మున్సిపాలిటీలో 1.47 కోట్లతో సి.సి రోడ్లు
నర్సీపట్నం, పెన్ పవర్
నర్సీపట్నం మున్సిపాలిటీలో 1.47 కోట్లతో సిసి రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ శంకుస్థాపనలు చేశారు. గురువారం ఉదయం 20వ వార్డులో ఆరు లక్షలతో నిర్మించనున్న సిమెంట్ రోడ్డుకు శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మున్సిపాలిటీలో నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత, తొలిసారి జరిగిన అభివృద్ధి కార్యక్రమంలో చైర్ పర్సన్ గుడబండి ఆదిలక్ష్మి మరియు కౌన్సిలర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. 28 వార్డులో 34.43 లక్షలతో రెండు రోడ్లు, 15 వార్డులో 23 లక్షలతో రెండు సిమెంట్ రోడ్లు, 12వ వార్డు లో 62 లక్షలతో రెండు రోడ్లు, 13వ వార్డులో 22 లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మించనున్నారు. వీటన్నింటికీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ శంకుస్థాపనలు చేసి శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఆయా వార్డుల్లో ఇప్పటికే పూర్తి చేసిన సిమెంట్ రోడ్లను పరిశీలించారు. 12వ వార్డు లో సచివాలయాన్ని సందర్శించి, ఉద్యోగుల హాజరును తనిఖీ చేశారు. సగం మందికి పైగా సిబ్బంది రాకపోవడం, వచ్చిన సిబ్బంది రిజిస్టర్లో సంతకం చేయకపోవడం ఎమ్మెల్యే గుర్తించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందికి మెమో ఇవ్వమని మున్సిపల్ కమిషనర్ కనకారావును ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఈరోజు జరిగిన అభివృద్ధి పనులన్నీ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు జరగాల్సి ఉందని, ఎన్నికల కోడ్ వల్ల జాప్యం జరిగిందన్నారు. ఈరోజు ఆర్థిక సంఘం నిధులతో మున్సిపాలిటీలో ఐదు వార్డుల్లో, 1.47 కోట్లతో ఆరు సిమెంట్ రోడ్లకు శంకుస్థాపనలు చేశామన్నారు. మరొక రెండు, మూడు నెలల్లో 10 కోట్ల రూపాయలతో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామన్నారు. వేసవి తరువాత అధికారులు, వాలంటీర్లతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తామని, ప్రజల ఇబ్బందులు, అవసరాలు గుర్తించి, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు వైస్ చైర్మన్ గొలుసు నరసింహమూర్తి, కౌన్సిలర్లు కోనేటి రామకృష్ణ, తమరాన అప్పలనాయుడు, మాకిరెడ్డి బుల్లిదొర, వీరమాచినేని జగదీశ్వరి, బోడపాటి సుబ్బలక్ష్మి, చినబాబు, స్టేట్ అయ్యరక కార్పొరేషన్ డైరెక్టర్ కర్రి కనకమహాలక్ష్మి, వైసిపి నాయకులు మీసాల సత్యనారాయణ, దాడి బుజ్జి, బేతిరెడ్డి విజయ్ కుమార్, బయపురెడ్డి గణమ్మ, చీటీల రాము, జి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment