ప్రాణం ఖరీదు..
పరపతి ఉన్న వాడిదే ప్రాణం..
సామాన్యుడికి అందదు వైద్యం..
హాస్పిటల్లో బెడ్ కొరత..
బయట ఆక్సిజన్ కొరత..
రెమెడిసివర్ ఇంజెక్షన్ కొరత..
ఆరోగ్య శ్రీ ప్యానల్ హాస్పిటల్లో సిపార్సులకే సేవలు..
ఇళ్లల్లో ఖరీదైన వైద్యం చేయించుకుంటున్న ధనవంతులు, వ్యాపారులు, ప్రముఖులు..
ప్రత్యేక ప్యాకేజీలతో హోమ్ సేవలందిస్తున్న వైద్యులు..
వారికే తరలిపోతున్నాయి ఆక్సిజన్ లు, ఇంజక్షన్లు..
ఆరోగ్య శ్రీ ద్వారా అందించే ఉచిత ఇంజెక్షన్స్ ని పక్కదారి పట్టిస్తున్న హాస్పిటల్స్..
ఎక్కువ ధరలకు పలుకుబడి ఉన్న వారికి విక్రయం..
సకాలంలో సామాన్య రోగికి అందని మందులు..
పరిస్థితి విషమించి చనిపోతున్న సామాన్యులు..
కొన్ని ప్రయివేట్, ఆరోగ్య శ్రీ ప్యానల్ హాస్పిటల్స్ ల్లో జరుగుతున్న కోవిడ్ స్కామ్..
ధనం ఇదత్ జగత్ ధనమేరా అన్నింటికీ మూలం ధనం ముందు అందరూ దాసోహం ధనవంతుడిదే ప్రపంచం ధనవంతుడుదే విలాసం ఇప్పుడు ధనవంతుడుదే ఆరోగ్యం అని రుజువు చేస్తోంది. ఈ కోవిడ్ సెకండ్ వేవ్. మొదటి దారి కన్నా రెండో దారిలో దూసుకు వచ్చిన ఈ కరోనా వైరస్ దాడికి వారు, వీరని కాదు ప్రజలంతా కకావికలమైపోతున్నారు. దీంతో కోవిడ్ వైద్యం అంత్యంత ఖరీదై పోయింది. ప్రతి ప్రాణం ఖరీదు లక్షల రూపాయల్లో ఉంది. ప్రభుత్వ ఉచిత వైద్యం మృగ్యమైపోయింది. దీంతో సామాన్యులు సకాలంలో వైద్యం అందక ప్రాణాలు విడుస్తున్నారు. కోవిడ్ పరీక్ష మొదలు, వైద్యం అందక చచ్చి ఇంటికి చేరే వరకు అడుగడుగునా డబ్బు తీయాల్సిందే. లేదంటే అనాధ శవంలా అయిన వారు వదిలి పోవాల్సిందే. కానీ ఇటువంటి భరించలేని భౌతిక కష్టాలు ఏవీ సొసైటీలో పరపతి, పలుకుబడి ఉన్న ధనవంతులు, వ్యాపారులు, రాజకీయ నాయకులు, ప్రముఖులకి అంతగా లేవనే చెప్పుకోవాలి. వారికి చిటికేస్తే కాదు..చిల్లర విసిరితే చాలు అన్నీ ఇంటి ముంగిటకు వచ్చి పడుతున్నాయి. మార్కెట్లో ఆక్సిజన్ వారికే ముందు, ఆ తర్వాత వెళ్లిన వాడికి నో స్టాక్ బోర్డు. బ్లాక్ లో అత్యంత ఖరీదై పోయిన రెమెడిసివర్ ఇంజక్షన్ కూడా వారికి అందుబాటులో, సామాన్యుడికి దొరకడం గగనం. హాస్పిటల్ లో చేరితే అత్యవసర సేవలన్నీ వారికే ముందు, ఆ తర్వాతే సామాన్యులకి సాదారణ సేవలు. కోవిడ్ జాగ్రత్త కోసమని వైద్యుడు సామాన్య రోగి చేయి పట్టుకొని పల్స్ కూడా చూడడు. కానీ పరపతి ఉన్న ధనవంతులు కోరితే ప్రత్యేక ప్యాకేజితో హోమ్ ఐసోలేషన్ సేవలు అందిస్తాడు. చివరికి ఆరోగ్యశ్రీ ద్వారా తమ హాస్పిటల్స్ లోని కోవిడ్ రోగికి ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న రెమెడిసివర్ ఇంజెక్షన్ ను కూడా అవసరమైన సామాన్య రోగులకు వేయకుండా వాటిని బ్లాక్ చేసి, వేల రూపాయలకి విఐపీలు, వివిఐపీలకి అమ్ముకుంటున్న వైద్యులున్న హాస్పిటల్స్ కూడా జిల్లాలో ఉన్నాయి.
విజయనగరం పట్టణంలో కొన్ని కోవిడ్ హాస్పిటల్స్ లో ఠాగూర్ మూవీ సీన్లు ఎక్కువగా కనిపిస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోవిడ్ భయంతో రోగిని హాస్పిటల్స్ లో చేర్పించేసిన బంధువులు ఇటు వైద్యుల పైన, అటు దేవుడి పైన భారం వేసేసి బయట పడిగాపులు పడడమే తప్ప లోపలికి పోయే సాహసం చేయలేరు. అలాగని వైద్య సేవలు అందించే వైద్యుడు గానీ, వైద్య సిబ్బంది గానీ రోగిని అంటి పెట్టుకొని అలాగే ఉండిపోరు. ఐసీయూలో ఉన్న పెసెంట్ ఎలా ఉన్నాడన్న ఆందోళన తప్ప వైద్యం సకాలంలో సక్రమంగా అందుతుందో లేదో తెలుసుకోలేని దుస్థితిలో బంధువులు ఉంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఒక్కోసారి వైద్యుల నిర్లక్ష్యమో, సిబ్బంది అలసత్వమో, హాస్పిటల్స్ లో పర్యవేక్షణ లోపమో, యజమానుల అక్రమ స్వార్దమో తెలియదు గానీ..వెరసి సామాన్యుడి ప్రాణం గాల్లో కలిసిపోవడం ఖాయం. ఇలాంటి ఘటనలు ఇటీవల విజయనగరం పట్టణం లోనే కాదు జిల్లా వ్యాప్తంగా చవిచూస్తున్నాం. అధికారిక గణాంకాలు ప్రకారం ఈ ఏప్రిల్ నెల లో ఇంతవరకు కోవిడ్ కారణంగా 24 మంది మరణించారు. ఇక లెక్కల్లో లేని కోవిడ్ చావులెన్నో స్మశానాలకు వెళ్లి అంచనా వేయాల్సిందే. ఇలా అన్ని విధాలుగా వంచనకి గురవుతూ ఖరీదైన వైద్యం సకాలంలో చేయించుకోలేక సామాన్యులు ప్రాణాలు విడుస్తున్నారు. పలుకుబడి, పరపతి ఉన్న వారు అన్నీ సమకూర్చుకొని ఖరీదైన వైద్యం చేయించుకుంటూ ప్రాణాపాయం నుంచి బయట పడుతున్నారు. ఇటువంటి వారిలోనూ ఒకటి అరా కోవిడ్ మరణాలు సంభవిస్తున్నా, అవి వృద్దాప్యం లేదా దీర్ఘకాలిక వ్యాధులు కలిగి ఉండడం వల్ల చోటుచేసుకుంటున్నవిగా చెప్పుకోవచ్చు.
అవకాశం ఉండి వైద్యం చేయించుకున్న వారిని చూసి సామాన్యులు అసూయతో ఈ విమర్శలు చేయడం లేదు. కోవిడ్ టెస్ట్ కి వెల్దామన్నా విఐపీల సిపార్సు ఉండాలి. హాస్పిటల్ లో చేరాలంటే ఎవరి కాలో పట్టుకోవాలి. ఆక్సిజన్ కొద్దామన్నా వ్యాపారిని బ్రతిమిలాడుకోవాలి. అంబులెన్స్ కావాలంటే వాడు అడిగినంత చెల్లించుకోవాలి. ప్రభుత్వ హాస్పిటల్ లో మెరుగైన వైద్యం పొందాలంటే ప్రముఖులచే ఫోన్లు చేయించుకోవాలి. ఆరోగ్యశ్రీ ప్యానల్ హాస్పిటల్స్ లో బెడ్ లు ఖాళీ ఉండి కూడా ప్రాణం పోతోంది చేర్చుకోండి మహా ప్రభో అని కాళ్ళా వెళ్ళా పడినా లేదు పొమ్మంటున్నారు. వాటిని నేతలు సిపార్సు చేసిన వారి కోసం, లేదా తమ వారి కోసం రిజర్వు చేసుకుంటున్నారు. చివరికి ప్రయివేట్ హాస్పిటల్ కి వెళ్లి చేరుదామంటే, ముందే 50 వేలు లేదా లక్ష రూపాయిల డిపాజిట్ కట్టమంటున్నారు. తీరా చేరాక ఇంజెక్షన్ దొరకడం లేదు అది మీరే కొనుక్కోవాలని కండీషన్ పెడుతున్నారు. అది దొరక్కపోయే సరికి చావు కబురు చల్లగా చెబుతున్నారు. ఆ తర్వాత బ్యాలెన్స్ కట్టి బాడీ తీసుకువెళ్లాలని బెదిరిస్తున్నారు. మరి ఇటువంటి ధనిక, పేద, ప్రముఖుడు, సామాన్యుడు అని వివక్ష చూపుతూ వైద్యం అందిస్తుంటే ప్రజలకి గుండె మండదా..? వారి నెత్తురు ఉడకదా..? వారికి ఆవేశం రగలదా..? ఉచిత సేవలు ప్రభుత్వం సామాన్యులకు ఇస్తున్న వరం. అది మంచి వరమని విశ్వసించి వచ్చిన వారికి శాపంగా మారుస్తున్నాయి కొన్ని హాస్పిటల్స్. సకాలంలో సంక్రమైన వైద్యం అందించక, ఆక్సిజన్ ఇవ్వక, ఇంజెక్షన్ పెట్టక నిర్లక్ష్యం, ఆపై స్వార్థంతో సామాన్యుల చావులకి కారణమౌతున్న హాస్పిటల్ యాజమాన్యాలు ఇప్పటికైనా కాస్తా మానవత్వంతో సేవలందించండి. ఫ్రంట్ లైన్ యుద్ద వీరుల్లా మీ ప్రాణాలని పణంగా పెట్టి మరీ మీరందిస్తున్న సేవలు అత్యంత నిరూపమానం. అక్కడక్కడా మీ వృత్తిలో ఉన్న కొందరు సేవ ముసుగులో చేస్తున్న అవినీతి, అక్రమాలు, అలక్ష్యం వల్ల మీ వైద్య సమాజానికి కళంకం తీసుకువస్తున్నాయి. ప్రజలచే నిత్యం దేవుళ్ళుగా కొనియాడబడే మీరే ఒక్కోసారి వారి కంటికి అన్యాయం చేసిన వారిగా కనిపిస్తున్నారు. దయచేసి ఇటువంటి విపత్తులో మీరే ప్రజల దేవుళ్ళు. వారు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా సేవలందించాలని యావత్ ప్రజానీకం మీకు చేతులెత్తి వేడుకొంటోంది.
No comments:
Post a Comment