Followers

వాలీబాల్ కోర్టును పునరుద్ధరించాలని మంత్రి కొడాలి నానికి వినతి

వాలీబాల్ కోర్టును పునరుద్ధరించాలని మంత్రి కొడాలి నానికి వినతి 

గుడివాడ, పెన్ పవర్

గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం క్రీడాకారులకు ఒక వరమని, దీన్ని పట్టణ, పరిసర ప్రాంత క్రీడాకారులు వినియోగించుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) సూచించారు. సోమవారం గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని గుడివాడ పట్టణ, పరిసర ప్రాంతాలకు చెందిన వాలీబాల్ క్రీడాకారులు ఎం షణ్ముఖ్, జీ సుధాకర్, పీ భార్గవ్, ఎల్ రాజా తదితరులు కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుడివాడ పట్టణం ఎన్టీఆర్ స్టేడియంలోని వాలీబాల్ కోర్టును పట్టణ, పరిసర ప్రాంతాలకు చెందిన క్రీడాకారులు వినియోగించుకుంటున్నారని, తద్వారా క్రీడా నైపుణ్యాలు మెరుగుపడుతున్నాయన్నారు. ఎంతో మంది వాలీబాల్ క్రీడాకారులు స్టేడియం కమిటీ సహకారంతో ఉద్యోగ అవకాశాలను మెరుగుపర్చుకున్నారన్నారు. గుడివాడ పట్టణంలో ఇటీవల కాలంలో దాదాపు పది మందికి పైగా వాలీబాల్ క్రీడాకారులు ప్రభుత్వ ఉద్యోగాలను పొందారని చెప్పారు. ఇటీవల స్టేడియంలో వాలీబాల్ కోర్టును తొలగించారన్నారు. వాలీబాల్ క్రీడాకారులను స్టేడియంలోకి అనుమతించడం లేదని, దీనివల్ల క్రీడాకారుల భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఏర్పడిందన్నారు. క్రీడాకారుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని ఎన్టీఆర్ స్టేడియంలో వాలీబాల్ కోర్టును పునరుద్ధరించాలని వారు కోరారు. దీనిపై మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ వాలీబాల్ కోర్టు ఏర్పాటుకు సంబంధించి స్టేడియం కమిటీ సభ్యులతో మాట్లాడతానని చెప్పారు. క్రీడల అభివృద్ధికి ఎన్టీఆర్ స్టేడియం కమిటీ కృషి చేస్తోందని తెలిపారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో వివిధ స్థాయిల్లో క్రీడా పోటీలను నిర్వహిస్తూ పట్టణ, పరిసర ప్రాంత క్రీడాకారులను జాతీయస్థాయిలో రాణించేలా స్టేడియం కమిటీ ప్రోత్సహిస్తోందని మంత్రి కొడాలి నాని తెలిపారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...