అతీ గతీ లేని పనులు..
చిన్న డ్రైనేజీ నిర్మాణానికి ఏడాది కాలమా..?
శంకుస్థాపనలు ఆడంబరంగా..
పనులు మాత్రం జాప్యంగా..
కోట్ల మాదప్ప వీధిలో..
నిలిచిపోయిన డ్రైనేజీ నిర్మాణ పనులు..
పట్టించుకోని పాలకులు..
పర్యవేక్షణ చూపని అధికారులు..
రహదారి లేక, మురుగు నీరు నిలిచిపోయి
ఏడాదిగా ప్రజలు ఇక్కట్లు..
వర్షాకాలం తరుముకొస్తున్నా..
పూర్తి కాని పనులు..ఆవేదన చెందుతున్న స్థానికులు..
విజయనగరం, పెన్ పవర్
నగర పాలక సంస్థ అధికారులారా..స్థానిక ప్రజా ప్రతినిధులారా..! ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్న ఈ దృశ్యాలు ఎలా ఉన్నాయో పరిశీలన చేశారా..? ఇవి మీ నిర్లక్ష్యపు పనితీరుకు, ప్రజాధనం దుర్వినియోగానికి అద్దం పట్టినట్టుగా లేవూ..? ఉన్నా మీ తప్పుల్ని ఎత్తి చూపే నిజాన్ని మాత్రం మీరు ఒప్పుకోరు లెండి. పిల్లి మీద ఎలుక, ఎలుక మీద పిల్లి నెట్టేసుకున్నట్టుగా మీరు కూడా ఒకరిపై ఒకరు నెపాన్ని నెట్టేసి ఎస్కేప్ అవ్వడం మీకు షరా మాములే లెండి. ఏంటి సర్ సుమారు రూ.32 లక్షల అంచనా చేప్పట్టే డ్రైనేజీ నిర్మాణానికి ఏడాది కాలం పడుతుందా..? అప్పటి వరకు ప్రజలు ఆ మురుగు నీరు, వర్షపు వరద నీటిలో కొట్టుమిట్టాడాలా..? మీ ఇళ్ల ముందు ఇలాగే ఉంటే మీరు ఊరుకుంటారా సర్. మీరు ఒక ఇల్లు కట్టుకుంటే, లేదా మీ ఇంటిలో డ్రైనేజీ నిర్మించుకుంటే ఇలాగే మధ్యలో అతీగతీ లేకుండా వదిలేస్తారా నేతలారా..! ఇదీ స్థానిక కోట్ల మాదప్ప వీధి, చిన్న పల్లి వీధిలోని ప్రజలు అధికారులు, ప్రజా ప్రతినిధులని నిలదీస్తూ అడుగుతున్న ప్రశ్నలు. మరీ ఈ ప్రశ్నలకి అటు అధికారులు, ఇటు పాలకులు ఎం సమాధానం చెబుతారో తర్వాత చూద్దాం గానీ, అసలు అక్కడ ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం.
పట్టణంలోని కోట్ల మాదప్ప వీధి, చిన్న పల్లి వీధికి వెళ్లే రహదారి చాలా ఇరుగ్గా ఉంటుంది. ఈ ఇరుకు సందుల్లో నుంచి వందల మంది విద్యార్థులు కస్పా హైస్కూల్ కి వెళ్తుంటారు. అయితే ఈ ఇరుకైన రహదారి చుట్టూ ఎక్కువ నివాస సముదాయాలు ఉండడం వల్ల ఇక్కడ ఎప్పుడూ మురుగు నీటి సమస్య తలెత్తుతూ ఉంటుంది. వర్షాకాలంలో ఈ రహదారి పూర్తిగా వరద నీరు, మురుగు నీరుతో ముంపునకు గురవుతూ ఉంటుంది. లోతట్టు ప్రాంతం, అందునా మురుగు నీటి ప్రవాహానికి సరైన డ్రైనేజీ సదుపాయం లేదు. దీంతో సుదీర్ఘ కాలంగా ఇక్కడి ప్రజలు మురుగు నీటితో సహవాసం చేస్తూ తరచుగా వ్యాధుల బారిన పడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో స్థానికుల విజ్ఞప్తి మేరకు కోట్ల మాదప్ప వీధి నుంచి చిన్న పల్లి వీధిలో గల రాధస్వామి స్కూల్ వరకు సీసీ డ్రైనేజ్ నిర్మాణం కోసం గత ఏడాది జూన్ 13న ఎమ్మెల్యే కోలగట్ల వీర భద్రస్వామి చేతుల మీదుగా అట్టహాసంగా శంకుస్థాపన చేపట్టారు. అయితే అధికారుల పర్యవేక్షణ లోపమో లేక నిధుల కొరతో లేక కాంట్రాక్టర్ మయాజాలమో తెలియదు గానీ పనులు నత్త నడకన ప్రారంభమయ్యాయి, అదే నడకలో సాగాయి, ఇప్పుడు సగం మధ్యలో నిలిచిపోయాయి. పైగా ఒక పిల్ల కాలువను పెద్ద కాలువకి లింక్ చేయడం కోసమని రహదారిని భారీగా తవ్వేశారు. ఒక వైపు కాలువ పూర్తి చేయకపోవడం, మరో వైపు ప్రధాన రహదారిని తవ్వేయడంతో ఇక్కడి ప్రజలు పడుతున్న బాధలు, ఇబ్బందులు వర్ణనాతీతం.
ఏడాది కాలంగా మురుగు నీరు, నిలిచిపోయి ఈగలు, దోమలు ముసురుతుంటే తరచుగా రోగాల బారిన పడుతున్నారు. రహదారిని తవ్వేసి వదిలేయడం వల్ల స్థానిక ప్రజలతో పాటు పాఠశాలకు వెళ్లే విద్యార్థులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అదేవిధంగా అత్యవసర సమయంలో అంబులెన్స్ వంటివి కూడా ఇటు రాలేని పరిస్థితి ఉంది. ఈ దారిలో వాహనాలు రాకపోకలు పూర్తిగా బంద్ అయిపోయాయి. ఏడాది నుంచి ఇక్కడి డ్రైనేజ్ పనులు నత్త నడకన సాగుతున్నాయి, గత కొద్దీ నెలలుగా నిలిచిపోయాయనడానికి తాజాగా గురువారం తీసిన ఈ దృశ్యాలే సాక్ష్యమిస్తున్నాయి. ఇదిలా ఉంటే నగర పాలక సంస్థ పరిధిలో శంకుస్థాపన లు ఆడంబరంగా, పనులు మాత్రం జాప్యంగా జరుగుతున్నవి చాలా ఉన్నాయి. ఐదారేళ్ళ క్రితం చేపట్టిన అంబటి సత్రం-కొత్తపేట రోడ్డు విస్తరణ పనులు నేటికీ అతీగతీ లేకుండా పోయాయి.
ఆ దారిలో కూల్చిన భవనాల మొండి గోడలు, తవ్వేసిన కాలువలు నగర పాలకుల్ని చూసి హేళనగా నవ్వుతున్నట్టు అగుపిస్తున్నాయి. అటు గణేష్ కోవెల, బాలాజీ మార్కెట్ ప్రాంతంలోని విస్తరణ పనులు కూడా నత్త నడకనే సా...గుతున్నాయి. తమ వ్యాపార అభివృద్ధికి తోడ్పడే లే అవుట్ లకి ప్రభుత్వ నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ లు ఆఘమేఘాలపై నిర్మించుకునే స్థానిక పాలకులు ప్రజల చెల్లిస్తున్న పన్నులకు తగ్గ పనులు మాత్రం సకాలంలో పూర్తి చేయడం లేదు. వారి ఇబ్బందులని గుర్తించడం లేదు. వారి అవసరానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని నగర ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి నిలిచిపోయిన కోట్ల మాదప్ప వీధిలోని డ్రైనేజ్ పనులు పూర్తి చేయాలని, పనులు ఆలస్యమైన పక్షంలో తవ్వేసిన రహదారిని పూడ్చేసి వాహనాల రాకపోకలకు అవకాశం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
No comments:
Post a Comment