Followers

కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి

 కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి - ఎంపీపీ

పెన్ పవర్, మేడ్చల్

 కరోనా పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎంపీపీ పద్మజగన్ రెడ్డి సూచించారు. ఏమాత్రం అజాగ్రత్త వహించినా ప్రాణాపాయ స్థితిని ఎదుర్కోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. రాజ బొల్లారంలో పంచాయతీ సభ్యుడు మృతి చెందడం తీవ్రంగా కలచి వేసిందని తెలిపారు. ఓ పండుగ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయనకు కరోనా సోకిందని చెప్పారు. ప్రజా ప్రతినిధులు, ప్రజలు ఈ విపత్కర పరిస్థితుల్లో ఇంటికి పరిమితం కావాలని సూచించారు. ఎలాంటి సామూహిక కార్యక్రమాలు పెట్టుకో వద్దన్నారు. పెళ్ళిళ్ళు,  శుభకార్యాలను కూడా వాయిదా వేసుకోవాలని అన్నారు. తప్పనిసరి అయితే కరోనా నిబంధనలు పాటిస్తూ పరిమిత సంఖ్యలో బంధువులు శుభకార్యాలకు హాజరయ్యేలా చూసుకోవాలని చెప్పారు. కరోనా విపత్తులో వైద్యులు, సిబ్బంది,  పారిశుద్ధ్య కార్మికులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని చెప్పారు. ఏఎన్ఎంలు, సిస్టర్లు, ఆశా కార్యకర్తలు తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందిస్తున్నారని చెప్పారు. వారికి రుణపడి ఉండటమే కాకుండా పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. పోలీసులు సైతం తమ ప్రాణాలను లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. కర్ఫ్యూ అమలులో ప్రజలు వారికి సహకరించాలన్నారు. నిర్ణీత సమయంలో వ్యాపార వాణిజ్య సంస్థలను మూసివేయాలని, ఇంటికి చేరుకోవాలని సూచించారు. గ్రామాలను కరోనా బారి నుంచి పరిరక్షించుకునేందుకు ఎంపిటిసిలు, సర్పంచులు, వార్డు సభ్యులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇండ్లలో నుంచి కొద్ది రోజులు ప్రజలు  బయటకి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆమె చెప్పారు. మేడ్చల్ మండలంలో వ్యాక్సినేషన్ కేవలం మేడ్చల్ పట్టణంలోని సిహెచ్సి లో మాత్రమే జరుగుతుందని, దీంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని మంత్రిమల్లారెడ్డి,  కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. త్వరలో శ్రీరంగవరం పీహెచ్సీలో, పారిశ్రామిక వాడ చెక్ పోస్ట్ లోని ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినేషన్ చేసేందుకు చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చినట్టు ఎంపీపీ తెలిపారు. కరోనా టీకాలు మెడిసిటీ లోనూ ఇస్తున్నారని, ఆర్థికంగా ఉన్న వారు అక్కడికి వెళ్లి తీసుకోవాలని చెప్పారు. తద్వారా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల పై ఒత్తిడి తగ్గుతుందని ఆమె పేర్కొన్నారు. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలని, వైరస్ వ్యాప్తి చెందకుండా వ్యక్తిగత క్రమశిక్షణ పాటించాలని ఎంపీపీ పద్మ జగన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...