దీక్షా శిభిరాన్ని సందర్శించిన ఢిల్లీ రైతు పోరాట నాయకులు
మహారాణి పేట, పెన్ పవర్
జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద నడుస్తున్న పబ్లిక్ సెక్టార్ పరిరక్షణ వేదిక నిరాహారదీక్ష శిభిరాన్ని ఢిల్లీ రైతుపోరాట నాయకులు రాకేష్ టీకాయత్, అశోక్ థావలే ఆదివారం సందర్శించారు. ఆదివారం ఆర్కేబీచ్ లో భారీఎత్తున జరిగిన సభకు ముఖ్యవక్తలుగా ఆలిండియా కిసాన్ మోర్చా ప్రధాన నాయకులలో ఒకరైన రాకేష్ టికాయత్, ఎఐకెఎన్ ఆలిండియా ప్రధాన కార్యదర్శి అశోక్ థావలె, ఆలిండియా వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ తదితరులు విశాఖనగరానికి వచ్చారు. వీరు ఆదివారం ఉదయం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద స్టీల్ ప్లాంట్, ప్రభుత్వరంగ సంస్థ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నడుస్తున్న దీక్షా శిభిరానికి పాల్గొని తమ మద్దతును తెలియజేసారు. ఈ సందర్భంగా రాకేష్ టీకాయత్ మాట్లాడుతూ నరేంద్రమోడీ ప్రభుత్వం రైతులకు, కార్మికులకు తీవ్ర నష్టదాయకమైన నిర్ణయాలను చేస్తోందన్నారు. రైతులు ఢిల్లీలో నలుమూలల వ్యవసాయచట్టాలు రద్దుకోసం పోరాడుతుంటే యావత్తు భారతదేవ ప్రజలంతా మద్దతు తెలియజేస్తున్నా మోడీకి మాత్రం చలనం రావటం లేదన్నారు.
మరోవైపు ప్రభుత్వరంగ సంస్థలను కార్పోరేట్లకు కట్టబెట్టే చర్యలు చేపడుతుందన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మడాన్ని విశాఖ కార్మికవర్గం, ప్రజలు పోరాడుతున్నారు. వీరికి మద్దతు తెలియజేయడం కోసమే వచ్చామన్నారు. కార్మికులు, కర్షకులు కలిసి పోరాడి మన హక్కులను సాధించుకుందామన్నారు. ఆదివారం దీక్షల్లో ఆర్టిస్ ఎస్ డబ్యుఎఫ్ నాయకులు, కార్యకర్తలు, ఎఐటియుసి శ్రామికమహిళా కార్యకర్తలు కూర్చున్నారు. ఈ సందర్భంగా ఎస్ బ్యుఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుందరయ్య పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వరంగ సంస్థలు ఉంటే రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలుంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రీజనల్ కార్యదర్శి ఎం.సిహెచ్ అప్పుడు, రాజేంద్రప్రసాద్,సీతాలక్ష్మి,పరమేశ్వరరావు, ప్రసాద్, రాజు,ఎ.ఎస్.రావు,యు.కె.రావు,కె.వి.పి.రావు, ఎఐటియుసి శ్రామిక మహిళా విభాగం కన్వీనర్, కోకన్వీనర్లు పి.శ్యామలదేవి. ఎస్.తులసీలత,రమ, వేదిక చైర్మెన్ ఎం.జగ్గునాయుడు,వైస్ చైర్మెన్ పడాలరమణ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment