పరిమితికి మించి ప్రయాణికులతో వెళ్తున్న ఆటోలు
ప్రజలప్రాణాలతో చెలగాటం.
ప్రయాణికులకు రక్షణ కరువు.
అర్హత లేకుండానే డ్రైవింగ్.
మితిమీరిన వేగంతో ప్రయాణం
తనిఖీ చేయని అధికారులు
చిన్నగూడూరు, పెన్ పవర్మహుబూబాబాద్ జిల్లా చిన్నగూడూరుమండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై అనుమతి లేకుండా మితిమీరిన వేగంతో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకొని ఇష్టానుసారంగా తిరుగుతున్న ఆటోలు,టాటా ఏ సి , మాజిక్ లతో ప్రజల ప్రాణాలకు రక్షణలేకుండా పోతోంది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిబంధనల మేరకు ఆటోలు, ఇతర వాహనాలు నడిపేందుకు ఆర్టీవో కార్యాలయం నుంచి లైసెన్సులు పొందాలి. లైసెన్సులు లేకున్నా ఆటోలు మరియూ ఇతర ట్రాన్స్ పోర్ట్ వాహనాలు ట్రాక్టర్లు నడుపుతున్నందున రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిత్యం చిన్న గూడూరు మండల కేంద్రం నుంచి అనేక వాహనాలు పరిమితికి మించి ప్రయాణికులను రవాణా చేస్తూ ప్రయాణికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులు పట్టించుకోకపోవటం పట్ల మండల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చిన్న గూడూరు మండల పరిధిలో ఆటోలు,ట్రాక్టర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. చుట్టు పక్కల గ్రామాల నుంచి జిల్లా మరియూ ఇతర మండల కేంద్రాలకు బస్సులు వెళ్లలేకపోవడంతో ప్రతిరోజు పదుల సంఖ్యలో ప్రజలు ఆటోల మీద ఆధారపడి ప్రయాణం సాగిస్తున్నారు. ఉదయం సాయంత్రం సమయంలో రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆటోడ్రైవర్లు ఇష్టారాజ్యంగా ముగ్గురు ప్రయాణికులతో ప్రయాణించాల్సిన ఆటోలో పది నుంచి పదిహేను మంది వరకు ఎక్కించుకుని వెళుతున్నారు. పెరుగుతున్న ప్రమాదాలు అనుభవం, లైసెన్సు లేకుండా ఆటోలు నడపటంతో ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. నిబంధనల ప్రకారం 18 సంవత్సరాలు నిండిన వారు మాత్రమే ఆటోలు నడపాలి. అయితే ఇక్కడ మైనర్లు సైతం ఆటోలు నడుపుతున్నారు. ఫలితంగా పట్టణంలో తరుచూ ప్రమాదాలు జరగుతున్నాయి. ఉదయం, సాయంత్రం సమయంలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఆటోలు డ్రైవర్లు మితిమీరిన వేగంతో నడుపుతూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఆటోలో డ్రైవర్‌ల పక్కన కూర్చుని ప్రయాణించేందుకు అనుమతి లేదు. కాగా డ్రైవర్ సీట్లో డ్రైవర్‌తో పాటు ముగ్గురు కూర్చుని ప్రయాణం చేస్తున్నారు. వివిధ గ్రామాలనుంచి నిత్యం అనేక మంది ప్రజలు కూలీ పనులకు గూడ్స్ వాహనాలు అయిన టాటా ఏస్ మరియూ ట్రాలీలలో ట్రక్కులలో సుమారు ముప్పయి నుంచి ఎనభై మంది వరకు ప్రయాణం సాగిస్తూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు.ఇలాంటి సందర్భాల్లో ప్రమాదం జరిగితే భాద్యత ఎవరిది అని ప్రజలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. ప్రజల అవసరాలను వాహనదారులు సైతం ఆసరాగా చేసుకుంటున్నారు. ఇప్పటికైనా పోలీస్ మరియూ ఇతర శాఖల అధికారులు స్పందించి అనుమతి లేకుండా ప్రయాణికులను కూలీలను తరలిస్తున్న వాహనాలను నియంత్రించి వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
No comments:
Post a Comment