Followers

అక్రమ లేఅవుట్లు పై కన్నెర్ర..

అక్రమ లేఅవుట్లు పై కన్నెర్ర..

ప్రభుత్వ నిబంధనలకు తూట్లు...
పంచాయితీ ఆదాయానికి గండి..
ప్రజల అవసరాలను అవకాశంగా మార్చుకుంటున్న రియల్టర్లు...
 గొలుగొండ, పెన్ పవర్ :

మధ్య తరగతి ప్రజల అవసరాలను, అవకాశంగా తీసుకుని దోచుకుంటున్నారు రియల్టర్లు. నర్సీపట్నంలో అధిక ఇంటి పన్నులు భరించలేక, ఇల్లు కట్టుకోవాలంటే ప్లాన్ అప్రూవల్ కు అధిక డబ్బులు చెల్లించలేక  మధ్యతరగతి ప్రజలకు  సొంత ఇల్లు నిర్మించుకోలేక సతమతమవుతున్నారు. చాలామంది ఉద్యోగులు పెట్టుబడి పెట్టి, భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడతాయని ఎక్కువగా భూములు, బంగారం కొనుగోలు చేస్తున్నారు. సరిగ్గా ఈ  ఆలోచననే కొంతమంది రియల్టర్లు సొమ్ము చేసుకుంటున్నారు. పంచాయతీలోని గ్రామాలలో పంటపొలాలు కొనుగోలు చేసి, మట్టితో నింపి లే అవుట్లుగా మారుస్తున్నారు. అయితే ఇలాంటి లే అవుట్లు వేసేటపుడు కొన్ని నిబందనలు పాటించవలసి ఉంటుంది. పంచాయతీల నుండి అనుమతులు పొందాల్సి ఉంటుంది. కానీ ఇవేవీ పట్టించుకోకుండా రియల్టర్లు అమ్మకాలు జరుపుతున్నారు.  దీనివల్ల పంచాయతీ ఆదాయానికి గండి పడటమే కాకుండా, కొనుక్కున్న వాళ్ళు నష్టపోతున్నారు. గొలుగొండ మండలం గుండుపాల పంచాయతీలో అక్రమ లే అవుట్ లపై అధికారులు దాడులు చేశారు. గుండుపాల రెవెన్యూలో ఓ వ్యక్తి సెంటు భూమిని లక్ష ఏభై వేల రూపాయలకు కొనుగోలు చేసి, ఆభూమిని లే-అవుట్ గా మార్చి, అదే సెంటు భూమిని 3లక్షల నుండి 4 లక్షల వరకు  అమ్ముతున్నారు. పంచాయతీ అనుమతులు లేని ఈ లే అవుట్ ను పంచాయతీ అధికారులు సందర్సించారు. ఈ  లే-అవుట్లో సరిహద్దు కోసం వేసిన రాళ్లు తొలగించారు. వ్యవసాయ భూమిలో ఇళ్ల నిర్మాణం కోసం లే-అవుట్ వేయాలంటే ముందుగా రెవెన్యూ అధికారుల చేత ల్యాండ్ కన్వర్షన్ సర్టిఫికెట్ పొంది ఉండాలి. అలా పొందిన సర్టిఫికెట్లు జత పరుస్తూ లే ఔట్ ను పంచాయతీ నిబంధనల ప్రకారం 20 అడుగుల రోడ్లు,  డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి సదుపాయం, విద్యుత్ సదుపాయం కల్పించి పంచాయతీ అధికారులతో లే అవుట్ కు అనుమతి పొంది ఉండాలి. కానీ చాలామంది  రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇటువంటి ఏమీ చేయకుండానే మధ్యతరగతి వారిని టార్గెట్ చేసుకుంటూ, వీళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. పంచాయితీ అనుమతులు పొందిన తరువాత మాత్రమే లే అవుట్ వేయవలసి ఉన్నప్పటికీ, కొంతమంది అధికారుల చేతివాటంతో ఈ అక్రమ వ్యాపారం జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇలాంటివి మండలంలో ఇప్పటికే ఎన్నో లే అవుట్లు ఉన్నాయి. గుండుపాలలో అక్రమ లే-అవుట్ కోసం వెళ్లిన పంచాయతీ సెక్రటరీపై రియల్టర్ జులుం ప్రదర్సించారు. నా కంటే ముందు వేసిన స్థలాలు చూడమని, తరువాత నా స్థలం చూద్దురని రియల్టర్  అన్నట్టు  తెలుస్తుంది. అయితే పంచాయితీ అధికారులు మాత్రం గట్టిగానే సమాధానం చెప్పారు. ముందు నీ లే ఔట్ కు అనుమతులు పొందు, మిగతావి మేము చూసుకుంటాం అని అలా కానిపక్షంలో చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పంచాయతీ సెక్రెటరీ నరేంద్రకుమార్ హెచ్చరించారు. అలాగే ఈ లే ఔట్ లో స్థలం కొనుకున్నవారు,  అనుమతులు పొందిన తరువాతే నిర్మాణాలు చేయాలని కానిపక్షం లో చట్ట రీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో మండలంలో అక్రమ లే-అవుట్లు వేసిన రియల్టర్ల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...