Followers

ఆలస్యంగా కనువిప్పు..!

 ఆలస్యంగా కనువిప్పు..! 

జిల్లాలో 3 వేల పడకలతో..
కోవిడ్ కేర్ సెంటర్లు ప్రారంభం..
జెఎన్టీయూలో అందుబాటులో 600 పడకలు..
కోవిడ్ లక్షణాలు లేని వారికి హోమ్ ఐసోలేషన్
ఇంటిలో ప్రత్యేక గది లేని వారికి కేర్ సెంటర్..
వ్యాధి తీవ్రత ఉన్న వారికి కోవిడ్ హాస్పిటల్లో చికిత్స..
జిల్లాలో 3 వేల పడకలతో..
మూడంచెల వ్యూహంతో..
కోవిడ్ కేర్ సెంటర్లు ప్రారంభం..
జెఎన్టీయూలో అందుబాటులో 600 పడకలు..
కోవిడ్ లక్షణాలు లేని వారికి హోమ్ ఐసోలేషన్
ఇంటిలో ప్రత్యేక గది లేని వారికి కేర్ సెంటర్..
వ్యాధి తీవ్రత ఉన్న వారికి కోవిడ్ హాస్పిటల్లో చికిత్స..

మూడంచెల వ్యూహంతో..

విజయనగరం ప్రతినిధి, పెన్ పవర్

కోవిడ్ సెకెండ్ వేవ్ ధాటికి ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతుంటే..జిల్లా అధికార యంత్రంగా ఆలస్యంగా కళ్ళు తెరచింది. రోజుకు వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదై,  పదుల సంఖ్యలో కోవిడ్ మరణిస్తుంటే సరైన ప్రణాళిక లేక యంత్రాంగం ఇప్పటి వరకు చేష్టలుడిగి చూసింది. కోవిడ్ చావులను చూసి ప్రజలు బెంబేలెత్తి పోతుంటే ప్రజా సంఘాలు ఎన్ని విజ్ఞప్తులు చేసినా, ప్రెస్ అండ్ మీడియా ఎన్ని వాస్తవ కధనాలు ప్రచురించినా అటు పాలకుల్లో గానీ, ఇటు అధికారుల్లో గానీ కనీసం కదలిక రాలేదు. పైగా పర్య వేక్షణ లోపమో, వైద్య సిబ్బంది నిర్లక్ష్యమో గానీ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఇటీవల ఆక్సిజన్ అందక పదుల సంఖ్యలో కోవిడ్ రోగులు మరణించారని ప్రజా సంఘాలు గట్టిగా ఘోషిస్తున్నా, యంత్రాంగం మాత్రం అటువంటిది ఏమీ జరగలేదని బుకాయిస్తూనే వచ్చింది. అయితే అటు వంటి ఆక్సిజన్ సకాలంలో అందని లోపమే మళ్లీ కేంద్ర ఆసుపత్రిలో పునరావృతం కావడంతో యంత్రాంగం డొల్లతనం బయటపడింది. యంత్రాంగంలోని ఈ లోపాలతో పాటు జిల్లాలో కోవిడ్ పాజిటివ్ కేసుల ఉధృతికి తగ్గ ఆసుపత్రులు, బెడ్ లు, ఆక్సిజన్ సరఫరా, రేమిడేసివర్ ఇంజెక్షన్ల కొరత, కృత్రిమ సృష్టితో బ్లాక్ లో మందుల విక్రయాలు, ఉచిత మందుల సరఫరాలో అవినీతి అక్రమాలు వంటి ఘటనలను ఉటంకిస్తూ 'పెన్ పవర్' పలు ప్రత్యేక వాస్తవ కథనాలను వెలుగులోకి తెచ్చింది. ఆ క్రమంలోనే కోవిడ్-19 మొదటి వేవ్ లో ఏర్పాటు చేసిన విధంగా తిరిగి ప్రత్యేక క్వారంటైన్ కేంద్రాలను ప్రారంభించాల్సిన ఆవశ్యకతను తెలియచేస్తూ పెన్ పవర్.."క్వారంటైన్ కేంద్రాలు తెరవండి..ప్లీజ్" అంటూ ఏప్రిల్ 28న ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం అధికార యంత్రాంగంలో ఎంత వరకు కదలిక తెచ్చిందో తెలియదు గానీ వారిలో ఆలస్యంగా "కనువిప్పు" కలిగిందనే చెప్పుకోవాలి. ఈ మేరకు జిల్లాలో 3 వేల పడకలతో కోవిడ్ రోగ లక్షణాలు ఉన్న పెసెంట్స్ కోసం ప్రత్యేక క్వారంటైన్ కేర్ సెంటర్లని ప్రారంభిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్, ఎంపీ బెల్లాన చంద్ర శేఖర్ ప్రకటించారు. అంతే కాకుండా విజయనగర శివారు ప్రాంతంలో ఉన్న సువిశాల జేఎన్టీయూ క్యాంపస్ లో 600 పడకలతో క్వారంటైన్ కేర్ సెంటర్ ని కూడా శుక్రవారం ప్రారంభించారు. అలాగే మరో మూడు సెంటర్లలో 400 పడకలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అందుబాటులో ఈ నాలుగు క్వారంటైన్ కేర్ యూనిట్లలో వెయ్యి పడకలు అందుబాటులో ఉంచినట్టు వారు తెలిపారు. ఈ కేర్ సెంట‌ర్ల  వద్ద ప్రత్యేక చికిత్స గది, పిపిఇ కిట్లు, మందులు, కోవిడ్ కిట్లు, ఆక్సీజ‌న్ సిలండ‌ర్లు, ఇసిజి, మెనూ బోర్డులు, రూముల్లోని ప‌డ‌క‌ల ఏర్పాటు చేశారు.

అదేవిధంగా ప్ర‌భుత్వం నిర్ధేశించిన విధంగా ఒక్కో రోగికి రోజుకు సుమారు రూ.300 ఖ‌ర్చులో మంచి పోష‌కాహార భోజ‌నాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కేర్ సెంట‌ర్ల వ‌ద్ద అవ‌స‌ర‌మైన‌ స‌మ‌యంలో వినియోగించుకొనేందుకు ఆక్సీజ‌న్ స‌దుపాయం కూడా ఉంటుందని కలెక్టర్, ఎంపీ తెలిపారు. రోగుల‌ను అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిలో ఆసుప‌త్రికి త‌ర‌లించేందుకు అంబులెన్సుల‌ను కూడా సిద్దంగా ఉంచుతున్న‌ట్లు చెప్పారు. క‌రోనా సోకితే భ‌య‌ప‌డ‌కుండా ధైర్యంగా ఉండాల‌ని సూచించారు. జిల్లా ఆసుప‌త్రుల్లో ఆక్సీజ‌న్ కొర‌త లేద‌న్నారు. మరో వైపు జిల్లా కేంద్రాసుప‌త్రిలో ఆక్సీజ‌న్ నిల్వ సామ‌ర్థ్యాన్ని 2వేల కిలో లీట‌ర్ల నుంచి 8 వేల కిలోలీట‌ర్ల‌కు పెంచుతున్న‌ట్లు చెప్పారు. జిల్లా 3 వేల పడకలతో ఏర్పాటు చేస్తున్న కోవిడ్ కేర్ సెంటర్లుని మూడంచెల వ్యూహంతో నిర్వహించనున్నారు. వ్యాధి సోకిన వారికి మూడు ప‌ద్ద‌తుల ద్వారా చికిత్స‌ను అందించనున్నారు. పాజిటివ్ ఐనా ఎటువంటి ల‌క్ష‌ణాలు లేనివారిని హోం ఐసోలేష‌న్‌లోనే ఉంచి, వారికి వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చికిత్స అందిస్తారు. 104 ద్వారా రిజిస్టర్ అయిన వీరికి 3 గంట‌ల్లోనే కోవిడ్ కిట్ల‌ను అంద‌జేస్తారు. కోవిడ్ లక్షణాలు కలిగి ఇళ్ల‌లో ఏకాంతంగా ఉండే అవ‌కాశం లేనివారిని కోవిడ్ కేర్ సెంట‌ర్ల‌కు త‌ర‌లించి, చికిత్స‌ను అందించనున్నారు. మూడోదిగా ల‌క్ష‌ణాలు తీవ్రంగా ఉన్న‌వారిని కోవిడ్‌ ఆసుప‌త్రుల‌కు త‌ర‌లిస్తారు. దీనికోసం జిల్లా వ్యాప్తంగా ఇప్ప‌టికే 30 ఆసుప‌త్రుల‌ను సిద్ధం చేసినట్టు కలెక్టర్ తెలిపారు. 14 ప్ర‌భుత్వ ఆసుప్ర‌తులతోపాటు, 16 ప్ర‌యివేటు ఆసుప‌త్రుల్లోని 2,098 ప‌డ‌క‌ల‌ను సిద్దం చేసి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. వైద్యులు, సాంకేతిక నిపుణులు, న‌ర్సులు త‌దిత‌ర సిబ్బంది కూడా సిద్దంగా ఉన్నార‌న్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు డెత్ ఆడిట్‌ను నిర్వ‌హిస్తూ, మ‌ర‌ణాల‌పై విశ్లేష‌ణ కూడా జ‌రుపుతున్నట్టు క‌లెక్ట‌ర్ వివ‌రించారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...