Followers

విద్యార్థులకు, తల్లిదండ్రులకు కరోనా రాదని గ్యారంటీ ఇవ్వగలుగుతారా?

 విద్యార్థులకు, తల్లిదండ్రులకు కరోనా రాదని గ్యారంటీ ఇవ్వగలుగుతారా?

పెన్ పవర్ , రావులపాలెం

కరోనా సెకెండ్ వేవ్ ఉదృతి దృష్ట్యా చాలా రాష్ట్రాల్లో పదో తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు చేసినప్పటికీ, మన రాష్ట్రంలో మాత్రం యధావిధిగా జరుపుతామని మొండి వైఖరి ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి విద్యార్థులకు, తల్లిదండ్రులకు కరోనా రాదని గ్యారంటీ ఇవ్వగలుగుతారా అని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కొత్తపేట నియోజకవర్గ ఇన్చార్జి బండారు సత్యానందరావు ప్రశ్నించారు. శుక్రవారం ఆయన రావులపాలెంలో మాట్లాడుతూ జగన్ రెడ్డి మొండి వైఖరితో విద్యార్థుల చదువులు, పరీక్షల సంగతి దేవుడెరుగు అసలు వారి జీవితాలే పరీక్షలా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. వేలల్లో కరోనా కేసులు నమోదవుతున్నా పరీక్షలు నిర్వహిస్తానని తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్లులా తప్పుడు విధానాలతో విద్యార్థుల భవిష్యత్తును సిఎం జగన్ అంధకారంలోకి నెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సెకండ్ వేవ్  చాలా ఉధృతంగా ఉన్న కారణంగా ఇంటర్ పరీక్షలు రద్దు కానీ, వాయిదా కానీ వేయాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వైద్య నిపుణులు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం  పెడచెవిన పెడుతోందని అన్నారు. దాదాపు 15 లక్షల మంది పదోతరగతి, ఇంటర్  విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తే ఆయా కుటుంబ సభ్యులను కూడా కలిపితే 75 లక్షల మందిపై కరోనా ప్రభావం చూపే అవకాశం ఉందని, వారితో పాటు  మరో 30 వేల మంది ఉపాధ్యాయులు ఉంటే, వారిలో కుటుంబానికి 5గురు చొప్పున లక్షా 50 వేల మంది ఉంటారని,  డ్రైవర్లు, పారిశుద్ధ్య కార్మికులు మరో 3.50 లక్షల మంది ఉంటారని మొత్తంగా ఈ పరీక్షల నిర్వహణ వల్ల దాదాపు 80 లక్షల మంది కరోనాకు ప్రభావితమయ్యే అవకాశం ఉందని అన్నారు. గత రెండు రోజుల్లో 29 మంది కరోనాతో మరణించారని, ఇప్పటికే 50 మంది ఉపాధ్యాయులు మృత్యువాత పడ్డారని రాష్ట్రంలో నేడు నెలకొని ఉన్న పరిస్థితికి ఇదే నిదర్శనం అన్నారు. దేశంలోని తెలంగాణ, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల్లో పరీక్షలు వాయిదా వేశారని  మధ్యప్రదేశ్, బీహార్, ఒడిస్సా , ఉత్తరప్రదేశ్, చత్తీస్గఢ్, గుజరాత్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పరీక్షలను వాయిదా వేశారని ఆయన గుర్తు చేశారు. సాక్షాత్తు కేంద్రమే సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ పరీక్షలు కూడా రద్దు చేసిందని, జేఈఈ, నీట్ వంటి ఇతర పోటీ పరీక్షలు కూడా వాయిదా వేశారని స్పష్టం చేశారు. రాజమండ్రిలోని ఒక కళాశాలలో 150 మంది విద్యార్థులకు ఒకేసారి కరోనా వచ్చిందని, విజయవాడలో ఓ మున్సిపల్ పాఠశాల ప్రిన్సిపాల్ కు కరోనా వచ్చిందని, అక్కడ 128 విద్యార్థులు ఉండడంతో ఆయా తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొందని చెప్పారు. హాస్టళ్ల లోనూ కరోనా విస్తరిస్తోందని వాటిని కూడా మూసివేయాలని డిమాండ్ చేశారు. వ్యాక్సిన్ విషయంలో కూడా ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా ఉందని, ఇకనైనా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థుల తల్లిదండ్రుల కోరిక మేరకు పది, ఇంటర్ పరీక్షలు కనీసం వాయిదా వేయాలని, అవసరమైతే పరీక్షలు రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.కరోనా సెకెండ్ వేవ్ ఉదృతంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా జగన్ ప్రభుత్వం స్పందించి విద్యార్థులు, తల్లిదండ్రుల కోరిక మేరకు పది, ఇంటర్ పరీక్షలు కనీసం వాయిదా వేయాలని, అవసరమైతే పరీక్షలు రద్దు చేయాలని టీడీపీ అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అనంతకుమారి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ విద్యార్థులు, తల్లిదండ్రులకు కరోనా రాదని జగన్ రెడ్డి గ్యారంటీ ఇవ్వగలుగుతారా? ఎందుకు పరీక్షలను రద్దు చేయడం లేదని ప్రశ్నించారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...