కోవిడ్ -19 నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది..
👉 రాష్ట్రంలో పక్కా వ్యూహంతో కరోనా నియంత్రణ, నివారణకు సీఎం జగన్ చర్యలు
👉 గుడివాడ ప్రభుత్వాసుపత్రిలో కరోనా పరీక్షలు
👉 త్వరితగతిన ఫలితాలు వచ్చేలా కృషి చేస్తున్నాం
👉 రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
గుడివాడ, పెన్ పవర్
రాష్ట్రంలో పక్కా వ్యూహంతో కరోనా నియంత్రణ, నివారణకు సీఎం జగన్మోహనరెడ్డి చర్యలు చేపట్టారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. సోమవారం గుడివాడలో మంత్రి కొడాలి నానిని గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి సంఘం చైర్మన్ ఎంవీ నారాయణరెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రిలో వ్యాక్సిన్‌ను 24 గంటలూ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ప్రభుత్వాసుపత్రిలో కరోనా వైరస్ సోకిన అనుమానితులకు పరీక్షలు జరుగుతున్నాయని, శాంపిల్స్ ను విజయవాడ పంపుతున్నామన్నారు. ఫలితాలు రావడానికి ఆలస్యమవుతోందని చెప్పారు. గుడివాడ ప్రభుత్వాసుపత్రిలోనే ల్యాబ్ ను ఏర్పాటు చేసి కరోనా పరీక్షల ఫలితాలు త్వరితగతిన వచ్చేలా చూడాలని కోరారు. అలాగే ఎన్జీవోల అసోసియేషన్ గుడివాడ తాలూకా యూనిట్ అధ్యక్షుడు షేక్ ఫరీద్ భాషా, కార్యదర్శి గోగులమూడి రాజేంద్రప్రసాద్ లు మాట్లాడుతూ అసోసియేషన్ పరిధిలో ఎన్జీవోలు, వారి కుటుంబ సభ్యులు దాదాపు 1500 మంది ఉన్నారని, వీరందరికీ గుడివాడ ఎన్టీవో హెంలో ఒకేసారి కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ 24 గంటలూ ఖచ్చితంగా అందుబాటులో ఉండేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ ను ఆదేశించారు. ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రిలో కరోనా పరీక్షలు జరుగుతున్నాయని, ఫలితాలు కూడా వెంటనే వెలువడేలా చూడాలని, ఇందుకు అవసరమైన ల్యాబ్ ను సమకూర్చాలని అన్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే ఎన్జీవోల అసోసియేషన్ గుడివాడ తాలూకా యూనిట్ వినతి మేరకు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిని సీఎం జగన్మోహనరెడ్డి ఎప్పటికపుడు సమీక్షిస్తున్నారని చెప్పారు. జిల్లాస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు పనిచేసే మూడంచెల వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం రెండు ఉత్తర్వులను జారీ చేసిందన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిర్దేశిత రుసుం కంటే ఎక్కువ వసూలు చేయకుండా కట్టడి చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. అలాగే వైద్య సేవలను కూడా ఎప్పటికపుడు పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. జిల్లాలోని కోవిడ్ చికిత్స చేసే ఆసుపత్రులన్నింటినీ క్లస్టర్లుగా విభజించారని, క్లస్టర్ పరిధిలో అనుమతి లేకుండా కోవిడ్ చికిత్స చేసే ఆసుపత్రుల పైనా నిఘా పెట్టామన్నారు. జిల్లాస్థాయిలో ఫ్లైయింగ్ స్క్వాడ్ తనిఖీలు కూడా ఉంటాయన్నారు. జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్న క్లస్టర్లు, ఫ్లైయింగ్ స్క్వాడ్ పనితీరును సమీక్షించేందుకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను కూడా ఏర్పాటు చేశారన్నారు. విరివిగా పరీక్షలు నిర్వహించడం, కోవిడ్ పై ప్రజల్లో అవగాహన కల్పించడం, కోవిడ్ ఆసుపత్రుల్లో సీసీటీవీలు, హెల్ప్ డెస్క్ ఏర్పాటు, శానిటేషన్, ఫుడ్ క్వాలిటీ, వైద్యుల అందుబాటు, మందులు, ఆక్సిజన్ సరఫరా వంటి వాటిని ఎప్పటికపుడు పరిశీలించాలని సీఎం జగన్మోహనరెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని మంత్రి కొడాలి నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మండలి హనుమంతరావు, జిల్లా ఆదిమాంధ్ర సంఘం అధ్యక్షుడు పొంగులేటి జయరాజు, ప్రముఖులు తోట శివాజి, నిమ్మగడ్డ శివశంకర్, అడబాల అప్పారావు, గోళ్ళ సోమేశ్వరరావు, పందిళ్ళ మల్లి, పెద్ది కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment