Followers

పినవేమలి హత్య కేసు మిస్టరీని ఛేదించిన రూరల్ పోలీసులు

పినవేమలి హత్య కేసు మిస్టరీని ఛేదించిన రూరల్ పోలీసులు

విజయనగరం,పెన్ పవర్

విజయనగరం రూరల్ పిఎస్ పరిధిలోని పినవేమలి గ్రామంలో ఫిబ్రవరి 17న జరిగిన హత్య కేసు మిస్టరీని విజయనగరం రూరల్ పోలీసులు ఛేదించినట్లుగా విజయనగరం జిల్లా ఎస్పీ బి. రాజకుమారి ఏప్రిల్ 7, బుధవారం నాడు జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. విజయనగరం మండలం పినవేమలి గ్రామానికి చెందిన కెంగువ రవి మరియు అదే గ్రామానికి చెందిన బాలి పైడిరాజుల మధ్య గత కొన్ని రోజులుగా విభేదాలు ఉన్నాయన్నారు. ఇరువురు ఒకే మహిళతో అక్రమ సంబంధం కలిగి ఉండడం, దీని విషయమై ఇరువురి మధ్య విభేదాలు వచ్చినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడయ్యిందన్నారు. బాలి పైడిరాజు మరియు అతని స్నేహితులందరూ కలసి ఒకసారి పార్టీ చేసుకోవడం, తరువాత కెంగువ రవి మరియు అతని స్నేహితులు మరోసారి పార్టీ జరుపుకోవడం జరిగిందని, ఈ రెండు పార్టీలకు ఇరువురు కూడా హాజరయ్యారన్నారు. కెంగువ రవిని చంపాలనే ఉద్దేశ్యంతో బాలి పైడిరాజు ఫిబ్రవరి 17 రాత్రి ఒక పథకం ప్రకారం కెంగువ రవిని పార్టీకని గ్రామ పొలిమేరల్లోకి తీసుకొని వెళ్ళి, ఇరువురు పార్టీ చేసుకున్నారు. 

తదనంతరం, మద్యం మత్తులో ఉన్న కెంగువ రవిని బాలి పైడిరాజు గొంతు నులిపి హత్య చేసాడు. తరువాత శవాన్ని మాయం చేయాలన్న ఉద్దేశ్యంతో పైడిరాజు తన స్నేహితులైన జొన్నవలసకు చెందిన గారి నారాయణరావు అలియాస్ నాని (ఎ-2), సారిక గ్రామానికి చెందిన కింతాడ ఉదయ కిరణ్ (ఎ-3) మరియు విటి అగ్రహారంకు చెందిన ఇమంది సత్యనారాయణ (ఎ-4)ల సహాయం కోరగా, వారంతా సంఘటనా స్థలంకు చేరినారు. వారంతా సంఘటనా స్థలంకు చేరుకున్న తరువాత కెంగువ రవి హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకుగాను చొక్కా తాటి మట్టలతో శవంను చెట్టుకు వ్రేలాడదీయగా, శవం బరువుకు క్రింద పడిపోవడం జరిగిందని నిందితులు విచారణలో వెల్లడించారు. (ఎ-2) అయిన గారి నారాయణరావు శవం కాళ్ళును కట్టేసి, శవంకు బరువును కట్టి,బావిలో పడేసినట్లయితే శవం ఎప్పటికీ బయటకు తేలదని సలహా ఇవ్వడంతో, వారందరూ కెంగువ రవి కాళ్ళును కట్టేసి, బరువుకు ఇటుకలను కట్టి, శవంను బావిలో పడేయం జరిగిందన్నారు. కెంగువ రవి తండ్రి అప్పలనాయుడు తన కుమారుడు గత ఫిబ్రవరి 17 రాత్రి నుండి కనిపించడం లేదని విజయనగరం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు మిస్సింగు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. అనంతరం, పినవేమలి గ్రామ పొలిమేరల్లోని బావిలో ఒక పురుషుని శవం ఉన్నట్లుగా పశువుల కాపర్లు తెలపడం, సదరు శవం కెంగువ రవిదిగా నిర్ధారించి, బావి బయటకు తీయడం జరిగింది. రవి శవం కాళ్ళు కట్టి ఉండడంతో ఇది హత్యగా భావించి, మిస్సింగు కేసును హత్య కేసుగా మార్పు చేయడం జరిగిందన్నారు. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు పోలీసు జాగిలాలతో సంఘటనా స్థలంను పరిశీలించగా, నిందితులు మద్యం సేవించిన దాఖలాలు, ఒకచెట్టు వద్ద రవి షర్టు లభించాయన్నారు. ఈ కేసులో అనుమానితులను విచారణ చేయడం, సరైన ఆధారాలు లేకపోవడంతో విడిచి పెట్టడం జరిగేది. అయితే, ఇటీవల కాలంలో బాలి పైడిరాజు తిరుపతి వెళ్ళినట్లుగా సమాచారం అందుకున్న పోలీసులు, ఎవరితో కలసి బాలి పైడిరాజు తిరుపతి వెళ్ళాడన్నది విచారణ చేయగా, బాలి పైడిరాజు కుటుంబ సభ్యులతో కాకుండా అతని స్నేహితులైన గారి నారాయణరావు, కింతాడ ఉదయ కిరణ్ మరియు ఇమంది సత్యన్నారాయణలు కలిసి తిరుపతి వెళ్ళడంతో పోలీసులు అనుమానించి, వారిని మరోసారి విచారణ చేయడంతో నిందితులు నేరం  చేసినట్లుగా అంగీకరిచారన్నారు. ఈ కేసు విచారణలో విజయనగరం డిఎస్పీ పి.అనిల్ కుమార్ నేతృత్వంలో రూరల్ సిఐటిఎస్ మంగవేణి, ఎస్ఎ నారాయణరావు, ఎఎస్ఎ త్రినాధరావు, కానిస్టేబుళ్ళు షేక్ షఫీ, సాయి శంకర్‌లను జిల్లా ఎస్పీ బి. రాజకుమారి అభినందించి, వారికి ప్రోత్సాహక నగదు బహుమతిని అందజేసారు. ఈ మీడియా సమావేశం విజయనగరం డిఎస్పీ పి. అనిల్ కుమార్, రూరల్ సీఐ టిఎస్ మంగవేణి, ఎస్బీ సిఐ ఎన్.శ్రీనివాసరావు మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...