Followers

సిసిఎస్ డిఎస్పీ పాపారావు మృతి పోలీసుశాఖకు తీరని లోటు

 సిసిఎస్ డిఎస్పీ పాపారావు మృతి పోలీసుశాఖకు తీరని లోటు

విజయనగరం, పెన్ పవర్

విజయనగరం జిల్లా సిసిఎస్ డిఎస్పీగా పని చేస్తున్న జుత్తు పాపారావు మృతి పోలీసుశాఖకు తీరని లోటని పలువురు, పోలీసు అధికారులు అభిప్రాయపడ్డారు. గత రెండు రోజులుగా కోవిడ్ తో విశాఖపట్నంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికత్స పొందుతున్న పాపారావు ఆదివారం, తెల్లవారుజామున మృతి చెందారు. విధి నిర్వహణ పట్ల ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించడం, అప్పగించిన పనిని క్రమశిక్షణతో పూర్తి చేయడం ఆయన నైజం. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం శివరాంపురం గ్రామానికి చెందిన జుత్తు పాపారావు 1991లో పోలీసుశాఖలో సబ్ ఇన్స్ పెక్టరుగా చేరారు. 2008లో ఇన్స్ పెక్టరుగాను 2014లో డిఎస్పీగా ఉద్యోగోన్నతులు పొందారు. విశాఖపట్నం రూరల్, సిటీలో సబ్ ఇన్స్ పెక్టరుగాను,ఇన్స్ పెక్టరుగా పలు పోలీసు స్టేషన్లులో విధులు నిర్వహించారు. పద్మనాభం, అనంతగిరి, స్పెషల్ బ్రాంచ్, కోటవురకుల, పాయకరావు పేట, అరకు పోలీసు స్టేషన్లులోను విశాఖపట్నం సిటీ మహిళా పోలీసు స్టేషను ఎసిపిగాను, అనకాపల్లి డిఎస్పీగాను గతంలో పని చేసారు. 2019 ఫిబ్రవరి నుండి విజయనగరం జిల్లాలో సెంట్రల్ క్రైం స్టేషను డిఎస్పీగా పని చేసి పలు కీలకమైన కేసులను చేధించడంలో తన మార్కు పని తీరును కనబర్చారు. ఆయనకు భార్య సుమలత, ఇద్దరు కుమారులు కిరణ్, రవీంద్ర కలరు. కిరణ్ ఇంజనీరింగు పూర్తి చేసి సివిల్స్ ప్రిపేర్ అవుతుండగా, చిన్న కుమారుడు రవీంద్ర ఎంబిబిఎస్ పూర్తి చేసారు. డిఎస్పీ జుత్తు పాపారావు మృతికి విశాఖపట్నం రేంజ్ డిఐజి ఎల్.కే.వి.రంగారావు, విజయనగరం జిల్లా ఎస్పీ బి.రాజకుమారి, అదనపు ఎస్పీ (పరిపాలన) పి.సత్యన్నారాయణరావు, ఒఎడ్ ఎన్.సూర్యచంద్రరావు, ఎ బి అదనపు ఎస్పీ ఎన్.శ్రీదేవీ రావు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ప్రస్తుతం, పాపారావు కుటుంబ సభ్యులైన భార్య, పిల్లలు కూడా కరోనా బారిన పడి ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...