Followers

అంగన్ వాడీ... ఇక ఆనందాల ఒడి.!

 అంగన్ వాడీ... ఇక ఆనందాల ఒడి.!   

అంగన్వాడీ కేంద్రాలకు మహర్దశ         

 తొలిదశలో 29 భవనాల నిర్మాణం

 నవీకరణతో 19 చోట్ల సొబగులు    

 పెన్ పవర్, కందుకూరు

 నాడు నేడు పథకం లో అంగన్వాడీ కేంద్రాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలోని అంగన్వాడి కేంద్రాలకు కొత్త భవనాల నిర్మాణం తో పాటు నవీకరణ కు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇందుకు  నాడు నేడు శ్రీకారం చుట్టనుంది. గత కొన్ని నెలలుగా వివిధ రకాల నిధులతో సొంత భవనాలను నిర్మిస్తున్నారు. అయినప్పటికీ ఇంకా చాలా చోట్ల పక్కా భవనం భాగ్యం లేదు. పల్లె, పట్టణాల్లో అద్దె ఇల్లు తీసుకొని నడుపుతున్నారు. మరోవైపు ఇరుకైన గదులతో  ఆసౌకర్యాలతో నెట్టుకొస్తున్నారు. కొన్నింటిలో తాగేందుకు గుక్కెడు నీళ్లు దొరకడం లేదు. మురుగు వసతి ఊసేలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పాఠశాలల్లో, ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాడు నేడు అమలు చేస్తోంది. ఇక అంగన్వాడీలను అమలు చేయాలని ఇటీవల నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా చూస్తే మూడు దశల్లో అమలు చేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు దృష్టి సారించారు. సాంకేతిక నిర్మాణం, పర్యవేక్షణ బాధ్యతను గృహ నిర్మాణ శాఖ కు అప్పగించారు. ఇప్పటికే నూతన భవనాలు నిర్మించాల్సిన కేంద్రాలను ఎంపిక చేశారు. జిల్లాలో సొంత గూడు లేని చోట నూతనంగా భవనాన్ని నిర్మించి కొత్త సొబగులు తీసుకురావాలని ప్రణాళికలను సిద్ధం చేశారు. నియోజకవర్గంలో సుమారు 29 నూతన భవనాలు నిర్మించనున్నారు. ఒక్కో భవనానికి 14 లక్షల చొప్పున ఖర్చు చేయనున్నారు. అవసరాన్ని బట్టి అంచనా వ్యయం పెంచే యోచనలో ఉన్నారు. వంటగది, సామాగ్రి నిలవ గది, మురుగు వసతి, ఆటస్థలం తో కలిపి నూతన భవనాలను అందంగా తీర్చిదిద్దనున్నారు. అలాగే నియోజకవర్గంలో లో తొలి దశలో నియోజకవర్గంలో 19 కేంద్రాలను నవీకరించాలి అని నిర్ణయించారు. అదనపు సదుపాయాల కల్పనకు ఒక్కో భవనానికి  6.90 లక్షలు ఖర్చు చేయనున్నారు. అవసరమైన వసతులు ఏర్పాటు చేయించాలని ఇప్పటికే రాష్ట్ర ఉన్నతాధికారులు అనుమతిచ్చారు. ఫ్రిజ్, నీటి ఫిల్టర్, ట్యూబ్లైట్, ఫ్యాన్లు, ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డు,తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, ఆటవస్తువులు, రంగులు, వంటగది నిర్మాణం చేపడతారు. ఇవేగాక ఎక్కడైనా ప్రహరీ లేకపోతే ఉపాధిహామీ నిధులతో నిర్మించాలని రాష్ట్ర ఉన్నతాధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. కొత్త నిర్మాణాలు, నవీకరణ పనులను అంగనవాడి కేంద్రాల అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. సచివాలయంలో పనిచేస్తున్న సాంకేతిక సహాయకులు కన్వీనర్ గా ఉంటారు. స్థానిక అంగన్వాడీ కార్యకర్త, ఐసిడిఎస్ పర్యవేక్షకురాలు, మహిళా సంరక్షణ కార్యదర్శి, కేంద్రంలో లబ్ధి పొందుతున్న 2-4 ఏళ్ల వయసున్న పిల్లల తల్లులు ముగ్గురు సభ్యులుగా ఎంపిక చేస్తారు. అభివృద్ధి కమిటీ కు చెందిన బ్యాంకు ఖాతాలకు నిధులను జమ చేస్తారు. అంగన్వాడీ కేంద్రాలను వైయస్సార్ పూర్వ ప్రాథమిక పాఠశాల గా మార్పు చేసింది. ఈ పాఠశాలలకు వచ్చే బాలలకు మౌలిక వసతులు కల్పించేందుకు నిధులు ఖర్చు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు అంగన్వాడీ కేంద్రాలు అరకొర సౌకర్యాలతో నామమాత్రంగా ఉండేవి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నాడు-నేడు అభివృద్ధి చేస్తుండడంతో కొత్త రూపు సంతరించుకోనున్నాయి. పట్టణాల్లో భూమి విలువ ఎక్కువ కావడంతో ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేసేందుకు నిధుల సమస్య ఉంది. ప్రభుత్వ భూములు తక్కువగా ఉండడం అవి కూడా అంగన్వాడీ కేంద్రాలకు దూరంలో ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్థలాలు సమకూరితే గాని నిర్మాణ పనులు ప్రారంభించడం కుదరదు. దాతలు ఎవరైనా స్థలాన్ని విరాళంగా ఇచ్చిన కూడా తీసుకోమని ప్రభుత్వం సూచించింది. గ్రామాల్లో కొంతవరకు పూర్వీకుల స్థలాలను ఇచ్చేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. కానీ పట్టణాల్లోని స్థల సమస్య తీవ్రం కానుంది. ప్రభుత్వం  అంగనవాడి కేంద్రాలలో పూర్వ ప్రాథమిక విద్య ప్రవేశపెట్టి ఆట పాటల ద్వారా ఇంగ్లీష్ మీడియం బాలలకు నేర్పించాలని ప్రతిష్టాత్మకంగా పూర్వ ప్రాథమిక విద్య ప్రవేశపెట్టడమే కాక అంగన్వాడీలకు నూతన భవనాలు అంగనవాడి భవనాల నవీకరణ కు నాడు నేడు కింద ప్రభుత్వం చేపట్టడంతో బాలల తల్లులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దశలవారీగా అంగన్వాడీ కేంద్రాలలో బలోపేతం చేయడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసి తద్వారా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుంది.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...