ మాట్లాడుతూ శ్రీ మద్రామాయణం లోని సుందరకాండలో, అనేక పురాణాల్లో, వేంకటాచలమాహాత్మ్యంలో, ఎన్నో కావ్యాల్లో హనుమంతుని జన్మవృత్తాంతం చాలా చక్కగా వర్ణించ బడిందన్నారు. సుందరకాండ లో తన జన్మవృత్తాంతాన్ని హనుమంతుడే స్వయంగా సీతాదేవికి తెలిపారని చెప్పారు. అంజనాదేవికి వాయుదేవుని వలన తాను జన్మించినట్లు హనుమంతుడు తెలిపారన్నారు. మతంగ మహర్షి చెప్పినవిధంగా అంజనాదేవి వేంకటాచలానికి విచ్చేయడం, అక్కడ తపస్సు చేసుకోవడం, ఆంజనేయస్వామికి జన్మనివ్వడం, తదనుగుణంగా ఆ కొండకు 'అంజనాద్రి' అని పేరు రావడం, బాలాంజనేయస్వామి సూర్యదేవుని పట్టుకోవడానికి వేంకటాద్రి నుండి లంఘించడం, శ్రీరాముని దర్శనానంతరం సీతాన్వేషణలో భాగంగా తిరిగి వేంకటగిరికి రావడం, అక్కడ అంజనాదేవిని మరల చూడడం, వానరవీరులు వైకుంఠ గుహలో ప్రవేశించడం - ఇలా అనేక విషయాలు వేంకటాచల మాహాత్మ్యం వల్ల తెలుస్తున్నాయన్నారు. వాఙ్మయ, శాసన ఆధారాల ప్రకారం వాల్మీకి రామాయణానికి తమిళ అనువాదమైన కంబ రామాయణం, శ్రీ వేదాంతదేశికులు, శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులవారు తమ రచనల్లో వేంకటాద్రిగా అంజనాద్రిగా అభివర్ణించారని చెప్పారు. స్టాటన్ అనే అధికారి క్రీ.శ. 1800 సంవత్సరంలో తిరుమల గుడి గురించిన విషయాలను సంకలనం చేసి సవాల్-ఏ-జవాబ్ అనే పుస్తకాన్ని రాశారని, ఆ పుస్తకంలో అంజనాద్రి అని పదాన్ని వివరిస్తూ అంజనాదేవికి ఆంజనేయుడు పుట్టిన చోటు కావడం వల్ల అంజనాద్రి అన్నారని రాసినట్టు తెలిపారు. వేంకటాచల మాహాత్మ్యం అనే గ్రంథం ప్రమాణమే అని చెప్పటానికి రెండు శిలాశాసనాలు తిరుమల గుడిలో దొరుకుతున్నాయని, మొదటి శాసనం 1491 జూన్ 27వ తేదీకి చెందినదని, రెండవ శాసనం 1545 మార్చ్ 6వ తేదీకి చెందినది చెప్పారు. అలాగే శ్రీరంగంలో ఉన్న ఒక శిలాశాసనం దీన్ని తెలియజేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఎస్వీబీసీ సిఈవో శ్రీ సురేష్‌కుమార్, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు ఆచార్య దక్షిణామూర్తి, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీషణ శర్మ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment